తెలకపల్లి రవి : రాజకీయ రసపట్టులో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

తెలకపల్లి రవి : రాజకీయ రసపట్టులో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు

దుబ్బాక దెబ్బతో టిఆర్‌ఎస్‌, దేశమంతా డీలా పడిన కాంగ్రెస్‌, ఉప ఎన్నిక గెలుపు వూపులో హైపులో బిజెపి, తన నలభై కాపాడుకోవాలనే తపనలో మజ్లిస్‌ ఇదీ డిసెంబర్‌ ఒకటిన జరిగే  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జిహెచ్‌ఎంసి) ఎన్నిక ముందస్తు దృశ్యం. అయితే కమిటీలను నియమించుకోవడంలోనూ కసరత్తు జరపడంలోనూ ఎవరి తొందరవారిదిగా సిద్ధమైపోయారు. బిజెపి అయితే ఏకంగా జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌ ను ఇన్‌చార్జిగా చేసి కర్ణాటక మంత్రి సుధాకర్‌ను తోడుగా ఇచ్చింది. ఇదంతా కూడా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జోక్యం తగ్గించి రాష్ట్ర అద్యక్షుడు బండి  సంజయ్‌కి స్వేచ్చ ఇవ్వడానికేనని అంతర్గత సమాచారం. కాంగ్రెస్‌, బిజెపి కూడా ఎంపిలను రాష్ట్ర నాయకులను స్థానిక స్థాయిలో బాధ్యతలను అప్పగించాయంటే ఈ ఎన్నికను ఎంత తీవ్రంగా తీసుకుంటున్నది తెలుస్తుంది. గత సారి జరిగిన ఎన్నికలో ఒకటి, అరా స్థానాలకు పరిమితమైన అసలే శూన్యాంకంగా మిగిలిపోయిన పరిస్తితి ఈ పార్టీలను వెన్నాడుతున్నదనడంలో సందేహం లేదు. అయితే తెలంగాణే  ఏర్పడిన కొత్త దశ, మంత్రి కెటిఆర్‌ అన్నీ తానై రంగంలోకి దూకి వాగ్దానాలు గుప్పించడం అప్పటి ఫ్లాష్‌బ్యాక్‌. వరంగల్‌ లోక్‌సభ, జిహెచ్‌ఎంసి పాలేరు ఉప ఎన్నిలకు టిఆర్‌ఎస్‌కు బాగా వూపు నిచ్చిన ఘట్టాలు. ఇప్పుడు దుబ్బాక, జిహెచ్‌ఎంసి, శాసనమండలి ఎన్నిలకు మరో మూడు పరీక్షలుగా వచ్చిన సందర్భం. 18 లో గెలిచిన టిఆర్‌ఎస్‌ పట్ల కెసిఆర్‌ ప్రభుత్వం పట్ల  ప్రజల మూడ్‌ ఎలా వుందో ఈ మూడు ఎన్నికల తర్వాత కొంత అంచనాకువచ్చే అవకాశం ఉంటుంది. ఇందుకు తోడు మళ్లీ తన ఉనికి నిలుపుకోవాలనుకుంటున్న తెలుగుదేశం, యాభై స్థానాల్లో కమ్యూనిస్టు పోటీ, తొలిసారి  గ్రేటర్‌లో దిగుతామంటున్న జనసేన, ఇంకా ఇతర శక్తులు, ఇండిపెండెంట్లు ఎన్నికలను మరింత రసవత్తరం చేయొచ్చు.        

