కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టిస్తున్న కొత్త బాస్

కాంగ్రెస్ నేతలకు చెమటలు పట్టిస్తున్న కొత్త బాస్

వస్తూ వస్తూనే తన మార్క్‌ పనితీరుతో హడలెత్తిస్తున్నారు కాంగ్రెస్‌ నేత మాణిక్యం ఠాగూర్‌. పార్టీలో ఎవరు తోక జాడించినా కత్తెర వేస్తున్నారు. అదే పనిగా నోటికి పనిచెప్పేవారికి తాళం వేస్తే.. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు నినాదాలు ఇచ్చినా ఊరుకోవడం లేదట. దీంతో ఈ ఠాగూరేంటో.. ఆయన వైఖరేంటో అర్థం కావడం లేదట నాయకులకు. 

అమ్ముల పొదిలోని ఒక్కో అస్త్రం బయటకు తీస్తున్నారా?

తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంఛార్జ్‌గా వచ్చినప్పటి నుంచి  ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ పార్టీ నేతలకు ఓ పట్టాన అంతుచిక్కడం లేదట. ఆయన కొరకరాని కొయ్యగా మారిపోయారని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. ఏదో జూనియర్లను అంటే పార్టీలో పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కాకపోతే సీనియర్‌ నేతలకు కూడా ఠాగూర్‌ లక్ష్మణ రేఖ గీయడంతో అంతా హడలిపోయారు. మరి.. ఇక్కడితో ఆగుతారో.. మరిన్ని చర్యలు ఉంటాయో అని అనుకుంటున్న తరుణంలోనే తన అమ్ముల పొదిలో నుంచి ఒక్కో అస్త్రాన్ని బయటకు తీస్తున్నారు కొత్త ఇంఛార్జ్‌. 

ఇక్కడి పరిస్థితులు తెలిసే కొద్దీ కఠినంగా ఉంటోన్న ఠాగూర్‌!

ఎవరు మాట వినకపోయినా.. తేడా వచ్చినా సోనియాగాంధీ ముందు నివేదిక పెడతానని ముఖం మీదే చెప్పేస్తున్నారట మాణిక్యం ఠాగూర్‌. రాష్ట్రానికి కొత్తగా వచ్చారు కదా.. రాన్రానూ ఆయనే అర్ధం చేసుకుంటారని అనకున్నవారికి కూడా క్రమంగా తత్వం బోధపడుతోందట. ఏమైందో ఏమో కానీ.. తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకునే కొద్దీ ఠాగూర్‌ స్ట్రిక్ట్‌ అయిపోతున్నారు. అదే ఇప్పుడు పార్టీనేతలకు టెన్షన్‌ పెడుతోందట. 

ఇప్పటికే  వీహెచ్‌ దారిలోకి వచ్చేశారా?

అప్పగించిన పని చేసుకుని పోయే వారితో ఇబ్బంది లేదు కానీ.. అసలు కంటే కొసరు పనులు చేసే  వారితోనే అసలు సమస్య అని పార్టీ వర్గాలు కామెంట్స్‌ చేస్తున్నాయి. ఇప్పటికే వీ హన్మంతరావు లాంటి వారు మాట దొర్లకుండా జాగ్రత్త పడుతున్నారు. సమావేశానికి పిలిస్తే వస్తున్నారు. అలాగే దుబ్బాకలో గ్రామాల వారీగా బాధ్యతలు అప్పగించిన నాయకులు అక్కడికే పరిమితమయ్యారు. 

పార్టీ కోసం రూ.2 లక్షలు పెట్టలేరా? అని నిలదీత!

ఇంత వరకూ బాగానే ఉన్నా దుబ్బాకలో అభ్యర్థిని  డబ్బులు అడగొద్దని హుకుం జారీ చేశారట మాణిక్యం ఠాగూర్‌. ఏ గ్రామంలో ఖర్చు ఆ నాయకుడే భరించాలని తేల్చి చెప్పేశారట.  ఏం..!  పార్టీ కోసం 2 లక్షలు పెట్టలేరా? అని ముఖం మీదే చెప్పేస్తున్నారట. ఇదే కాదు.. ఇటీవల దుబ్బాకలో జరిగిన ఓ సమావేశంలో ఠాగూర్‌ సీరియస్‌గానే వార్నింగ్‌ ఇచ్చారట. సమావేశం జరుగుతుంటే.. ఓ నాయకుడు ఆలస్యంగా వచ్చారు. ఆ నేత వెంట వచ్చిన వారు జిందాబాద్‌ అని నినాదాలు చేశారట. సభలో ఉన్నవాళ్లు కూడా నినాదాలు అందుకున్నారట. అక్కడే ఉండి ఇవన్నీ చూసిన ఇంఛార్జ్‌.. వెంటనే కార్యకర్తలకు ఆదేశాలిచ్చారట. ఇకపై ఎక్కడైనా..  కేవలం జై కాంగ్రెస్‌, జై సోనియా నినాదాలు తప్పితే మరో స్లోగన్‌ వినిపించకూడదని స్పష్టం చేశారట. 

స్టేజ్‌ మీద నాయకులు సైలెంట్‌ అయ్యారా?

ఠాగూర్‌ ఈ మాట చెప్పగానే స్టేజ్‌ మీద నాయకులు సైలెంట్ అయిపోయారట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంఛార్జ్‌ తీసుకొస్తున్న ఈ మార్పులు కొందరికి సంతోషం కలిగిస్తున్నా.. ఇంకొందరికి రుచించడం లేదట. కాకపోతే కాలం కలిసిరానప్పుడు మౌనంగా ఉండటమే బెటర్‌ అని  పెదవి విప్పడం లేదట. మరి.. నేతలు ఎన్నాళ్లిలా మౌనంగా ఉంటారో.. లేక ఠాగూర్‌ మరిన్ని అస్త్రాలు బయటకు తీస్తారో చూడాలి.