తెలకపల్లి రవి : కాశ్మీర్‌లో గుప్కార్‌ సమైక్య నాదం, రాజకీయ ప్రక్రియకు సదవకాశం

తెలకపల్లి రవి : కాశ్మీర్‌లో గుప్కార్‌ సమైక్య నాదం, రాజకీయ ప్రక్రియకు సదవకాశం

జమ్మూ కాశ్మీర్‌లోని ప్రధాన ప్రాంతీయ పార్టీలైన నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పిడిపి,పీపుల్స్‌మూమెంట్‌,అవామీ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సిపిఎం కలసి ప్రత్యేక ప్రతిపత్తి , రాష్ట్ర హోదా పునరుద్దరణకై ఐక్యంగా పోరాడాతామని ప్రకటించాయి. మాజీ ముఖ్యమంత్రి సీనియర్‌ నాయకుడైన ఫరూక్‌ అబ్దుల్లా నివాసం పేరిట గుప్కార్‌ డిక్లరేషన్‌గా పేరొందిన ఈ పిలుపు సరిహద్దు రాష్ట్రంలో పరిస్థితికి ప్రతిబింబం. ప్రధాన రాజకీయ పక్షాల అసంతృప్తికి ప్రతి ధ్వని, వాస్తవంలో ఈ డిక్లరేషన్‌ పార్లమెంటులో 370 రద్దు వార్త నేపథ్యంలో ఒకరోజు ముందుగా జరిగింది, 2019 ఆగష్టు 5న పార్లమెంటులో 370  అధికరణం రద్దు,కాశ్మీర్‌ నుంచి లడాఖ్‌ ను విడదీయడం, రాష్ట్ర ప్రతిపత్తి తొలగించి రెండు భాగాలనూ కేంద్రపాలిత ప్రాంతాలగా చేయడం జరిగాయి.

అప్పటికే శాసనసభ రద్దయి వున్న పరిస్థితిలో కేవలం గవర్నర్‌ సిఫార్సును మాత్రం తీసుకుని విభజన చేసి హోదా తగ్గించారు. విలీన సమయంలో కాశ్మీర్‌ ప్రజలకిచ్చిన హామీకి ఇది విరుద్ధమనీ, రాజ్యాంగ స్పూర్తికి కూడా వ్యతిరేకమని పలు పార్టీలు చెప్పినా కేంద్రం వినిపించుకోలేదు. ఏడు దశాబ్దాలలో ఎవరూ చేయని పని చేశామని గొప్పగా చెప్పారు. దేశంలోనే విదేశంగా వున్న కాశ్మీర్‌ను భాగం చేశామని దీనివల్ల అభివృద్ధి పరుగు పెడుతుందని పెట్టుబడులు ప్రవహిస్తాయని ప్రకటించారు. అయితే ఆచరణలో జరిగింది వేరు. అనేక ఆంక్షలు విధించబడ్డాయి. నిరసన తెలిపే యువతపై కాల్పులు, నిర్బంధాలు, ఉద్రిక్తతకు దారి తీశాయి. అయినా అప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రులైన ఫరూక్‌ ఒమర్‌ అబ్దుల్లా, ముఫ్తి మహ్మద్‌ సయిద్‌ ను నిర్బంధంలో వుంచడం వల్ల కార్యాచరణ సాధ్య పడలేదు.

మరో వైపున సమాచార సంబంధాలు, ఇంటర్‌ నెట్‌ కూడా నిలిపేయడం, పత్రికల పై సెన్సార్‌ తీవ్ర విమర్శలకు కారణమైనాయి. పాత్రికేయులను, సంపాదకులను అరెస్టులు చేయడంతో పాటు కీలకమైన ఎందరో నాయకులను జైళ్లలోనూ గృహ నిర్బంధంలోనూ వుంచారు, ఇవన్నీ చాలా సార్లు సుప్రీం కోర్టు ముందు సవాలు చేయబడ్డాయి. అసలు రాజ్యాంగ సవరణలే చెల్లవన్న పిటిషన్లు కూడా ముందున్నాయి. సుప్రీం కోర్టు అక్కడ సమాచార సంబంధాల పునరుద్ధరణకై ఆదేశాలిచ్చింది. జైళ్లలో నేత విడుదల, మీడియాపై దాడి వంటి అంశాలను ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే మొదట ఫరూక్‌ ఒబర్‌ అబ్దుల్లా,  అక్టోబర్‌ 14న మఫ్లి మహ్మద్‌ సయ్యద్‌ విడుదయ్యారు, మరుసటి రోజునే అఖిలపక్షానికి హాజరయ్యారు. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా వున్న ఈ రెండు  ప్రాంతీయ పార్టీలు చేతులు కలపడమంటేనే గుప్కార్‌ డిక్లరేషన్‌ పార్టీలకు అతీతంగా కాశ్మీర్‌ ప్రజల మనోభావాలకు అద్దం పడుతున్నట్టు అర్థమవుతుంది.

