అమరావతికి అసలే ఎసరా? నానీ మాటలు తనవేనా?

అమరావతికి అసలే ఎసరా? నానీ మాటలు తనవేనా?

తెలకపల్లి రవి
                 
చంద్రబాబునాయుడు హయాంలో  అత్యంత ఆర్భాటపూరితమైన ప్రచారంతో మొదలై అరకొరగా ఆగిపోయిన  అమరావతి రాజధాని వ్యవహారం నిజంగానే అంతులేని కథగా మారింది. ఏడాది కాలం నుంచి ఏకైక సమస్యగా  రాజకీయ చర్చను ఆక్రమిస్తున్న రాజధాని కొత్త కొత్త ములుపులు తిరుగుతూ ప్రహేళికలా మారింది. కోర్టు ఏం చెబుతాయి ఎంతకాలానికి తెలియని అనిశ్చితి ప్రతిష్టంభనకు దారితీస్తుంటే ప్రభుత్వం మంత్రులు ఏమంటారు అన్నది కూడా అంతుపట్టని తంతుగానే తయారైంది. పాలనా వికేంద్రీకరణ పేరిట అక్కడ శాసన రాజధాని అనేదాన్ని మాత్రం కొనసాగిస్తూ పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని , న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు తరలించాలని ప్రభుత్వం శాసనం చేసింది. అది శాసనమండలి గండం దాటి గవర్నర్‌ సంతకం కూడా పొంది గెజిట్‌లో మెవడి ఇప్పుడు హైకోర్టు ధర్మాసనం పరిశీలనలో వుంది. దాదాపు 80 పిటిషన్లు దాఖలైనా అన్నిటికీ కలిపి ఒకే  కౌంటర్‌ను రాష్ట్రం సమర్పించింది. ప్రభుత్వంతోపాటు పార్టీలనూ ముఖ్యమంత్రిని కూడా తమ అభిప్రాయం చెప్పాల్సిందిగా కోర్టు నోటీసు ఇచ్చింది. దానిపై ఇప్పటికే సుప్రీంను ఆశ్రయించి తిరిగివచ్చిన రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులోనే తన వాదను వినిపించుకోవలసిన పరిస్తితి. ఈ ప్రధాన పిటిషన్‌ గాక రాజధానిలో ఇళ్ల స్థలల పైన హైకోర్టు భవనాల పూర్తిపైన, సిఆర్‌డిఎ సరిహద్దు మార్చడంపైన, రైతు కౌలుబకాయి పైన, ఇలా అనేక ఉప కేసులు కూడా నడుస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో ఉద్యమం పరిమితమైనదైనా వైసీపీయేతర పార్టీన్నీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాయి. రైతు సమస్య పరిష్కరించాలనేదానిపైన కర్నూలుకు హైకోర్టు తరలింపుపైన ఏ పార్టీ వ్యతిరేకించడం లేదు. ఇది వాస్తవ పరిస్తితి. కాని ఆచరణలో ఇది ఇంత సూటిగా చెప్పడానికి లేదు. చాలా మెలికల ముపు పరిస్తితిని తికమక పరుస్తున్నాయి.

హైకోర్టు మార్పుపై అందరి ఏకాభిప్రాయమున్నా సుప్రీం కోర్టులో ముందు దాన్నే సవాలు చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వుతో ఏర్పడిన తర్వాత శాసనసభ దానిపై ఎలా తీర్మానం చేస్తుందని నానీ ప్రశ్నించారు. సుప్రీం కోర్టు అంగీకరించేవరకూ అది మారదు గనక శాసన రాజధానితో పాటు న్యాయరాజధాని కూడా అక్కడే కొనసాగుతుందని పాలనా రాజధానిని మాత్రం తరలించుకోవడానికి హైకోర్టు విధించిన స్టేటస్‌ సుప్రీం ఎత్తివేయాలనీ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యర్తించి విఫలమైనారు, ఒక్క హైకోర్టు వల్ల ఒరిగేది లేదు గనక తాము దానిపై పట్టుపట్టబోమని రాయసీమ ఆందోళన కారులు అంటున్నారు. సీమ డిక్లరేషన్‌ ప్రకటించిన బిజెపి కేంద్రంలో వుండి కూడా దాన్ని వేగవంతం చేయడం లేదు.

