వరదబాధితులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. 7 నుంచి మళ్లీ ఇస్తాం..

వరదబాధితులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. 7 నుంచి మళ్లీ ఇస్తాం..

హైదరాబాద్‌ను ఎప్పుడూ లేని విధంగా వర్షాలు, వరదలు ముంచెత్తాయి.. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే, వరద బాధితులను సాయం ప్రకటించిన ప్రభుత్వం.. కొంతవరకు వరదసాయాన్ని అందించింది.. ఇదే సమయంలో.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో.. వరదసాయం పంపిణీ నిలిచిపోయింది. అయితే, వరద బాధితులకు శుభవార్త చెప్పారు తెలంగాణ సీఎం కేసీఆర్.. ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... డిసెంబర్‌ 7 నుంచే మళ్లీ  వరదసాయం అందిస్తామని చెప్పారు.  హైదరాబాద్‌ వరదలు చూసి చలించిపోయా. లక్షల మంది పేదల బతుకులు ఆగమవడం చూసి చాలా బాధపడ్డాను. బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎలాంటి సాయం చేయలేదు.. కానీ, దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఆరున్నర లక్షల కుటుంబాలకు సాయం అందజేశామని వెల్లడించారు కేసీఆర్.. గ్రేటర్ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్‌ పోతుంది.. ఆ తర్వాత డిసెంబర్‌ 7వ తేదీ తర్వాత వరద సాయం అందని వారికి అందిస్తాం అన్నారు. 

ప్రజలకు హామీ ఇస్తున్నా.. మరో రూ.300 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడదు అన్నారు సీఎం కేసీఆర్‌... అర్హులైన ప్రతీ ఒక్కరికీ సాయం అందిస్తామని ప్రకటించిన ఆయన.. ప్రధానిని రూ.1300 కోట్ల సాయం అడిగితే 13 పైసలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.. మేం భారతదేశంలో లేమా.  బెంగళూరు, అహ్మదాబాద్‌ నగరాలకు సాయం ఇవ్వలేదా? అంటూ మండిపడ్డారు. వరద సాయాన్ని అడ్డుకోవడం విజ్ఞతా...? అని ప్రశ్నించారు. వరదసాయం చేయాలని నన్ను ఎవరూ అడగలేదు... కనీసం దరఖాస్తు కూడా పెట్టుకోలేదు.. వరదలు వచ్చిన ఏ నగరంలోనూ ప్రభుత్వాలు సాయం చేయలేదు.. కానీ, ఇక్కడ వరదసాయం చేస్తుంటే కొందరు కిరికిరి పెట్టారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఏ నగరంలోనూ ఇవ్వని విధంగా 6.5లక్షల మందికి రూ.650 కోట్లు ఇచ్చామన్న తెలంగాణ సీఎం.. ఈసీకి కంప్లైంట్‌ చేసి కొందరు వరదసాయం బంద్‌ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.