తెలకపల్లి రవి : టీ బీజేపీలో కలహాలా ? టీఆర్ఎస్ వ్యూహాలా ?

తెలకపల్లి రవి : టీ బీజేపీలో కలహాలా ? టీఆర్ఎస్ వ్యూహాలా ?

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందు రోజు బిజెపి నాయకు ప్రగతిభవన్‌ లో మంత్రి కెటిఆర్‌ను కలుసుకోవడం ఇప్పుడు ఆ పార్టీలో పెద్ద దుమారంగా మారింది. అంతకు మించి బిజెపిలో అంతర్గత వైరుధ్యాలను బహిర్గతం చేసింది. మూడోది పాలక టిఆర్‌ఎస్‌ రాజకీయ చాణక్యాన్ని వ్లెడిరచింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెల్చుకున్నాక, దుబ్బాక జిహెచ్‌ఎంసి విజయాల తర్వాత టిబిజెపి అద్యక్షుడు బండి సంజయ్‌ కొత్త వూపు తీసుకొచ్చారనే పొగడ్తలు పెరుగుతున్న వేళ ఇది ఒక అనుకోని మలుపు. వాస్తవానికి ఎంఎల్‌సి  ఎన్నికల్లోనే బిజెపి హడావుడికి గండి పడింది. సాగర్‌లోనూ వారు ప్రధాన ప్రత్యర్థులుగా లేకుండా పోయారు. బండి సంజయ్‌ వచ్చాక జిల్లాలో ప్రధానంగా పనిచేసే బిజెపి నేతలకు ఎప్పటి నుంచో హైదరాబాదులో పనిచేస్తున్న సీనియర్లకు వైరుధ్యం పెరిగిందనే కథలు నిత్యకృత్యమైంది.

ఒకటి రెండు విజయాలు చూసుకుని అందరినీ శత్రువులను చేసుకోవడం, ఏకపక్ష దూకుడుతో ఏక్‌ దమ్మున పార్టీ పెరిగిపోతుందనుకోవడం పొరబాటని భావించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి,మాజీ అద్యక్షుడు లక్ష్మణ్‌ వంటివారు కొంత మధ్యేవాద వైఖరికోసం వాదిస్తున్నారనేది దీని సారాంశం. బిజెపి తరహా మతతత్వ మూలు సిద్ధాంతాలలో మార్పు లేకున్నా ఉత్తరాది నమూనా ఇక్కడ అక్కరకు రాదని  కూడా వారు చెబుతున్నారు, కొంతమంది అత్యుత్సాహం వల్ల ఎప్పటినుంచో పార్టీకి శత్రువు కాని వారు ఆర్థిక వనరులు గల బలాఢ్యవర్గాను కూడా దూరం చేసుకుంటే దీర్ఘకాలంలో ఎలా మనగలమని వారు ప్రశ్నించారని మీడియాకు సమాచారం వస్తూనే ఉంది. అధిష్టానం కూడా వీరికి కొంత అవకాశం ఇవ్వడంతో బండి సంజయ్‌ బృందం ఇరకాటంలో పడిరదట,

ఇలాటి పూర్వరంగంలోనే ప్రగతిభవన్‌ భేటీ జరిగింది. లింగోజి గూడెం నుంచి జిహెచ్‌ఎంసికి ఎన్నికైన  రమేష్‌ గౌడ్‌ ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే మరణించారు గనక ఆ స్థానంలో ఇతరులు పోటీ పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగేట్టు చూడాన్నది ప్రతిపాదన టిఆర్‌ఎస్‌ నుంచే వచ్చిందని బిజెపి నేతంటారు. వారు అడిగితే మేము మాట్లాడామని వీరంటారు. మాజీ ఎంఎల్‌సి రామచంద్రరావుతో సహా ఈ భేటీలో పాల్గొనడం వల్ల ఇదేదో యాదృచ్చికమని చెప్పడానికి లేకుండా పోయింది. పోలింగ్‌ కు ముందు రోజు టిఆర్‌ఎస్‌ ఇంత ఔదార్యం చూపించడంలోరాజకీయం లేదని చెప్పడం కష్టమే. ఆ వెంటనే కెటిఆర్‌  ఏకగ్రీవానికి అంగీకరించడం, కాంగ్రెస్‌ నాయకులకు కూడా ఫోన్‌చేయడం ఇదంతా ఒక వరస. వారు నిరాకరించడం వేరే విషయం, అయితే ఆ తర్వాతనే అసలు కథ మొదలైంది,

