తెలకపల్లి రవి : తీవ్రమైన తిరుపతి సమరం, వెంకన్న చుట్టూ రాజకీయం

తెలకపల్లి రవి : తీవ్రమైన తిరుపతి సమరం, వెంకన్న చుట్టూ రాజకీయం

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పదేపదే వెంకటేశ్వర స్వామి ప్రస్తావన తీసుకురావడం అసంబద్దంగా అనుచితంగా కనిపిస్తోంది. ఏదో యథాలాపంగా ఆ ప్రస్తావన తేవడం కాదు. పార్టీలు  పనిగట్టుకుని పదేపదే వెంకన్న ముచ్చట తీసుకొస్తున్నాయి. ఇష్టానుసారం వ్యాఖ్యానిస్తున్నాయి. మామూలుగానే చాలా ఏళ్లుగా తిరుపతి దేవుణ్ణి, టిటిడి వ్యవహారాల వివాదం చేయడం పరిపాటిగా మారింది. టిడిపి వైసీపీ అంతకు ముందు కాంగ్రెస్‌ ఎవరు అధికారంలో వున్నా అవతలివారు తమ రాజకీయ క్రీడల కోసం టిటిడిని తిరుమల క్షేత్రాన్ని ముందుకు తెస్తుంటారు. గతంలో పింక్‌ డైమండ్‌, అన్యమత ప్రచారం అంటూ ఈ రెండు పార్టీూ ప్రచారం చేశాయి. బిజెపి  రాజకీయాల్లో  ఎప్పుడూ మతాలు దేవుళ్లు ఉంటూనే ఉంటారు కనుక తిరుపతికి అది ప్రత్యేకం కాదు. ఎవరైనా వారి భక్తి విశ్వాసాలు మతాచారాలు పాటించవచ్చు గాని వాటిని రాజకీయాల్లోకి జొప్పించడమే సమస్యకు దారితీస్తుంది.

అంతర్వేది నుంచి రామతీర్థం వరకూ జరిగిన రాజకీయంలో హిందూ వర్సెస్‌ క్రైస్లవ ప్రచారం బాగా పనికి వస్తుందని బిజెపి జనసేన టిడిపి భావించాయి. జగన్‌ ప్రభుత్వం క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తుంది గనక హిందూ వ్యతిరేకతను పెంచుతూ ఈ దాడులకు కారణమవుతున్నదనే ప్రచారం నడిచింది. అయితే స్థానిక ఎన్నికల్లో అవన్నీ అక్కరకు రాకపోగా వైసీపీ మొత్తం తుడిచి పెట్టేసింది. పైగా ఎపిలోనూ తెలంగాణలోనూ బిజెపి వారితో కలిసిన వారు మజ్లిస్‌ వంటిపార్టీలు  ఎంత ప్రచారం చేసినా ప్రజల మతసామరస్యాన్ని లౌకిక తత్వానికి కోరుకుంటారు తప్ప ఉత్తరాదిలో వాతావరణం కనిపించదని మరోసారి తేలిపోయింది. ఆ ప్రచారాల వూపులో తిరుపతి ఉప ఎన్నిక హడావుడి మొదలు పెట్టిన వారు స్థానిక ఫలితాల తర్వాత తేలిపోవలసి వచ్చింది. అయినా ఆశచావక ఆ వాదనలే పట్టుకు వేళ్లాడుతుండగా వైసీపీ కూడా తనే అసలైన హిందూ మత రక్షకురాలిగా కనిపించేందుకు పాచికలు వేయడం మొదుపెట్టింది.

