కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై దృష్టి పెట్టిన కేసీఆర్...!

కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై దృష్టి పెట్టిన కేసీఆర్...!

కీలకాంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. 15 రోజుల వ్యవధిలోనే రెండోసారి భేటీ అవుతుండడంతో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, కేంద్ర విధానాలు, ఖర్చు తగ్గించుకోవడం పైనే చర్చ జరగనుంది. తాజాగా ఇరిగేషన్, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై సీఎం సమీక్ష కూడా చేశారు. ఇరిగేషన్ పై సమీక్ష సందర్భంగా సీఎం కీలకమైన రెండు నిర్ణయాలు తీసుకున్నారు. దుమ్ముగూడెం వద్ద.. జలవిద్యుత్ ఉత్పత్తికి, గోదావరి నీటి నిల్వకు ఉపయోగపడే విధంగా బ్యారేజి నిర్మించడం. రెండోది కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మిడ్‌మానేరుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేయడం. ఈ రెండు పనులకు వెంటనే అంచనాలు రూపొందించి, టెండర్లు పిలవాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. దుమ్ముగూడెం బ్యారేజి, మిడ్ మానేరుకు మూడు టీఎంసీల నీటిని లిఫ్టు చేసే పనులకు మొత్తం రూ.13,500 కోట్ల నుంచి రూ.14,000 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పై  సీఎం సమీక్ష జరిపారు.. ఈ విషయంపై కేబినెట్‌లో చర్చించాలని నిర్ణయించారు. తమ శాఖల్లో ఖర్చులు తగ్గించుకోవాలని మంత్రులకు సీఎం ఆదేశాలు ఇచ్చే అవకాశముంది. ఈసందర్భంగా కేంద్ర విధానాలపైనా చర్చించే అవకాశముంది. మరోవైపు అసెంబ్లీ సమావేశాలు, మునిసిపల్ ఎన్నికల పై కూడా కేబినేట్ లో చర్చించే అవకాశం ఉంది. పౌల్ట్రీ రంగం అభివృద్ధి కోసంఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికను కేబినెట్‌ ఆమోదించే అవకాశం కనిపిస్తోంది.