తెలకపల్లి రవి : ప్రభుత్వంతో సత్సంబంధాలకు తమిళిసై సూత్రం

తెలకపల్లి రవి : ప్రభుత్వంతో సత్సంబంధాలకు తమిళిసై సూత్రం

ఈ మధ్య తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌  మొదటి ఏడాది కార్యక్రమాలకు సంబంధించి అందమైన ఫోటోలతో కాపీ టేబుల్‌ బుక్‌ విడుదల చేశారు. బిజెపి తమిళనాడు శాఖ అద్యక్షురాలిగా వుంటూ నేరుగా రాజ్‌ భవన్‌ లో ప్రవేశించిన తమిళి సై స్వతహాగా డాక్టర్‌,ఆమె భర్త  సౌందర రాజన్‌ కూడా వైద్య నిపుణులే. ఆమె తండ్రి కుమారి అనంత్‌ కాంగ్రెస్‌ తరపున  ఆరు సార్లు ఎంఎల్‌ఎ గా ఒకసారి ఎంపిగా పని చేశారు. కుమార్తె బిజెపిలో చేరడం నచ్చని ఆయన ఇప్పటికి కొంచెం దూరంగానే వుంటారు. అదలా వుంచితే తమిళ రాజకీయాల్లో భిన్న ధృవాలైన కరుణానిధి ఎంజిఆర్ వీరి పెళ్లిలోనే కలవడం అప్పట్లో పెద్ద సంచలనమైందట. ఇలాంటి ఆసక్తికరమైన కబుర్లు ఇంకా వున్నాయి గాని మళ్లీ పుస్తకావిష్కరణకు ముందు సీనియర్‌ పాత్రికేయులను ఆహ్వానించి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

సహజంగా అందరూ అభినందలను చెప్పారు. నేను అభినందించడంతో పాటు ఆమె వచ్చిన కొత్తలో వెలువడిన కొన్నికథనాల వల్ల ఏర్పడిన వాతావరణం గుర్తు చేశాను. కరోనా నిరోధంలో తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు పై బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయడం వల్ల భౌతిక దూరం రాజకీయ దూరంగా కనిపించిన సంగతి చెప్పాను.  దేశంలో మరోసారి గవర్నర్‌ వ్యవస్థ వివాదాస్పదంగా మారుతున్నతీరు ప్రస్తావించాను. ఉదాహరణకు మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన భగత్‌ సింగ్‌ కోషియారి మహా వివాదాస్పదుడుగా మారడమే గాక ఆయనను వెనక్కు పిలిపించాని కూడా పాలక శివసేన కోరుతున్న పరిస్తితి.  ముఖ్యమంత్రి ఉద్భ్‌వ్‌ ఠాక్రే లౌకిక తత్వాన్ని అపహాస్యం చేసే  వ్యాఖ్యలే గాక శాసనమండలి నామినేషన్లకు అడ్డుపడటం, ప్రభుత్వానికి వ్యతిరేకులైన వారికి ప్రత్యేకంగా అపాయింట్‌మెంట్లు ఇచ్చి ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్నారు.

ఈ పుస్తకావిష్కరణ జరిగిన రోజునే ఆయన ఉత్తరాఖండ్‌ వరద ప్రాంతాలకు సందర్శనకు వెళ్లాలని విమానంలో ఎక్కిన తర్వాత ప్రభుత్వ అనుమతి లేదని దింపి వేసిన కథనం వచ్చింది. బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌ కూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి దాదాపు ప్రత్యక్ష యుద్దమే నడుస్తున్నది. కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ చాలా విషయాల్లో పినరయి విజయన్‌ ప్రభుత్వంతో స్పర్థ పెంచుతున్నారు. రాజస్థాన్‌ వంటి చోట్ల ప్రభుత్వా మార్పిడిసమయంలో గవర్నర్లు పాత్ర కోర్టుకెక్కింది, తెలంగాణ గవర్నర్‌ గా తమిళిసై వీటిని ఎలా చూస్తున్నారు ఏమనుకుంటున్నారనే ప్రశ్న లేవనెత్తినపుడు సమన్వయ ధోరణిలో స్పందించారు.

