వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

వ్యవసాయ విధానంపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

మారుతున్న ప్రజల ఆహార అలవాట్లకు అనుగుణంగా ఉత్పత్తులు వచ్చేలా సాగు జరగాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో వ్యవసాయం పరిణితి సాధించడానికి స్వల్ప, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. వ్యవసాయాధారిత పరిశ్రమలకు నిరంతరం ముడి సరుకు అందించే విధంగా,  వేసిన పంటంతా పూర్తిగా అమ్ముడయ్యే విధంగా తెలంగాణలో పంటసాగు జరగాలంటున్నారాయన. అగ్రి బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆగ్రో ఇండస్ట్రీ అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు నిపుణులతో సమావేశమై చర్చించారు. 

రైతు పండించిన పంట యథావిథిగా ప్రస్తుత మార్కెట్లో అమ్ముతున్నారని... అలా కాకుండా దానికి వాల్యూ యాడ్‌ చేస్తే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉందన్నది ప్రభుత్వ మాట. అందుకేపెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతోంది. వాటికి కావాల్సిన ముడి సరుకు నిత్యం అందించగలిగేలా సంఘటిత వ్యవసాయం సాగాలని... నాణ్యమైన సరుకు తయారీతో తెలంగాణ బ్రాండ్‌కు ఓ ఇమేజ్ ఏర్పడుతుందన్నారు కేసీఆర్‌.  రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెద్ద సంఖ్యలో వచ్చేటట్టు చేస్తే ఇటు పారిశ్రామిక, సేవా రంగాలు కూడా విస్తరిస్తాయని లెక్క కడుతోంది ప్రభుత్వం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పంట మార్పిడి కూడా జరగాలని... ఇదంతా రైతులకు అర్ధమయ్యేలా చెప్పాలని సూచించారు కేసీఆర్‌. వ్యవసాయంలో మార్పులపై దృష్టిపెట్టిన ప్రభుత్వం...  సంస్కరణలు వెంటనే అమల్లోకి వచ్చేలా కసరత్తు చేస్తోంది. దీనివల్ల ఖచ్చితంగా పరిస్థితిలో మార్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.