ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌.. సీఎం కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు

ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్‌.. సీఎం కేసీఆర్ కీల‌క సూచ‌న‌లు

కరోనా అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుని, దేశంలో వైద్య సదుపాయాలను పెంచే విషయంపై దృష్టి పెట్టాలని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి సూచించారు తెలంగాణ సీఎం కేసీఆర్... పది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కేసీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వైద్య సదుపాయాలను పెంచాల్సిన అవసరాన్ని కరోనా గుర్తు చేసింద‌న్నారు.. కరోనా అనుభవాలు మనకు పాఠం నేర్పాయి. దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంద‌న్న ఆయ‌న‌... వైద్య రంగంలో భవిష్యత్ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంలో విజనరీతో ఆలోచించాల‌న్నారు. సమగ్ర వైద్య సదుపాయాల కోసం ప్రణాళిక వేయాలి. కేంద్రాలు, రాష్ట్రాలు కలిసి ఈ ప్రణాళిక అమలు చేయాలి. గతంలో మనకు కరోనా లాంటి అనుభవం లేదు.. ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో కూడా తెలియదు.. దీనిని ఎదుర్కొంటూనే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు వస్తే ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విషయంపై దృష్టి పెట్టాల‌ని సూచించారు కేసీఆర్.

గతంలో కూడా అనేక వైరస్‌లు ప్రజలను ఇబ్బంది పెట్టాయి. కరోనా వైరస్ లాంటివి భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంద‌న్న సీఎం కేసీఆర్... వైద్య రంగంలో ఏ విపత్కర పరిస్థితి తలెత్తినా సరే తట్టుకునే విధంగా మనం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలి. జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత మంది డాక్టర్లు ఉండాలి? ఇంకా ఎన్ని మెడికల్ కాలేజీలు రావాలి? లాంటి విషయాలను ఆలోచించాలి.. ఐఎంఏ లాంటి సంస్థలతో సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలి.. ఇది త‌ప్ప‌కుండా ఆలోచించాల్సిన విష‌యం అంటూ కీల‌క సూచ‌న‌లు చేశారు. కరోనా లాంటివి భవిష్యత్తులో ఏమి వచ్చినా సరే తట్టుకుని నిలబడే విధంగా వైద్యరంగం తయారు కావాలి. దీనికోసం ప్రధాన మంత్రి చొరవ తీసుకోవాల‌ని కోరిన కేసీఆర్.. కేంద్ర, రాష్ట్రం కలిసికట్టుగా పని చేసి, దేశంలో వైద్య సదుపాయాలు పెంచాల్సిన అవసరం ఉంద‌న్నారు. ఇక‌, తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ చ‌ర్య‌ల‌పై ప్ర‌ధాని వివ‌రించిన సీఎం.. క‌రోనా క‌ట్ట‌డికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో రికవరీ రేటు 71 శాతం ఉంది. మరణాలు రేటు 0.7 శాతం ఉంది. పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచాం.. కరోనా సోకినవారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. కావల్సినన్ని బెడ్లు, మందులు, ఇతర పరికరాలు, సామాగ్రి సిద్ధంగా ఉంచామ‌న్నారు. ఐసీఎంఆర్, నీతి ఆయోగ్, కేంద్ర బృందాల సలహాలు పాటిస్తున్నాం.. వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇతర ప్రభుత్వ యంత్రాంగం అంతా శక్తి వంచన లేకుండా పని చేస్తుంద‌ని వివ‌రించారు సీఎం కేసీఆర్.