లాక్‌డౌన్‌ 4.0.. కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ..!

లాక్‌డౌన్‌ 4.0.. కేసీఆర్‌ నిర్ణయంపై ఉత్కంఠ..!

కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించింది కేంద్రం ప్రభుత్వం... ఇప్పటికే ఇచ్చిన సడలింపులకు అదనంగా కొన్ని జోడించి.. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంలో కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేశారు. అయితే, ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంపై పడింది.. కేంద్రం మే 17 వరకు లాక్‌డౌన్ పొడిగించిన సమయంలో.. తెలంగాణలో మాత్రం మే 29వ తేదీ వరకు లాక్‌డౌన్ ఉంటుందని ప్రకటించారు కేసీఆర్.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కంటే.. అదనంగా రెండు రోజులు కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో.. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై ఇవాళ కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారు.. దీనికోసం ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌‌ సమావేశం జరగనుంది. అయితే, రాష్ట్రంలో జూన్‌‌ నాల్గో తేదీ వరకు లాక్‌డౌన్‌‌ పొడిగించాలని సీఎం కేసీఆర్‌‌ నిర్ణయించినట్టు సమాచారం.. గోదావరి నీటి వినియోగంపై ఆదివారం మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించిన సీఎం.. అదే సమయంలో.. కేంద్రం విడుదల చేసిన లాక్‌డౌన్ 4.0 మార్గదర్శకాలపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. ఇవాళ జరగనున్న కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో అమలువుతోన్న లాక్‌డౌన్, కరోనా తాజా పరిస్థితి, కేంద్రం తాజా గైడ్‌లైన్స్‌పై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. అయితే, కేంద్రం నిర్ణయం ప్రకారం ఈ నెల 31 వరకే లాక్‌డౌన్‌ పొడిగిస్తారా..? లేక సడలింపులతో మరికొంత సమయంలో లాక్‌డౌన్‌ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంటారా? అనేది ఉత్కంఠగా మారింది.