 

తమ అనుమతి లేకుండా ఏదో ఉద్దేశంతోనే వారు ప్రగతిభవన్‌ వెళ్లారని బండిసంజయ్‌ బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సీనియర్లతో సహా వారందరికీ నోటీసులు ఇచ్చారు. ఏదో విధంగా తమ స్థానంలో  ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నిస్తే దీనిపై అంతగా ఆగ్రహించవలసిన అవసరమేమిటనే ప్రశ్నకు ఇది దారి తీసింది,వ్యతిరేకతలు వున్నాయి కనుక వాటిని తీర్చుకోవడానికి ఈ సందర్బాన్ని తీసుకున్నారే గాని దానికదే ఇది పెద్ద అపరాధం కాదనే వాదనలు కూడా బలం పుంజుకున్నాయి, కిషన్‌రెడ్డి వంటి వారికి దీనితో సంబంధం లేదని కేవలం రంగారెడ్డి జిల్లా నాయకులు ఉత్సాహమే ఇందుకు దారితీసింది గనుక వారిని మందలించడమే ఈ నోటీసు ఉద్దేశం తప్ప వేరే లేదని బీజేపీ రాష్ట్ర నాయకులు ఇస్తున్న వివరణ ఎవరినీ సంతృప్తి పరచడం లేదు. అనుమతి లేకుండా వారు వెళ్లారంటే వేరే అధికార కేంద్రం ఉందని కూడా తేలిపోయింది. అంటే ఇప్పటి వరకు మీడియా రాజకీయ వర్గాలకే పరిమితమైన బిజెపి కలహాల కథ ఈ విధంగా  బహిరంగ వ్యవహారంగా మారింది,

      టిఆర్‌ఎస్‌ నాయకత్వం కూడా వ్యూహాత్మకంగానే ఇదంతా చేసిందనేది నిర్వివాదాంశం.కేంద్రంతో రాజ్యాంగ బద్దమైన సంబంధాలు పాటిస్తూనే రాజకీయంగా బిజెపిపై తీవ్ర విమర్శులు చేసే కెసిఆర్‌ వైఖరి ఆచరణలో ఎలా వుంటుందో ఈ  ఉదంతం స్పష్టం చేసింది. నాగార్జున సాగర్‌ ఎన్నిక సభలోనూ ఆయన బిజెపి ప్రస్తావనే చేయకపోవడం గమనించదగ్గది. బిజెపిలో రెండు శిబిరాలుగా రాజకీయం నడుస్తుంటే టిఆర్‌ఎస్‌ నాయకత్వమే రెండు తరహా రాజకీయం నడిపిస్తున్నట్టు సందేహించాల్సి వస్తుంది. ఇంత అయ్యాక  బండి సంజయ్‌ వేసిన కమిటీ  ఏవో తీవ్రమైన చర్యలు తీసుకుంటుందని ఎవరూ అనుకోరు. కాకపోతే ఇది ఆయన ఆగ్రహానికి సంకేతం అని మాత్రం అనుకోవాలి. ఆయనను పక్కనపెట్టి బలమైన ఇతర నాయకులను మంచి చేసుకునే టిఆర్‌ఎస్‌ ఎత్తుగడకు  జాతీయ నాయకత్వం  ఎలా స్పందిస్తుందో ముందు ముందు తేలుస్తుంది. అయితే ఈ పోటీలో ఏ శిబిరమైనా సరే మరింత మతతత్వ రాజకీయాలకు దిగానుకోవడం మాత్రం అనుమతించ రానిది. ఎత్తుగడ పేరుతో బిజెపితో ఏ విధంగానైనా రాజీపడితే టిఆర్‌ఎస్‌ కు కూడా రాజకీయంగా కలిగే మేలు లేకపోగా గందరగోళం పెరగడం అనివార్యం.