తెలకపల్లి రవి : ఆందోళనలో ఆసాంజే భద్రత

తెలకపల్లి రవి : ఆందోళనలో ఆసాంజే భద్రత

జూలియస్‌ ఆసాంజే! పదేళ్ల కిందట  2010 లో అమెరికా రక్షణ, విదేశాంగ కేంద్రాల వేలాది పత్రాలను ప్రపంచమంతటికీ అందుబాటులోకి తెచ్చిన వికీలీక్స్‌ సంచనకారుడు. దేశదేశాలలో అమెరికా కుటిల వ్యూహాలనూ, ఆదేశాధినేతలపట్ల అమెరికన్ల అంచనాలను బహిర్గతం చేసిన ఉద్దండుడు. కొన్నివారాలపాటు రోజుకు కొన్ని సంచలనపత్రాలు బయిటకు వస్తుంటే ఆపలేక, ఒప్పుకోలేక అమెరికా అధినేతలు నానాపాట్లు పడ్డారు. మిగిలిన దేశాల సంగతి అటుంచి వికీలీక్స్‌లో భారత దేశానికి సంబంధించిన అంశాలు విభ్రాంతి కలిగించాయి. న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి తమ అధినేతకు పంపిన 3000 కేబుల్స్‌ 2007`2010 మధ్య కాలానికి సంబంధించినవి. అణు ఒప్పందంపై సంతకాలు, వామపక్షా మద్దతు ఉపసంహరణ, మళ్లీ ఎన్నికల, అనంతరం అణుపరిహార బిల్లును తీసుకురావడం, పాక్‌ ఆఫ్ఘన్‌తో సంబంధాలు వంటివాటిపై  అనూహ్యమైన రహస్యాలు బయటకు వచ్చాయి.  పాలనా వ్యవస్థ మూమూల్లోకి అమెరికా అధికారిక అనధికారిక చొరబాటు పెరిగిపోతున్నదని వికీలీక్స్‌ పత్రాలు  కుండ బద్దులు గొట్టాయి. దేశంలో అత్యున్నత గూఢచారి సంస్థ రా( రిసెర్చి అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌) అధికారి ఒకరు సిఐఎతో సంబంధం పెట్టుకున్నారు. అసలు ఢిల్లీ పోలీసు విభాగం అమెరికా రాయబార కార్యాయం ద్వారా సిఐఎతో రహస్య సంబంధాలు కలిగివున్న విషయం ప్రభుత్వానికి కూడా తెలియదన్నారు! ఇరాన్‌కు సంబంధించిన సమాచారం ముందే చెప్పడం పైన చూశాం. టెర్రరిజానికి వ్యతిరేకంగా ఉమ్మడి వేదిక సభ్యుడైన కెసిసింగ్‌ కూడా అలాగే వ్యవహరించారు. అయితే తమ రాయబార కార్యాయాలు గూఢచర్యం కూడా చేయాలని విదేశాంగ మంత్రి హిల్లరీ ప్రత్యేకంగా ఆదేశాలు పంపిన సంగతి ఇక్కడ   చెప్పవలసి వుంది. కనక ఆప్తమిత్రులమంటూనే అమెరికా మన పట్ల ఎలా వ్యవహరించిందో ఇవన్నీ చెబుతున్నాయి. అమెరికా  అధినేతల ఫక్తుల వ్యాపార వేత్తలుగా ప్రయోజనాల సాధనకు పాకులాడారు.

 ఒబామా పర్యటనపై ఈ విధమైన వ్యాఖ్యలు వచ్చాయి గాని ఈ క్షణం అంతకు ముందు నుంచే వుంది. భారతదేశం మన నుంచి తీసుకోవడం తప్ప ఏమీ ఇవ్వడం లేదని ఒక అధికారి ఫిర్యాదు చేశారు. ఆ దేశ సెనెటర్‌ వచ్చిన సందర్భంలో లాక్‌హీడ్‌, బోయింగ్‌ విమానాల కొనుగోలు ఒప్పందాలను వేగవంతం చేయాలని వెంటపడ్డారు. తమ దేశపు ఉత్పత్తి రంగాన్ని మనం హరిస్తున్నామని మరో సందర్భంలో అమెరికా చికాకు పడింది. ఇవన్నీ ఎంతటి అసత్యాలో చెప్పనవసరం లేదు. మోన్‌శాంటో విత్తనాలు ముస్సోరిలోనే తయారవుతున్నా వ్యవసాయ రంగంలో పెద్ద ఆర్డర్లు రావడం లేదన్నట్టు చెప్పారు. రక్షణ రంగంలో  కొనుగోళ్లకు సహకారానికి అపారమైన అవకాశాలున్నా ఉపయోగించుకోవడం లేదని హితబోధ చేశారు. ఇప్పుడు మన పాలకులు ఆ లోటు భర్తీ చేస్తున్నారనుకోవచ్చు   వికీలీక్స్‌ ప్రకంపనలు మొదలు కాగానే అమెరికా భారత  దేశానికి సంబంధించిన పత్రాలు కూడా విడుదల కావచ్చని వాటిపై పెద్దగా స్పందించనవసరం లేదని హెచ్చరించవలసి వచ్చింది. అప్పటి విదేశాంగ మంత్రి ఎస్‌ఎం కృష్ణ వాటి ప్రభావం ఏమీ వుండబోదని ముందే హామీ ఇచ్చేశారు కాని వెనిజులా అద్యక్షుడు కీశే, హ్యూగో చావేజ్‌ వంటివారు వాటి ఆధారంగా అమెరికా తీరుపై ధ్వజమెత్తారు, అంతేగాక వాటిని బయిటపెట్టిన జూలియష్‌ ఆసాంజేకు  ఆశ్రయం ఇస్తామని ప్రకటించారు.వాస్తవానిఇక గల్ప్‌ దేశాతో ఇరాక్‌ ఆఫ్టన్‌తో రష్యాతో అమెరికా సంబంధా సమస్య మరింత జటిమైంది.

