తెలకపల్లి రవి: కాశ్మీర్‌లో మంచు నల్లగా కురిస్తే బిజెపిలో చేరతానన్న ఆజాద్‌

తెలకపల్లి రవి: కాశ్మీర్‌లో మంచు నల్లగా కురిస్తే బిజెపిలో చేరతానన్న ఆజాద్‌

రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడుగా పనిచేసిన  కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్‌ కు వీడ్కోలు ఇచ్చే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ కన్నీటి పర్యంతం కావడం రాజకీయ వర్గాల్లో రకరకాలైన వ్యాఖ్యానాలకు దారితీసింది. ఈ సమయంలో  ఆజాద్‌ను పొగుడుతూనే ఆ పార్టీ అధిష్టానాన్ని అవహేళన చేయడానికి మోడీ చేసిన ప్రయత్నం కూడా అర్థమైంది. ఆజాద్‌ కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో గుజరాత్‌ యాత్రికుల బస్సుపై టెర్రరిస్టు దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా వున్న తాను ఫోన్‌ చేస్తే ఎంతో మానవీయంగా బాధ్యతగా స్పందించడమే గాక  మధ్యలో ఏడవడం గుర్తుకు వచ్చి మోడీ కన్నీరు పెట్టుకున్నారట. ఆ విషయం ఇన్నాళ్ల తర్వాత ప్రస్తావిస్తే అప్పటి పరిస్థితి గుర్తుకువచ్చి తర్వాత మాట్లాడిన ఆజాద్‌కూ కళ్లు చెమ్మగిల్లాయి. 1970లో ఇందిరాగాంధీ సంజయ్‌ గాంధీలు తనను ప్రోత్సహించి నాయకుడుగా ముందుకు నడపడం ఆయన తలచుకున్నాడు. అయితే ఇటీవ కాంగ్రెస్‌లో అస్తవ్యస్త పరిస్తితిని విమర్శిస్తూ అంతర్గత ఎన్నికలు జరగాలని మరో 23 మందితో కసి ఆయన రాసిన లేఖను మోడీ జి23 అంటూ ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన సేవను మరింతకాలం వినియోగించుకోకుండా సభనుంచి పంపేస్తున్నదని అర్థం వచ్చేట్టుగా మాట్లాడారు.

రాజ్యసభలో జరిగినఈ సన్నివేశం తర్వాత రకరకాల వ్యాఖ్యానాలకు కారణమైంది. ఆజాద్‌ను తమవైపు తిప్పుకోవడానికే మోడీ అంత ఉద్వేగం చూపించారని చాలా మంది అన్నారు. కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ అయితే ప్రధాని  కొంత కృత్రిమంగా కన్నీళ్లు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. అయితే, ఆజాద్‌ ఈ వ్యాఖ్యానాన్ని కొట్టిపారేస్తూ థరూర్‌ ఎందుకలా అన్నారో తనకు తెలియదని అన్నారు. వాస్తవానికి తనకూ మోడీకి ముప్పై ఏళ్ల నుంచి సంబంధం వుందని తమ తమ పార్టీ ప్రధాన కార్యదర్శులుగా టీవీ చర్చకు హాజరైనప్పుడు సమయం దొరికితే అనేక విషయాలు యథాలాపంగా మాట్లాడుకునేవారమని తెలిపారు. తను కాశ్మీర్‌ ముఖ్యమంత్రిగా ఆయన గుజరాత్‌ ముఖ్యమంత్రిగా అనేక సందర్బాల్లో కలిసేవారమనీ, కేంద్రంలో ఆరోగ్యశాఖా మంత్రిగానూ మోడీతో పదిహేనురోజు కొకసారైనా మాట్లాడేవాడినని చెప్పారు. వాస్తవానికి వాజ్‌పేయి తనపట్ల మరింత అభిమానంగా వుండేవారని ఒకసారి రాజమాత విజయరాజే సింధియా తప్పుగా మాట్లాడితే సర్దుబాటు చేశారనీ గుర్తు చేశారు. అయితే, అంతమాత్రాన తాను బిజెపిలో చేరతాననుకుంటే పొరబాటనీ, కాశ్మీర్‌లో నల్లటి మంచు కురిస్తే తప్ప అది జరగదని కొట్టిపారేశారు. ఆజాద్‌ పై తేలిగ్గా వ్యాఖ్యానాలు చేసినవారికే గాక పొగడ్తలతో ముంచెత్తిన మోడీకి కూడా గట్టి సమాధానమివ్వడానికే ఉద్దేశించబడ్డాయని చెప్పవనసరం లేదు. 370 రద్దు కాశ్మీరీలందరినీ బాధించి నిర్బంధానికి లోను చేసిందనీ దేశంలోనే పురాతనమైన తమ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించడం మరింత అన్యాయమని స్పష్టం చేశారు. దాన్ని చక్కదిద్దేవరకూ తమలో ఎవరం సంతోషంగా వుండలేమన్నారు. అది ఉపాధితో భూమితో ముడిపడి వున్న సమస్య అన్నారు.  సోనియాగాంధీ తన సేవను అభినందిస్తూ లేఖ రాయడమే గాక ఎన్నికకు సన్నద్ధం కావాంటూ ప్రత్యేకంగా చర్చించారని కూడా తెలిపారు. రాహుల్‌గాంధీనీ కలిశానన్నారు. మొత్తంపైన తనకూ అధిష్టానానికి మధ్య గండిపెట్టే ఆలోచన ఏదైనా మోడీకి వుంటే దాన్ని తోసిపుచ్చారన్నమాట.

