ఆర్టీసీ కార్మికులతో సీఎం భేటీ ఖరారు.. ప్రతీ డిపో నుంచి ఐదుగురికి ఆహ్వానం..

ఆర్టీసీ కార్మికులతో సీఎం భేటీ ఖరారు.. ప్రతీ డిపో నుంచి ఐదుగురికి ఆహ్వానం..

ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ చెబుతూ గురువారం కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.. త్వరలోనే యూనియన్లతో సంబంధం లేకుండా నేరుగా ఆర్టీసీ కార్మికులతోనే సమావేశం కానున్నట్టు తెలిపిన సంగతి తెలిసిందే... ఇక, డిసెంబర్ 1వ తేదీన ఆర్టీసీ కార్మికులతో ప్రగతి భవన్‌లో సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు సీఎం కేసీఆర్.. రాష్ట్రంలోని మొత్తం 97 ఆర్టీసీ డిపోల నుంచి కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించనున్నారు. డిపోకి ఐదుగురు కార్మికుల చొప్పున.. వీరిలో ఇద్దరు మహిళా కార్మికులు కచ్చితంగా ఉండేలా చూడాలని.. వారు సమావేశానికి రావడానికి తగిన ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మను ఆదేశించారు సీఎం కేసీఆర్. ఆదివారం రోజు మధ్యాహ్నం కార్మికులతో సమావేశమై ఆర్టీసీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించనున్నారు కేసీఆర్.. ఆర్టీసీ ఎదుర్కొంటున్న సమస్యలు, అప్పులు, ఆస్తులు తది అంశాలపై చర్చింస్తారు.. ఇక, ప్రగతి భవన్‌లోనే కార్మికులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నారు.. ఈ సమావేశానికి ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ, ఈడీలు, ఆర్ఎంలు, డీవీఎంలను కూడా ఆహ్వానించారు. మధ్యాహ్న భోజనం తర్వాత సమావేశం కానున్నారు.