తెలకపల్లి రవి : కొత్త రెవెన్యూ చట్టంతో కొత్త సవాళ్లు

తెలకపల్లి రవి : కొత్త రెవెన్యూ చట్టంతో కొత్త సవాళ్లు

తెలకపల్లి రవి

         తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఏది చేసినా మామూలుగా వుండదు.దాని మీద పట్టు సంపాదించి తను అనుకున్న ఫలితం వచ్చేదాకా పనిచేసి స్వయంగా ప్రతిపాదించి ప్రచారంలోకి తెస్తారు. అధికారులతో మాట్లాడం సభలో వివరించడం, సంబంధిత ఉద్యోగులోకి తీసుకుపోవడం ఒక క్రమ పద్దతిలోపాటించి మార్పుకు సిద్దం చేస్తారు. గత కొంత కాంగా రెవెన్యూ శాఖపై పడిన కెసిఆర్‌ నాలుగు కొత్త చట్టాలు తీసుకొచ్చారు. భూమిహక్కు రికార్డు పాస్‌పుస్తకం 1971 సవరణచట్టం, విఆర్‌వో రద్దు,  గ్రామాలకు ధరణి ఆన్‌లైన్ ‌రిజిస్ట్రేషన్‌, మున్సిపాలిటిలకు ఆన్‌లైన్‌ ధరణి రిజిస్ట్రేషన్‌. షరా మామూలుగా ఈ చర్యలు చారిత్రాత్మకమైనవంటూ తెలంగాణ రాష్ట్ర సాధనతో పోల్చారు. తనకు ముందు నలుగురు ముఖ్యమంత్రులు తెచ్చిన మార్పును ప్రస్తావిస్తూనే 21వ శతాబ్దిలో కూడా భూ రికార్డుకు ఐటిని వాడుకోకపోవడం ప్రధానలోపంగా పేర్కొన్నారు.   భూ కబ్జాలు  బూటకపు భూ సంస్కరణలు వక్ఫ్‌ దేవాదాయ భూముల సమస్యలు తదితర అంశాలను ప్రస్తావించారు.  భూ రికార్డు, హక్కు, మ్యూటేషన్లలో లోపాలు ఏళ్ల తరబడి జాప్యాలు వున్న మాట నిజమే. అవినీతి ఎక్కువగా వుండే శాఖలో ఒకటిగా రెవెన్యూ పేరు మోసిన మాటా నిజమే, కాని కెసిఆర్‌ దానిపైనే కేంద్రీకరించడం, వారి పత్రికలో రోజుల తరబడి పేజీల కొద్ది రెవెన్యూ అధికారులపై కథనాలు ప్రచురించడం ఉత్తరోత్తరాలు సజీవ దహనాలు ఆత్మాహత్యల వరకూ వెళ్లింది. మరోవైపున కొందరు అక్రమార్కులు పట్టుబడ్డారు.  ఈ చట్టం చర్చ జరుగుతున్నప్పుడే మెదక్‌ జిల్లాలో భారీ లంచగొండు పట్టుబడ్డారు.

        కెసిఆర్‌ కొత్త చట్టాల వల్ల కలిగే ప్రయోజనాలు పరిమితులు ఏమిటన్నది ప్రధాన ప్రశ్న.వేగం పెరగడానికి అవినీతి తగ్గడానికి పునరావృతి నివారించడానికి ఇదిదోహదం చేస్తుందన్న భావన సాధారణంగా వుంది. అయితే వాస్తవాలేమిటి? ప్రస్తుత సమస్యలకు ప్రత్యామ్నాయంగా తెస్తున్న మెరుగుదలేమిటి? అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సమగ్ర సర్వే గురించి మాట్లాడుతున్న కెసిఆర్‌ ప్రభుత్వం ఆ పనిచేయలేకపోయింది. ఈ కాలంలోనూ అనేక ఆక్రమణలు ఆరోపణలు వున్నాయి.కుంభకోణాలు కుదిపేసినా చివరిదాకా వెళ్లింది లేదు.