ఈ క్రమంలో అందరికంటే దూరం వెళ్లి మాట్లాడిరది జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. వైసీపీకి ఓటు వేస్తే వెంకన్నకు ద్రోహం చేసినట్లేనని ఆయన అనడం ఇందుకు పరాకాష్ట. ఎన్నికల నిబంధన ప్రకారం ఇది సరికాదు. ఈ లోగా పునర్నియామకం పొందిన మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి జగన్‌ను కలుసుకున్నారు. ఆయనను విష్ణుమూర్తి స్వరూపంగానే అభివర్ణించారు. తిరుమల సందర్శనకు వెళ్లిన చంద్రబాబు దీనిపై విమర్శిస్తూ వెంకటేశ్వర స్వామి మన అతి పెద్ద ఆస్తి అన్నారు. మనుషులను  దేవుళ్లతో పోల్చకూడదన్నారు. వెంకటేశ్వరుడి జోలికి వస్తే బతుకే వుండదని లోకేశ్‌ అన్నారు. తిరుమలలో అన్య మత ప్రచారమనే ఆధారం లేని కథలు బిజెపి టిడిపి వినిపిస్తూనే ఉన్నాయి. తిరుపతి ఉప ఎన్నికలు  రాష్ట్ర సమస్యలపై గాక మత కోణంలోకి మరల్చానే  ప్రయత్నం పెద్దగా స్పందన లేకపోయినా ఈ శిబిరానికి అంతకు మించిన వేరే అంశం లేదనేది స్పష్టం. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న సిపిఎం దాన్ని బలపర్చే వామపక్షాలు మాత్రం బీజేపీ మత రాజకీయాలనూ ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి గాని టీడీపీ వైసీపీ తమను తాము అనుకోవడానికి పరిమితమవుతున్నాయి.

చంద్రబాబు నాయుడు వారం రోజు మకాం వేసి ప్రచారం చేయనుండగా ముఖ్యమంత్రి జగన్‌ కూడా ఒకరోజు వెళ్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటికే పర్యటించారు. సీపీఎం మధు,సీపీఐ రామకృష్ణ ప్రచారంలో ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు కూడా వస్తారని చెబుతున్నారు. మొత్తంపైన తిరుపతి ఉప ఎన్నిక సాదాసీదాగా మొదలై సంకు సమరంగా మారుతున్నట్టు కనిపిస్తుంది. జగన్‌ అధికారంలోకి వచ్చాక ఇదే మొదటి ఉప ఎన్నిక గనక పోటాపోటీగా ప్రచారం సాగడంలో ఆశ్చర్యం లేదు. అయితే అది విధానపరమైన సమస్యకు సంబంధించిన అంశాలపై వుంటే బాగుంటుంది. ప్రజా సమస్యల ను  రాష్ట్ర విషయాలు పక్కనపెట్టి మతాలు దేవుళ్ల చుట్టూ తిరగడం మంచిది కాదు. ఒకవేళ ఓట్ల మీద ఆశతో పార్టీలు అవన్నీ మాట్లాడినా ప్రజలు మాత్రం రాజకీయ కోణంలో ఓటు వేస్తారు తప్ప  కేవలం మత తత్వాన్నిబట్టి కాదు. రాష్ట్ర సమస్యలు తిరుపతి అభివృద్ధి ఇక్కడ కీలకం అవుతాయి.

ముఖ్యమంత్రి జగన్‌ ప్రచారానికి వెళుతున్నారంటే వైసీపీ పరిస్థితి బాగా లేదని అర్థాలు తీయడం కూడా అవాస్తవికమే. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ కూడా నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికలో ప్రచారం చేస్తారని కార్యక్రమం చెబుతున్నారు. కీలకమైన సంకేతాలు పంపించే ఉప ఎన్నికను ప్రభుత్వాలు పార్టీలు సవాలుగా తీసుకోవడం తప్పేమీ కాదు. వైసీపీ అయిదు లక్ష ఓట్ల మెజారిటీ మంత్రోచ్చారణ చేస్తున్నా అది ప్రధానంగా ప్రత్యర్థులను పడగొట్టడానికి ఉద్దేశించింది తప్ప ఎన్నికల సవాలును తేలిగ్గా తీసుకోవడం లేదని జగన్‌ పర్యటనను బట్టి స్పష్టమవుతుంది. అయితే దీని అర్థం మిగిలిన వారు గెలిచిపోతారని కూడా కాదు. తుది ఫలితం ఎలా వున్నా ప్రచార సమరంలో వెనకబడగూడదన్నదే పార్టీ వ్యూహం సారాంశం,