ఈ పత్రాలు బయటపడిన తర్వాత కాలంలో ఆసాంజే ఆశ్రయం కోసం చాలా అవస్థలు పడ్డారు.  స్వీడన్‌ ప్రభుత్వం తమ దేశంలో ఆయన మహిళలపై ఒకప్పుడు అత్యాచారం చేశాడంటూ కేసు పెట్టింది. ఈ కేసులో శిక్ష పడి స్వీడన్‌జైలులో వుంటే అమెరికాతో వున్న అప్పగింత  ఒప్పందం కింద పంపించేస్తారని అంతా భావించారు. అందుకే    వాటి విచారణ ఎదుర్కొంటూనే ఆసాంజే తప్పించుకుని లండన్‌ చేరి ఈక్వెడార్‌ రాయబార కార్యాయంలో రక్షణ పొందారు. 2019లో ఆ కేసు నిలవలేక స్వీడన్‌  ఉపసంహరించుకుంది.  అయితే అదే సమయంలో అమెరికా ప్రభుత్వం ఆసాంజేపై  17కేసులు బనాయించి నేరస్తులని కింద తమకు అప్పగించాలని ఒత్తిడి  ప్రారంభించింది. రక్షణ రంగ విశ్లేషకులైన చాలెస్‌ మానింగ్‌తో కసి తమ రహస్యాలు వెల్లడించడం ద్వారా దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారనేది అమెరికా ప్రధాన ఆరోపణ. ఈ నేరాలన్నీ కోర్టు  నిర్ధారిస్తే ఆయనకు 175 ఏళ్ల శిక్ష పడే అవకాశముంది. ఈ వేట,పరుగు మధ్య ఆరోగ్యం క్షీణించిన ఆసాంజే మానసిక అస్థిమితానికి గురయ్యారు. ప్రస్తుతం ఆయనపై విచారణ జరిపిన బ్రిటిష్‌ కోర్టు ఈ కారణంగానే  అసాంజే ఆత్మహత్య చేసుకునే పరిస్తితులు వున్నాయంటూ అమెరికాకు అప్పగించడానికి నిరాకరించింది. తనపై చాలా పరీక్షలు జరిపించింది. తన కుమారుడు బతికివుండే ఆశలేదని అసాంజే తండ్రి గతంలోనే ఆవేదన వెలిబుచ్చాడు.
కార్పొరేట్‌ కంపెనీలు విచ్చలవిడిగా డేటా చౌర్యం చేసిన ఘటనలు కోట్లమంది సామాన్య పౌరుల వ్యక్తిగత వ్యాపార రహస్యాలు సేకరించడం చూస్తూనేవున్నాం. దాంతో పోలిస్తే జూలియస్‌ ఆసాంజే మీడియా పరిశోధనలో భాగంగా వికీలీక్స్‌ వెల్లడించారు తప్ప స్వార్థ ప్రయోజనం లేదు. అందుకే ఆయనపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని భారత ఎడిటర్స్‌ గిల్డ్‌ కోరింది. మానసిక అనారోగ్యం వల్ల తాము అప్పగించడం లేదని కోర్టు చెప్పిన కారణంపై గిల్డ్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై రేపు అమెరికా ఒప్పించగలిగితే పరిస్థితి మారొచ్చని గిల్డ్‌ సందేహం వెలిబుచ్చింది. అమెరికా రాజ్యాంగం మొదటి సవరణే  పత్రికా స్వేచ్చను కాపాడటానికి అన్న సంగతి గుర్తు చేస్తూ ఆసాంజేపై శిక్ష విధిస్తే ఇండియాతో  సహా ప్రపంచ దేశాలు అదే పద్దతి అనుసరించి మీడియాకు ముప్పు తేవచ్చని హెచ్చరించింది. బ్రిటన్‌లోనే గాక ప్రపంచ వ్యాపితంగా ఆసాంజేకు సంఫీుభావం మద్దతు పెరుగుతున్నాయి. దేశదేశాలో మీడియాపై దాడులు నిర్బంధాలు పెరుగుతున్న పూర్వరంగంలో జూలియస్‌ ఆసాంజే కేసు కొత్త ఉదాహరణ కావచ్చు. ప్రజాస్వామ్య ప్రియులెవరైనా బలపర్చవలసిన సందర్భమిది.