          విఆర్‌వోలు,  విఆర్‌ఎలను తొలగించినా వారికి ఉద్యోగ భద్రత వుంటుందని ముఖ్యమంత్రి చెప్పారు.అందుకు కొంత సమయం కొంత అస్పష్టత తప్పకపోవచ్చు.  విఆర్‌ఎ విషయంలో నాలుగు మాసాలు పడుతుందని కూడా అన్నారు.  రెండవది పట్టాదారు పాసు పుస్తకాలు సమస్య 1971 చట్టం పట్దాదారులతో పాటు కౌలుదారులకు తాకట్టుదారులకు వాస్తవ సాగుదారులకు  స్థలదారులకు పాసు పుస్తకాలు ఇవ్వాలని చెప్పింది. పట్టాదారుకు పట్టా పుస్తకం సాగుకూడా చేసుకుంటే స్వాధీన పుస్తకం రెండూ ఇచ్చారు. సాగుదారుకు  ఒకటి ఇచ్చారు, తెంగాణ పోరాట నేపథ్యంలో పూర్వపు హైదరాబాద్‌ శాసనసభ దేశంలోనే అత్యంత విప్లవాత్మకమైన రక్షిత కౌలుదారు చట్టం 1951లో తీసుకొచ్చింది.  ఇటీవల నీటిఆయోగ్‌ కూడా వారి హక్కుపై సిఫార్సు చేసింది. కాని కెసిఆర్‌ ప్రభుత్వం కౌలుదారును వాస్తవ సాగుదార్లను గుర్తించబోనని ప్రకటించింది. రికార్డు నుంచి తొలగించింది. దాదాపు 20 లక్షల కౌలుదార్లు ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా మారారు. తెలంగాణలో చలామణిలో వున్న సాదాబైనామాలు 12.5 లక్షల దరఖాస్తులు రాగా కేవలం  1.3 లక్షలు మాత్రమే పరిష్కరించి మిగిలినవి పెండిరగులో పెట్టారు. ఇప్పటి వరకూ పనిచేసిన రెవెన్యూ కోర్టులు ముందు 16 వేల కేసులకు పైగా పెండిరగులో వున్నాయి.వీటికోసం వెయ్యికి ఒకటి చొప్పున ఫాస్ట్‌ట్రాక్‌  రెవెనూ కోర్టు పెట్టి తేల్చేసి వాటిని  రద్దు చేస్తారు. భవిష్యత్తులో సివిల్‌ కోర్టులనే   ఈ వివాదాలు పరిష్కరించుకోవాంటున్నారు. ఇది పెద్ద సమస్య కావచ్చు, కోర్టు ఎలాగూ కేసులు భారంలో మునిగివున్నాయి.    రెవెన్యూ కోర్టులు దగ్గరగా వుంటాయి గనక గ్రామీణలు కొంత సులభంగా వెళ్లగలిగేవారు. ఈ హడావుడిలో పేదలు దెబ్బతిని పెత్తందార్ల మాట చెల్లితే అదే ఇకపైన తుదితీర్పుగా మిగనుంది. ఇకపైన రెవెన్యూ అధికారులకు విచక్షణాధికారం వుండబోదని, వారి నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం వుండదని చెబుతున్న మాటలోనూ చాలా సమస్యలున్నాయి.  కుటుంబా వారసత్వాలు  కూడా వారి మాట మీదనే చేస్తామన్నప్పుడు పొరబాట్ల సవరణ ఎలాగన్నది ప్రశ్న కాబోతుంది. వాటిని ఒప్పందం ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే మ్యటేషన్‌ చార్జిలు చెల్లించాలని నిబంధన చేర్చారు.  సబ్‌ రిజిస్ట్రార్లు వ్యవసాయేతర భూములే రిజిస్టర్‌ చేసుకుంటారు. తహసిల్దారు మున్సిపాలిటీలో రిజిస్ట్రేషన్‌ అధికారం ఇవ్వడం వల్ల  అవినీతి తగ్గి ఒకేసారి మ్యూటేషన్ ‌జరిగిపోతుందన్నారు గాని  ఇంకా చాలా రకాల సమస్యలు వుంటాయని నిపుణులు చెబుతున్నారు.  గతంలో అవినీతి గురించి మాట్లాడినప్పుడు గాని అనుభవంలో గాని అనేకమంది అధికారులు  అవినీతికి పాల్పడగా లేనిది కేవలం విఆర్‌వోనే తప్పించడం వల్ల  ఉపయోగం ఎంత?

         ముఖ్యమంత్రి చెప్పినదానిలో కీలకభాగం దేవాదాయ వక్ప్‌ భూములకు సంబంధించింది. వాటి రిజిస్ట్రేషన్‌లే నిలిపేస్తున్నట్టు చెప్పారు, రాష్ట్రంలో సాగుభూములు కోటి అరవై మూడు లక్షల ఎకరాలైతే ఇందులో 15.5 లక్షల ఎకరాలు భూదాన దేవాదాయ వక్ఫ్‌ చెరువు అబాధీ ఫారెస్టు బంజరు వంటివి వున్నాయని   రైతు నాయకు సారంపెల్లి మల్లారెడ్డి చెబుతున్నారు. విద్యుత్‌  ఇరిగేషన్‌ భూములు కూడా వున్నాయి, ఇందులో అధిక భాగం బడాబాబుల ఆక్రమణలో వున్నాయి. సాగు భూములు రైతుల చేతిలో వున్నాయి, కాని ఈ రైతుకు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు. ఇప్పుడు వాటన్నిటిని ఒక్కసారిగా నిలిపేస్తే జరిగేదేంటి? సాగుదార్లనే భావననే తొగిస్తే వారి పరిస్తితి ఏమిటి?ఈ బడాబాబుల భూములకు విముక్తి ఎలా? ఆచరణలో ఇది  కబ్జాదార్ల పెత్తందార్ల పట్టు పెరిగి పేదరైతు హక్కురక్షణ కోల్పోడానికి దారితీస్తుందనే ఆందోళన వుంది. సమగ్ర సర్వేపై ఇప్పటివరకూ చేయని ఈ ప్రభుత్వం ఎప్పుడు పూర్తి చేస్తుందో తెలియదు, కనకకొత్త చట్టంలో మంచిని ఆహ్వానిస్తూనే కొత్త సవాళ్లను ఎదుర్కొవడానికి కొత్త సమస్యలు పరిష్కరించుకోవడానికి సిద్ధం కావసి వుంటుంది, అందులో అతి ముఖ్యమైంది తీవ్రమైంది పేద సాగుదార్ల కౌలుదార్ల హక్కు రక్షణ, రెవెన్యూ కోడ్‌ తేవడం గాని సమూలమైన మార్పు గాని జరిగింది లేదు. దానికి చాలా కాలం పడుతుందని తన జీవిత కాలంలో  చూస్తానని ఆశిస్తున్నాని కెసిఆర్‌ చెప్పడం యాదృచ్చికం కాదు.కనుక మరింత లోతైన వివరమైన అధ్యయనం ముందు ముందు జరగాల్సి వుంటుంది.