ఇవాళే తేల్చేయనున్న సీఎం కేసీఆర్..!

ఇవాళే తేల్చేయనున్న సీఎం కేసీఆర్..!

క‌రోనా కంట్రోల్ విష‌యంలో  తెలంగాణ సీఎం కేసీఆర్ దూర‌దృష్టితో వ్యవహరిస్తున్నారు. క‌రోనా విష‌యంలో క‌ఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వ్యాక్సిన్ గానీ, మెడిసిన్ గానీ లేని క‌రోనాకు లాక్ డౌన్ మాత్రమే మందుగా భావిస్తున్నారు. జ‌న‌తా క‌ర్ఫ్యూ త‌ర‌వాత మ‌రుస‌టి రోజు నుంచే  లాక్ డౌన్‌కు వెళ్లాల‌ని నిర్ణయం తీసుకున్నారు. ఆ త‌ర్వాతి రోజునుంచే లాక్ డౌన్ త‌ప్పద‌నే సంకేతాలు పంపారు. 21 రోజుల లాక్ డౌన్ పూర్తి కావ‌డానికి వారం రోజుల ముందే  పొడిగింపు అవ‌స‌ర‌మ‌ని, కేంద్రం చేయ‌క‌పోయినా తెలంగాణ‌లో తప్పద‌న్నారు. ఇక, దేశ‌వ్యాప్తంగా 170 జిల్లాల‌ను హ‌ట్ స్పాట్ జిల్లాలుగా  కేంద్రం ప్రకటించింది. ఈనెల 20 త‌ర్వాత ఈ జిల్లాల‌ను మిన‌హాయించి మిగిలిన జిల్లాల్లో  లాక్ డౌన్ గైడ్ లైన్స్ స‌డలించాల‌ని సూచించింది. పాజిటివ్ కేసులు ఇంకా న‌మోదు అవుతుండ‌టం, కొన్ని చోట్ల ప‌దుల సంఖ్యలో కేసులు వ‌స్తుండ‌టంతో.. సీఎం కేసీఆర్ పున‌రాలోచ‌న‌లో ప‌డ్డారు. ఇన్నాళ్లు క‌ఠినంగా  లాక్ డౌన్ పాటించామని, ఇప్పుడు సడలిస్తే కొత్త సమస్యలు వస్తాయని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని జిల్లాల‌ను వ‌దిలేసి మిగ‌తా చోట్ల అమ‌లు చేయ‌డం దాదాపు అసాధ్యమ‌నే  భావ‌న‌లో ఉన్నారు. 

అయితే, ఇవాళే దీనిపై ఓ నిర్ణయానికే వచ్చే అవకాశం ఉంది కేసీఆర్.. ఇవాళ జ‌రిగే కేబినెట్ స‌మావేశానికి ముందే తెలంగాణ‌లో ప్రస్తుత ప‌రిస్థితుల‌పై కేసీఆర్ స‌మీక్ష చేయ‌నున్నారు. హాట్ స్పాట్లలో ప‌రిస్థితి, కొత్త కేసుల న‌మోదుపై స‌మ‌గ్రంగా చ‌ర్చించ‌నున్నారు. ఈనెల 20 త‌ర్వాత కేంద్రం ఆంక్షలు సడలించినా.. యథాతథంగా మే 3 వరకు అమలు చేయాలనేది కేసీఆర్ ఆలోచనగా కనిపిస్తోంది. మరి.. కేంద్రం సూచించినవాటికి రేపటి నుంచి మినహాయింపు ఇస్తారా? లేదా కేంద్రంతో సంబంధం లేకుండా లాక్‌డౌన్ యథావిథిగా కొనసాగాస్తారా? సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది.