బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఎంత మంది వస్తారు..?

బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఎంత మంది వస్తారు..?

గ్రేటర్‌ ఎన్నికల ప్రచారానికి కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నేతలు సైతం రావడంపై సెటైర్లు వేశారు తెలంగాణ సీఎం కేసీఆర్... ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ... ఒక బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఎంత మంది వస్తారు? అంటూ ప్రశ్నించారు. యూపీ నుండి కర్ణాటక నుండి వస్తున్నారు... ఇది జాతీయ ఎన్నికలా? మున్సిపల్ ఎన్నికలే కదా అని వ్యాఖ్యానించారు. వరదల్లో మునిగినం.. ఆదుకోండి అని అంటే పైసా ఇవ్వలేదు... కానీ, ఓట్లని ఇప్పుడు వరదలా వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక, నేను ఢిల్లీకి పోతున్నా అని అక్కడి వాళ్లకు వణుకు పుట్టిందన్నారు సీఎం కేసీఆర్... అందుకే విన్నీ ఇక్కడే అనగబట్టాలని అందరూ ఇక్కడికి వస్తున్నారు అని మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌ సీఎంకి అసలు టికానే లేదు... ఆయన నాకు నీళ్లు ఇస్తాడట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్.. యూపీ 25 ర్యాంకుల్లో ఉంది.. 25వ ర్యాంకోడు వచ్చి ఐదో ర్యాంక్‌ వచ్చిన మనకు చెప్తాడట అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు.. టెంటే లేదు.. ఫ్రెంట్ పెడతారట అంటున్నారు.. ఫ్రెంట్ పెడుతున్న అని ఎవడు చెప్పిండు? అని ప్రశ్నించారు. మేం ఏట్లోస్తామో చూపెడతా అన్నారు. తెలంగాణ ఉద్యమం సాధనలో కూడా ఇట్లాంటి మాటలే అన్నారు అని గుర్తు చేసుకున్న ఆయన.. ఇతర రాష్ట్రాల నుండి వచ్చినోడిది నెత్త కాదు.. కత్తి కాదు.. మాటలు చెప్పి పోతారు... మీ తలపుండు కడిగేది నేనే.. ఆలోచించండి అని విజ్ఞప్తి చేశారు. ఇక, హైదరాబాద్‌ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డా మావారే అని చెప్పాం. దేశం నలుమూలల నుంచి వచ్చిన వారిని మా బిడ్డలుగానే చూస్తున్నాం. ప్రభుత్వం ఎలా పనిచేస్తోంది? అనే చర్చ ప్రజల్లో జరగాలి.  ప్రభుత్వ పనితీరుపై చర్చ జరిగినప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది.  ఓటు వేసేముందు ప్రజలు విచక్షణతో ఆలోచించాలి. పార్టీలకు ఓటు వేసేముందు ప్రజలు ఆలోచించాలి.  అప్పుడే మంచినేతలు రాజకీయాల్లో ఉంటారు.  ఎన్నికలు చాలా జరుగుతుంటాయి.  ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో చర్చ జరగాలి. నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి ఓటు వేయాలని కోరారు సీఎం కేసీఆర్.