రాజ్యాంగపరంగా గవర్నర్‌ పాత్ర  పరిమితమైందనిఆమె సూటిగానే అంగీకరించారు. మిగతావారిపై తాను వ్యాఖ్యానించను గాని తెలంగాణలో పరిస్తితి సజావుగానే నడుస్తుందని అభిప్రాయ పడ్డారు. తాను వచ్చిన సమయంలోనే డెంగ్యూ జ్వరం, తర్వాత కోవిడ్‌ వైరస్‌ కారణంగా డాక్టర్‌నుగా ప్రభుత్వ పరీక్ష విధానంపైకొంత భిన్నాభిప్రాయంవుండిన మాట నిజమేగాని సరిగ్గా తెలియజేసిన తర్వాత అవి పరిష్కారమైనాయన్నారు.తన స్పందనసమస్యనుబట్టి వుంటుంది తప్ప అనుకూలత వ్యతిరేకత స్తిరంగా వుండబోదన్నారు.విద్యారంగంలో ఆన్‌లైన్‌ క్లాసు ఆరంభించడంలో తెంగాణ ముందు నిలిచిందని సంతృప్తి వెలిబుచ్చారు. విద్యారంగంపైన విశ్వ విద్యాయా పరిస్తితిపైన తాను వివరమైన అధ్యయనం చేసి నివేదిక రూపొందించినట్టు చెప్పారు.గిరిజను సంక్షేమంపైనా ప్రత్యేక దృష్టిపెట్టబోతున్నట్టు వెల్లడించారు. రాజ్యాంగ రీత్యా షెడ్యూల్ ప్రాంతాలో గవర్నర్‌ కొంత పాత్ర నిర్వహించే అవకాశముంది.

తమిళిసైకి ముందున్న గవర్నర్‌ ఇఎల్‌ నరసింహన్‌ దాదాపు దశాబ్ద కాలం రాజ్‌ భవన్‌ లో వున్నారు. ఆ సంగతి గుర్తు చేసిన కొందరు ఆమె కూడా మరింత కాలం కొనసాగాలని చెప్పారుగాని వాస్తవంలో ఆమె  రాజకీయ జీవి. తమిళనాడు వ్యవహారాలను ఎంతగానో గమనిస్తుంటారు.వాస్తవానికి ఈ పుస్తకం కూడా మొదట  తమిళనాడులోనే విడుదల చేశారు. మామూలుగా కీలకమైన పదవులు నిర్వహించిన సీనియర్లను జీవిత సంధ్యా సమయంలో గవర్నర్టుగా నియమించడం పరిపాటి. తెలుగు రాష్ట్రాలకూ తమిళనాడుకూ ఈ విషయంలో చాలా అనుబంధం వుంది. చెన్నారెడ్డి, రోశయ్య, చెన్నమనేని విద్యాసాగరరావు వంటి వారు తమిళనాడు గవర్నర్లుగా పనిచేయడమే గాక కీలకమైన మార్పుకు కారకులయ్యారు. 

ఇక నరసింహన్‌ తో సహా పలువురు తమిళులు, హైదరాబాధ్‌ రాజ్‌ భవన్‌ లో వున్నారు. ఆయన కూడా వివాదాలకు అతీతంగా లేరు,  ఈ గవర్నర్‌ వచ్చిన  కొత్తలోనూ కాంగ్రెస్‌ బిజెపి నేతలు దూకుడుగా వ్యవహరిస్తారని ఆశించిన మాటా నిజమే. రాజకీయ వేత్తలు గవర్నర్‌ కావచ్చు గాని రాజకీయం చేయకూడదు అన్న తమిళిసై మాటల్లో వాస్తవికత కనిపించింది. ఇక ముందు ఏం జరుగుతుందో, ఆ మాటలకే ఎంత వరకూ కట్టుబడివుండగరో  చూడవలసిందే, ఎందుకంటే కేంద్ర బిజెపి క్రియాశీల గవర్నర్లను  ప్రోత్సహిస్తుంటుంది గనకే వివాదాలు పెరుగుతుంటాయి. గవర్నర్‌ మీడియా కార్యదర్శి మల్లాది కృష్ణానంద్‌ ప్రత్యేక చొరవతో కేవలం పాత్రికేయుకే పరిమితంగా జరిగిన ఈ కార్యక్రమం రాజ్‌భవన్‌ అధికారిక వాతావరణానికి భిన్నంగా ఆహ్లాదకరమైన పు అంశాలను ఆవిష్కరించడం ఆసక్తిదాయకమైంది.