తెలకపల్లి రవి : ఎల్యుఎల్సీ మార్పులతోనే నగరాలకి వానదెబ్బ

తెలకపల్లి రవి : ఎల్యుఎల్సీ మార్పులతోనే నగరాలకి వానదెబ్బ

హైదరాబాదులో వూహించని స్థాయిలో విరుచుకుపడ్డ వర్ష బీభత్సం జన జీవితాన్ని అల్లకల్లోలం చేసింది. ప్రాణ నష్టం అంతకు మించిన ఆస్తి నష్టం, ఇళ్లు మునక, వాగుల్లా మారిన రహదారులు దిగ్బ్రాంతిని కలిగించాయి. రెండు రోజు పాటు సెలవు ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2016లో వచ్చిన వరద నష్టం కన్నా అనేక రెట్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. రెడ్‌ అలర్ట్‌ ప్రకటించినప్పటికీ మంగళవారం సాయింత్రం నుంచి దంచి కొట్టిన వాన ఈ వందేళ్లలో ఎరుగనిదని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్ర ప్రాంత లో వరదలు, తుఫానులు కొత్త కాదు గాని ఇక్కడ ఇంతటి వర్షపు దెబ్బ గత కొన్నేళ్లలోనే చూస్తున్నాం.

 

దీనికి ముందు ముంబయి, చెన్నైలోనూ ఇలాటి పరిస్తితి ఎదురైంది. దీని వెనక వాతావరణ మార్పులు, విచ్చలవిడి నగరీకరణ, మురుగు నీటి పారుదల కోసం ఉద్దేశించిన డ్రైనేజీలు మూసుకుపోవడం, నాళాలు ఆక్రమించడం వంటి కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముంబయిని 2015లో వరదలు అతలాకుతం చేసిన నాటి నుంచి మహానగర వాసుల వాన కష్టాలపై అధ్యయనాలు సాగుతున్నాయి. 2015లో చెన్నైలో దారుణ పరిస్తితి మరింతగా కళ్లు తెరిపించింది. 2016 లోనే హైదరాబాద్‌ లోనూ అలాటి  ఆపదే ఎదురైంది. కేరళలో కూడా 2018లో తీవ్ర వరదలు ముంచెత్తాయి. దక్షిణాదిన, కేరళ, తమిళనాడు తెలంగాణలలో పూర్తి భిన్నమైన భౌగోళిక పరిస్తితులో వుంటాయి. ఒకటి పశ్చిమాన అరేబియా సముద్ర తీరంలో వుంటే మరొకటి బంగాళాఖాతం తీరంలో వుండే రాష్ట్రం. తెలంగాణకు తీరమే లేదు. ఈ మూడు రాష్ట్రాలకూ వర్షం పడే సమయం కూడా వేర్వేరు. కాని అన్ని చోట్ల వరదలు ఒకే తరహాలో ఎందుకు ముంచెత ్తయనే దానిపై హైదరాబాద్‌ యూనివర్సిటీకి చెందిన కనుమూరి అశోక్‌ బృంందం ఇటీవలే అధ్యయనం నిర్వహించింది.

 

భూ వినియోగం భూ ఆవరణం (లాండ్‌ యూజ్‌ లాండ్‌ కవర్‌ ఎల్‌యుఎల్‌సి)  పరిస్థితిని పరిశీలించింది. భూ వినియోగం అంటే అంటే వ్యవసాయ వ్యవసాయేతర అవసరాల కోసం వాడుతున్న తీరు. భూమిపై పొర అంటే నిర్మాణాలు, వ్వవసాయ, వినోదం తదితర నిర్మాణాల ప్రభావం. అదుపులేని నగరీకరణ ఫలితంగా పరిసరాలలోనూ, స్వభావంలోనూ వచ్చిన మార్పులే భారీ వర్షానికి కారణమవుతున్నాయని నిర్ధారించింది.అస్తవ్యస్థమైన మురుగునీటి పారుదల వ్యవస్థ కారణంగా భూమి లోపలి పొర మెత్త బడి తేమ శాతం పెరగడం పై వాతావరణ వేడి పెరగడం ఇందుకు కారణమవుతున్నది. ఉపరితలానికి వేడిని బదలాయించడం పెరిగి వర్షాలు ఉదృతం అవుతున్నాయి. ఈ అధ్యయనం ఇటీవలే  ప్రచురితమైంది. వర్షాలు 20 నుంచి 25 శాతం పెరుగుతాయని వారు హెచ్చరించారు.

 

ప్రపంచ స్థాయిలోనూ నగరీకరణ ప్రభావంతో వాతావరణ మార్పులపై విస్తారమైన అధ్యయనాలు జరుగుతున్నాయి. కాని ఎన్ని జరిగినా వ్యాపార ధోరణులు అక్రమణలు, స్థానిక పరిపాలన వ్వవస్థని నామమాత్రమై పోవడం వలన పరిస్థితి మారడం లేదు. అడ్డదిడ్డంగా ప్రణాళికా రహితంగా పెరిగే నగరాలు పట్టణాలపై అదుపు ఉండటం లేదు. కరోన కారణంగా లాక్‌ డౌన్‌ తో పొల్యూషన్ ఆగిపోయి ప్రకతి చల్లబడటం కారణమని కొందరు అంటున్నారు గాని 2000 - 2017 మధ్య కనీసం పదిహేడు సార్లు ఇలాటి కుండ పోత కష్టాలు ఎదురైనాయని లెక్కలు చెబుతున్నాయి.

 

లెక్కకు మిక్కుటంగా చిన్న చిన్న గ్రామా స్థాయిలో లేచే బహుళ అంతస్తు సముదాయాలకు చాలా వరకూ మురుగు పారుదల అనేక రెట్లు పెరగవసి వుంటుంది. అయితే అది ముందస్తుగా జరగదు, తరువాత వుండదు. మామూలు అవసరం కోసం ఏర్పాటయిన డ్రైనేజిలోకి నీటిని వదలడం అంటే ఏదో ఒక దశలో ముప్పును ఆహ్వానించడమే, మరో వంక పారిశుద్య వ్యవస్థకు కేటాయింపు  తగినంత లేకపోగా సిబ్బందిని పెంచడం లేదు.  ఈ విధంగా ప్రకతిలో మార్పులు, వ్యక్తిగత స్వార్థం కలసి నగరంలో భారీ వాన అంటే నరకమే అన్న స్థితి దాపురించింది. ఇప్పటికైన దీన్ని క్రమపద్ధతిలో పరిష్కరించకపోతే ఒక నాటికి ఎవరూ ఏమీ చేయలేని దశకు దారితీయొచ్చు,