వాస్తవానికి ఆ ప్రాంత జిల్లా న్యాయవాదులకు పెట్టిన హైకోర్టు తరలించడం మింగుడు పడని విషయం గనకే  ఇంత క్రియాశీలంగా కేసు వేస్తున్నారనేది కాదనలేని సత్యం. ఈ విధంగా హైకోర్టు విషయం ఇప్పటికే ప్రశ్నార్థకమై కూర్చుంది. ప్రభుత్వానికి పాలనా రాజధానిపై దృష్టి, టిడిపికి తమ అమరావతి ప్రాజెక్టు యథాతథంగా కొనసాగడం ముఖ్యం. అదే కోణంలో అమరావతి అంటేనే టిడిపి బినామీలు అన్నట్టు మాట్లాడ్డం వైసీపీ నేతలకు రివాజుగా మారింది. 30 వేల మందికి పైగా రైతులు భూములు ఇచ్చారనీ, మరిన్ని వేల మంది ఆ 29 గ్రామాలో జీవిస్తున్నారని వారు మర్చిపోతుంటారు. చర్చకు సిద్దపడరు. శాసన రాజధానిగా అమరావతి అభివృద్ధికి రైతు సంక్షేమానికి కట్టుబడి వున్నామని మంత్రులు బొత్స సత్యనారాయణ వంటివారు చెబుతుంటారు. అయితే వాస్తవ పరిస్తితి కారణంగా  ఆ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వడానికి మరో మూడేళ్లు వ్యవధి తీసుకోవాని భావిస్తున్నట్టు అధికార వర్గా సమాచారం. అమరావతి కోసం చేసిన అప్పు కింద ఏటా 527 కోట్లు కట్టాలని కూడా నిర్ణయించారట. అలా అయినా పదేళ్లు పడుతుందని అంచనా చెబుతున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మంత్రి కొడాలి నానీ ఇప్పటికి రెండు సార్లు శాసనరాజధానిని కూడా ఇక్కడ కొనసాగంచవద్దని చెప్పడం యాదృచ్చికమేనా? యాభై వేల మంది పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం సామాజిక న్యాయమని ప్రభుత్వం చెబుతుంటే రాజధాని ప్రాజెక్టు భగ్నం చేసే వ్యూహాత్మక చర్చ అని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి.హైకోర్టు కూడా ఈ పంపిణీని నిలిపేయాలని ఆదేశించింది. పేదలకు దళితులకు స్థలాలు ఇవ్వవద్దనే చోట శాసనరాజధాని కూడా వుందకూడదనే తాను మాట్లాడుతున్నానని నానీ అంటున్నా అంత వరకే తీసుకోవడానికి లేదు. గతంలో మీడియా దగ్గర యథాలాపంగా అన్న ఈ మాటలు తనకు తెలియదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకసారి సమాధానమిచ్చారు, కాని ఈ సారి ఏకంగా ముఖ్యమంత్రి జగన్‌కే తన సూచన చేసినట్టు ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకుందామని అన్నట్టు నానీ కార్యాలయం ఆయన కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. అంటే ముఖ్యమంత్రిని కూడా రంగంలోకి తెచ్చిందన్నమాట. కొడాలినాని దూకుడుగా దురుసుగా మాట్లాడే మాట నిజమే గాని ముఖ్యమంత్రిని ప్రస్తావించే సాహసం చేస్తారనుకోలేము. దీన్నిబట్టి చూస్తే ప్రభుత్వ వైఖరినే కొడాలి నానీ ప్రవచించారని అనుకోవలసి వస్తుంది. గతంలోనూ బొత్స సత్యనారాయణ మాటతోనే ఈ మొత్తం వ్యవహారం కదిలించారని గుర్తుచేసుకోవాలి. అదే వ్యూహం ఇప్పుడు పునరావృతమవుతోందా? లేక శాసనరాజధాని కూడా లేకుండా అసలకే మోసం వస్తుందంటే రైతులు, స్థానికులు దారికొస్తారని ప్రభుత్వం బావిస్తున్నదా? హైకోర్టు స్టేటస్‌కో అన్నప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నట్టు? కోర్టు తీర్పు ఎలా వచ్చినా సరే తమ ఆలోచనలు మారబోవనే సంకేతం ఇందులోవుందా? ఈ ప్రశ్నకు సమాధానం భవిష్యత్తు చెప్పవలసి వుంటుంది. వచ్చే ఎన్నికల వరకూ రాజధాని రాజకీయం కొనసాగినా ఆశ్చర్యం లేదు. జగన్ ‌శ్రేయోభిలాషులుగా వుండేవారు కూడా ఆయన ఈ ప్రతిష్టంభన నుంచి ప్రభుత్వం తేలిగ్గా బయిటపడకపోవచ్చని సందేహం వెలిబుచ్చడం దీనికికొసమెరుపు.