దీనికి సవ్యంగా సత్వరం ప్రతిస్పందించడం చర్చలు జరిపి అక్కడ ప్రజాస్వామిక వాతావరణం పునరుద్ధరించడం కేంద్రంలోని మోడీ సర్కారు బాధ్యత. లేదంటే ఇది కేంద్రానికి కాశ్మీర్‌ ప్రధాన పార్టీలకూ ప్రజలకూ మధ్య మరో తీవ్ర ఘర్షణగా మారొచ్చు. ఇది వరసలో పిడిపి నేషనల్‌ కాన్పరెన్స్‌  రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కాంగ్రెస్‌ బిజెపితో రకరకాలుగా రాజకీయపొత్తు ప్రభుత్వంలో చేరికు జరిపాయి గనక ఇరు వైపులా రాజకీయాలు మారాయని అనుకున్నారు. అయితే  370 రద్దు విషయంలో బిజెపిలో మార్పులేదని ఆలస్యంగా అర్థమైంది. రెండవ సారి మోడీ గెలవగానే ఆ ఎజెండా అమలై పోయింది. ఇతర పార్టీలు కూడా అనేకం అందుకు మద్దతు తెలిపాయి గనక వారి పని తేలికైంది. దీని ప్రభావం అంతర్జాతీయంగానూ పడింది. చైనా లడాఖ్‌ ప్రతిపత్తి పై అభ్యంతరాలు తెలపగా పాకిస్తాన్‌ తన అధీనంలోని ఆక్రమిత కాశ్మీర్‌లో  కొత్త విన్యాసాలు ప్రారంభించింది. 

బయటిదేశాలకు ఈ వ్యవహారంతో సంబంధం లేదనేది నిస్సందేహమైనా చర్చలు మాత్రం సాగుతూనే వుంది. లడాఖ్‌ సరిహద్దులో భారత చైనా సంఘర్షణు కొత్త పరిస్తితికి దారితీశాయి. ఈ పూర్వరంగంలో ఫరూక్‌ అబ్దుల్లా ఒక దశలోనైతే మేము చైనా పాలన కిందనైనా వుంటామని చెప్పడం పరిశీకులను ఆకర్షించింది. ఆ మాటకే కట్టుబడి వుంటారా అని ఇంటర్వ్యూ చేసిన కరణ్‌ థాపర్‌ మళ్లీ అడిగినా ఆయన అదే చెప్పారు. ఆ తర్వాత మరో సందర్భంలోనూ అలాగే వ్యాఖ్యానించారు. స్థానిక నాయకులకు జరిగిన పరిణామాలు ఎంత కష్టం కలిగిస్తున్నాయో తెలిపే ఉదాహరణ మాత్రమే ఇది.

370 రద్దు రాష్ట్ర విభజన హోదా మార్పు తర్వాత కేంద్రం  చేసిన చాలా వాగ్దానాలు ఇంకా అములోకి రావలసే వుంది. ఉద్రిక్తతలు కొన్ని ఉగ్రవాద ఘటనలు ఎరుగుతున్నాయి, కాల్పులు మరణాలు కూడా సంభవించాయి. గవర్నర్లను మార్చినా అదుపు లోకి రాని  ఈ  పరిస్తితిని చక్కబడాలంటే ప్రజలనూ పార్టీలనూ విశ్వాసంలోకి తీసుకోవడం తప్పనిసరి, కేంద్రం బలప్రయోగంతో కాశ్మీర్‌ అదుపులోకి వస్తుందన్న అంచనా పొరబాటని మరో సారి తేలిపోతున్నది. రాజకీయ శక్తులు చెల్లాచెదురైపోతే అప్పుడు పాక్‌ ప్రేరిత విద్రోహ శక్తుల కుట్రను ఎదుర్కొవడం మరింత కష్టమవుతుంది. గుప్కార్‌ డిక్లరేషన్‌ ప్రాతిపదికన ఉద్యమం ప్రారంభించాని నిర్ణయించిన అయిదు పార్టీల నేతలతో సంప్రదింపులు ప్రారంభిస్తే రాజకీయ ప్రక్రియ మొదవుతుంది. ఆంక్షలు సడలించి  ఆకించడం మొదులుపెడితే ప్రశాంతతకు మార్గం ఏర్పడుతుంది.