తెలకపల్లి రవి : వివేకా హత్య కేసు క్లిష్టం చేసిన ఎబివి లేఖ

తెలకపల్లి రవి : వివేకా హత్య కేసు క్లిష్టం చేసిన ఎబివి లేఖ

ఎపి ఇంటలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఎబివెంకటేశ్వరరావు వ్యవహారం ఎడతెగని వివాదంగా మారడం అక్కడి రాజకీయ పరిస్థితికి ప్రతిబింబమే.అధికార యంత్రాంగం టీడీపీ వైసీపీ మధ్య రెండుగా చీలిన ఫలితమిది. ఎవరి భావాలు ఏమైనా అధికారులు అందులోనూ ఐఎఎస్‌ ఐపిఎస్‌ అధికారులు అప్పుడున్న ప్రభుత్వ ప్రకారం సిందే. భిన్నాభిప్రాయాలు చెప్పొచ్చు కానీ అంతిమ నిర్ణయం ప్రభుత్వానిదే అవుతుంది. అప్పుడున్న ప్రభుత్వాధినేత మెప్పుకోసం వారు చెప్పిన వన్నీ చేసిన ఉన్నతాధికారులు  ఆ సర్కారు మారితే సమస్యలో చిక్కుకోవడం చాలా సార్లు జరిగింది. అందులో టీడీపీ వైసీపీ మధ్య అసహనం తాండవిస్తున్న నేపథ్యంలో ఇది మరింత తీవ్రంగా జరుగుతుంది. రాజ్యాంగ వ్యవస్థగా వున్న ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ విషయంలో ఇది పరాకాష్టకు చేరడం చూశాం. వాస్తవానికి ఎబి వెంకటేశ్వరరావు వివాదం అంతకన్నా తక్కువది కాదు. కాకపోతే ఆయన ప్రభుత్వ యంత్రాంగంలో భాగం కనుక నేరుగా చర్య తీసుకోగలిగారు. ఎబివి తోడ్పాటుతో ఆయన  కుమారుడి సంస్థ విదేశాల నుంచి అక్రమంగా నిఘా పరికరాలు తెప్పించడంలో నిబంధనలు పాటించలేదన్న ఆరోపణపై సస్పెండ్‌ చేశారు. తర్వాత  సుప్రీం కోర్టు వరకు ఆ కేసు వివిధ ములుపులు తిరిగింది. ఏమైనా చివరకు విచారణ కమిషన్‌ వేసి త్వరగా నిర్ధారించాలని న్యాయస్థానం ఆదేశించింది. వేగంగా చేయమని ఆదేశాలు వచ్చినందుకు సంతోషం వెలిబుచ్చిన ఎబివి మరోవైపు ఆ విచారణ కమిషన్‌ బయిట తన ఎదురుదాడి కొనసాగించారు. ఇదివరకటి ఐఎఎస్‌లు తనకు వ్యతిరేకంగా ఫోర్జరీ పత్రాలు సృష్టించి కేసు పెట్టారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ఈ కారణంగా సీబీఐ నేరుగా దర్యాప్తు జరపాలని కోరారు. విచారణ కమిషన్‌ నివేదిక రాకుండానే బయట మాట్లాడటం, సాటి అధికారుపై ఆరోపణలు చేయడం మామూలు సర్వీసు నిబంధన ప్రకారం చెల్లుబాటు కావు. ఈ విషయమై కోర్టుకు కూడా వెళతానన్న ఎబివి నిస్సందేహంగా ఆ పని చేసి ఉండొచ్చు, కానీ బహిరంగ ఆరోపణలు చేయడం వివాదం పెట్టుకోవడమే అవుతుంది.

        అంతటితో ఆగక తదుపరి దశలో ఆయన వివేకానందరెడ్డి హత్య కేసు వివాదం తీసుకొచ్చారు. ప్రస్తుతం సీబీఐ దర్యాప్తులో వున్న ఆ కేసుకు సంబంధించి తన దగ్గర కీలకమైన సమాచారం ఉందని లేఖ రాసినా సిబిఐ తరపున బాధ్యత వహిస్తున్న ఎంకెసింగ్‌,సిట్‌ స్పందించలేదని ఆరోపించారు.తీరా ఆయన వెల్లడించిన సమాచారం కొత్తగా అంటే అదీ లేదు. 2019 మార్చి15న హత్య జరిగిన రోజు తమ సిబ్బంది వెళ్లినప్పుడు ఎంపి అవినాశ్‌రెడ్డితో సహా ఆ ఇంట్లో వుండి తమ వారిని లోనికి రానివ్వలేదని ఆయన సమాచారం. వివేకానంద గుండె జబ్బుతో చనిపోయారని చెప్పడం,  ఆధారాలు శుభ్రం చేయడం తప్పని అప్పుడే వార్తలు వచ్చాయి. అవినాశ్‌ రెడ్డిని విచారించారు కూడా. ఇటీవల వివేకా కుమార్తె సునీత వెల్లడించిన అనుమానితుల జాబితాలో ఆ పేరు కోర్టుకు సమర్పించినట్టు చెప్పారు. మరి కొత్తదనమేమిటి?నిజంగా కొత్తదనమే వుంటే సస్పెన్షన్‌కు ముందే వాటిని పంచుకోవడం ఎబివి బాధ్యత కదా? ఈ ప్రశ్నలు ముందుకొచ్చాయి. పోలీసు శాఖపైన  ఆరోపణు చేయడంతో సమాధానం ఇవ్వడానికి టెక్నికల్‌ డిఐజి పాలరాజు ముందకొచ్చారు. ఆయన కూడా ఎబివి విధి నిర్వహణ గుర్తు చేస్తూ మీరెందుకు సీల్డ్ కవర్‌ లో పంపించలేదని ప్రశ్నించారు. పైగా జగన్‌ కుటుంబ సభ్యులను అరెస్టు చేయాని అప్పట్లో ఎబివి ఒత్తిడి తెచ్చినట్లు ప్రత్యారోపణ చేశారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం క్రమశిక్షణ చర్య నోటీసు ఇచ్చింది. ఈ విధంగా ఆయన లేఖ చినికిచినికి గాలివానగా  పెద్ద వివాదానికి దారితీసింది. ఈ క్రమంలో వివేకా హత్య కేసు మరింత సంక్లిష్టం కావచ్చు. సీబీఐ ఎందుకు త్వరితంగా పరిష్కరించకపోవడం ఇంతకూ మూల కారణం,