అయితే ఈ సన్నివేశానికి చాలా ముందే కాంగ్రెస్‌ నాయకత్వం రాజ్యసభలో ఆజాద్‌కు బదులు మల్లిఖార్జున ఖర్గేను ప్రతిపక్ష నాయకుడుగా చేయాని నిర్ణయించింది. అందుకే ప్రత్యేక ప్రయత్నం మీద ఆయనను స్వంత రాష్ట్రం కర్ణాటక నుంచి సభకు తీసుకొచ్చింది. 2014లో లోక్‌సభలో కాంగ్రెస్‌ నాయకుడుగా పనిచేసిన ఖర్గే ముఖ్యపాత్రే నిర్వహించారు. సోనియాకు విధేయుడుగా వున్నారు. ఆజాద్‌ ఒకటికి రెండుసార్లు ధిక్కార స్వరం వినిపించిన తర్వాత తనను మార్చడమే మంచిదని సోనియా రాహుల్‌ నిర్ణయానికొచ్చారు. కొన్ని కమిటీల నుంచి కూడా ఆయనను తప్పించి ఖర్గేను నియమించడం ద్వారా తమ  అభిప్రాయం సూచనగా వెల్లడించారు ఇప్పుడు  ఆజాద్‌ పదవీ విరమణ తర్వాత ఖర్గేను అధికారికంగా ఖాయం చేశారు. కాకపోతే ఈ సమయంలో తనను తాను ఒక భారతీయ ముస్లింగా ఆజాద్‌ అభివర్ణించుకోవడం ఎలా జరిగింది? దీనిపైనా ఆయన తర్వాత ఇంటర్వ్యూలో వివరంగానే సమాధానమిచ్చారు. భారతీయ ముస్లింగా నేను ప్రధాని పదవి వంటిది ఆశించలేను, ఒకప్పుడు 99 శాతం మంది హిందూ అభ్యర్థులు తమ తరపున ప్రచారం చేయవల్సిందిగా కోరేవారు. ఇప్పుడు అది 44 శాతానికి పడిపోయింది. ఆలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీలో మాట్లాడినప్పుడు ఇదే చెప్పాను. మీరందరూ సమాజానికి విదేశాలకూ రాయబారులుగా పనిచేయాని కోరాను. 1979లో నేను మహారాష్ట్ర నుంచి ఎన్నికలో గెలిచిన పరిస్థితులు తిరిగిరావాని కోరుకుంటున్నాను అని వివరించారు. ఆజాద్‌ను ఏదైనా రాష్ట్రం నుంచి తిరిగి తీసుకురావడానికి కూడా కాంగ్రెస్‌కు పెద్దగా బలంలేదు. కేరళ నుంచి తేవాలని ఆలోచించినా అక్కడ సానుకూలత రాలేదు. ఆజాద్‌ కూడా తనకు ఇంక పదవులపై ఆసక్తి లేదని ఏదైనా ప్రజోపయోగ కార్యక్రమం చేస్తానని ప్రకటించారు. ఇక భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సిందే, ఇంతకూ చాలా సాధారణంగా జరిగిపోవల్సిన వీడ్కోలు కార్యక్రమం కూడా ఇంత చర్చకు వివరణకూ దారితీయడం దేశంలో రాజకీయ విభజన తీవ్రతకు సంకేతమన్నమాట.