తెలకపల్లి రవి : స్టార్ హీరోలూ.. హిస్టరీ స్టోరీలూ..
భారీ చిత్రాలు తీయడం, వాటిలో స్టార్ హీరోలు నటించడం సంతోషమే. స్టార్ డైరెక్టర్లు వందకోట్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి సమయం తీసుకుని కథలు అల్లడం, పాత్ర కన్నా స్టార్స్‌ను ఆకాశానికెత్తడం కూడా ఓకె. ఆ క్రమంలో మూఢ నమ్మకాలనూ అశాస్త్రీయ విషయాలనూ, ఆఖరుకు బానిస ప్రవృత్తినీ కూడా ప్రచారం చేసినా వారి కథ అది అని సరిపెట్టుకోవచ్చు. కాని చరిత్ర ముద్ర వేసుకుని కూడా తమ కల్పనతో నడిపిస్తామంటే కూడా ఒప్పుకోవలసిందేనా? చరిత్ర పరిధిలో కల్పన తప్పదు గాని చరిత్రనే కల్పనగా మార్చి ఆ చరిత్ర పురుషులను స్టార్ హీరో తరహాలో ప్రచారంలో పెట్టడం సమంజసమేనా? గొప్ప ప్రచారం తారాబలం వున్న భారీ సినిమాలు ఎలానూ ఫలితాలిస్తాయి. కాని ఆ క్రమంలో చరిత్రకు ఏమవుతుంది? హాలివుడ్ లో ఈ జానర్ వుండొచ్చు. అయితే దానికి కొన్ని ప్రమాణాలు వున్నాయి.మనం వాటిని పాటిస్తున్నామా?
రాజమౌళి ఆర్ఆర్ఆర్ టీజర్ల విడుదల తర్వాత కులుగుతున్న సందేహాలివి. అల్లూరి సీతా రామరాజు కొమరం భీమ్‌ను కలపడం ఒక కల్పనా. వారిద్దరూ ఒక దశలో ఇంటి నుంచి వెళ్లిపోయారనే కామన్ పాయింట్ తీసుకున్నామన్నారు. స్వతంత్ర పోరాటం ఇందులో వుండదని దర్శకుడు మొదటే చెప్పేశారు. అంటే యోధులుగా వారి ప్రసిద్ధి ఉపయోగిస్తూనే ఇతర అంశాపై కేంద్రీకరణ వుంటుందన్న మాట. నాయికగా సీత పాత్రకు చాలా ప్రాధాన్యత వుంటుందని మరో వార్త. (వాస్తవంలో సీతారామరాజు జీవితంలో సీత పాత్ర కల్పన అనేది సమకాలీకుల దృఢాభిప్రాయం.)
ఇద్దరు చారిత్రక వ్యక్తులు ఒకరి గురించి ఒకరు చెప్పడం ఉత్తేజకరమే కాని ఆ హీరో అభిమానును సంతృప్తి పరిచే తాపత్రయంలో నిజమైన చరిత్ర హీరోలను ఆ ఫ్రేములోకి తీసుకురావలసిందేనా ? ఫ్యాన్స్, స్టార్స్ అనగానే ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ అని మీడియాలో సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, వివాదాలు. చరిత్రతో నిమిత్తం లేకుండా ఇప్పటి అవసరాలను బట్టి కథకూ పాత్రకూ మెలికలు. కాని చరిత్ర వీరులను ఫార్ములా ఫ్రేములో కుదించడం అవాంచనీయం కాదా? రామ్ చరణ్ రంగస్థలం ఎంత వాస్తవికంగా తీశారు? హిట్ కాలేదా?
అల్లూరి సీతారామరాజు కథను హీరో కృష్ణ చిరస్మరణీయంగా తీశారు. జేమ్స్ బాండ్ పాత్రకు పెట్టింది పేరు గనక దాన్ని అలా మలచ లేదే? ఆ చిత్రం విజయవంతం కాలేదా? చరిత్రలో నిలిచిపోలేదా? అలా అని దాంట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవా? మూడు దశల్లో సీతారామరాజు ఎంట్రీ ఎంత హుందాగా వాస్తవికంగా వుంటుంది? కొమరం భీమ్ కథకు వస్తే అందుబాటులో వున్న ఆధారాలతో చరిత్రమీద ప్రేమతో తీసిన చిత్రం. చాలా అవార్డులు వచ్చినా విడుదల కావడానికి దాదాపు ఇరవై ఏళ్లు ఆగవసి వచ్చింది. అయినా స్టార్స్ లేకున్నా విడుదలైనాక వంద రోజు ఆడింది. అది చరిత్ర బలం. చరిత్రను కల్పనగా తీయడానికి ముందే ఏళ్లు పట్టడం దానికి రివర్స్. అయినా ఎవరి మార్గం వారిది. తప్పు పట్టడానికి లేదు.
ముందస్తు సెన్సారింగ్ లూ షూటింగులపై దాడుూ ప్రజాస్వామ్య సంసృతి కాదు. సహించకూడదు కూడా. కాని సృజన స్వేచ్చను చారిత్రిక వాస్తవాలతో సమన్వయం చేశామని చెప్పేబదులు దానితో సంబంధం లేదని పదే పదే ప్రకటించడం దేనికి సంకేతం? చరిత్ర వీరులకు ఏం గౌరవం? వారి పాత్ర టీజర్లు హీరో మధ్య పోటీగా మారడం వూహకందేదేనా ? ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలు వేస్తే మమేకత వచ్చిందే గాని స్టార్ వాల్యూ చూడలేదు. మహాకవులు, రాజులు, చక్రవర్తుల కథలు కూడా వున్నంతలో చరిత్రకు అనుగుణంగా తీశారే గాని స్టార్స్‌ను బట్టి కాదు, కాని ఇక్కడ షూటింగు మొదలవడానికి ముందునుంచే స్టార్ వాల్యూ కీలకమై పోతే మిగిలిన విషయాలు ఏమవుతాయి? పరిశ్రమ పెద్దలు, అగ్ర దర్శకులు ఆలోచించాలి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)