వివిధ కులమత ప్రాంత రాష్ట్రాలకు చెందిన జనాభాతో కూడిన మహానగరం పొందిక, ఓటర్ల సరళి ఏవీ దుబ్బాకకు పోలిక వుండేవి కావు. స్థానిక ఎన్నికలో రాజకీయాంశాలకన్నా స్థానిక సమస్యలే ఎక్కువ ప్రాబల్యం వహిస్తాయనేది కూడా వాస్తవం. ఈ మధ్య కుంభవృష్టితో అతలాకుతమైన కానీ కష్టాలు..  ప్రతికూలంగా మారతాయనేది ప్రతిపక్షాల అంచనా అయితే ఆ కారణంగానే ఎన్నిలను త్వరగా ముగిచ్చేద్దామనేది టిఆర్‌ఎస్‌ ఆలోచనగా అనిపిస్తుంది. దెబ్బతిన్న ఇళ్లకు పదివేల చొప్పున పరిహారం ఇవ్వడంలో, అవకతవకలపై ఫిర్యాదు వున్నా అది అనుకూలంగా పనిచేస్తుందని రాని వారు కూడా తాము రావాలని కోరుకుంటారని  కూడా వారి ఆశగా వుండొచ్చు. ఇంత స్వల్ప కాలంలో ఇన్ని చోట్ల కేంద్రీకరించే  యంత్రాంగం కసిలా వస్తాయని కూడా వారి అంచనా. దీన్ని తీవ్ర సవాలుగా తీసుకోవాలని  మంచి ఫలితాలు రాకుంటే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి గట్టి ఆదేశాలు ఇచ్చి రంగంలోకి దింపే ప్రక్రియ సాగుతున్నది. ఈ క్రమంలో కేంద్రం నుంచి ఏమీ రాలేదని మాత్రమే గాక నగరానికి  ద్రోహం చేసిందని కూడా అధికార పార్టీ పత్రిక పతాక శీర్షికతో రాస్తున్నది. ఇదే ప్రచారమంత్రంగా వుండొచ్చు. గతంలో వంద స్థానాలే గెలవడమే గాక మజ్లిస్‌తో స్నేహం కూడా చేశారు. ఇప్పుడు ఎంత తగ్గినా ఇద్దరినీ మించి పోయే సంఖ్య ఇతరులకు రావడం సులభం కాదు. ఇవన్నీ గమనంలో వుండటం వల్లనే బిజెపి మొదటి నుంచే హంగామా చేస్తున్నది.

ప్రస్తుతం దేశంలో కొంత అనుకూల ఫలితాలు సాధించిన వూపును ఇక్కడ కొనసాగించాలని ఆరాటపడుతున్నది. అంతవరకూ ఫరవాలేదు గాని ఈ ఎన్నికల్లో మజ్లిస్‌ ప్రధాన ప్రత్యర్థి అయినట్టు మత పరమైన విభజన దిశలో వారు గాని బిజెపి గాని ఆలోచించడం అవాంఛనీయమవుతుంది. నగరంలో మతసామరస్యాన్ని కాపాడుకోవడం ఒక ముఖ్యమైన అంశంగా వుండాలి.  గత  ఎన్నిక  సమయంలో ఆంధ్ర,  తెలంగాణ అన్న కోణం ప్రధానంగా ముందుకు వచ్చినా బహుశా ఇప్పుడు దానికి అంత ప్రాధాన్యత వుండకపోవచ్చు. ఉమ్మడి రాజధానిగా ఇవే చివరి ఎన్నికవుతాయి. మహానగరంలో పౌర సమస్యలు రహదారులు, వాహనా రద్దీ, పారిశుధ్యం, మురుగునీటి పారుద, నాలా రక్షణ,పేదవాడలో వసతు, కట్టిన ఇళ్లలో ప్రవేశం ఆక్రమణకు అడ్డుకట్ట వంటి అంశాలపై కేంద్రీకరించాల్సిన అవసరం వుంది. దేశంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా హైదరాబాద్‌ వికాసానికి కేంద్రం కూడా మరింత చేయూత నివ్వాల్సి వుంది. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్షాళన వంటి అంశాల గురించి మాట్లాడే పరిస్తితి వూహించగలమా అనేది ప్రశ్న, హైదరాబాద్‌కు పెట్టుబడులు జోరుగా వస్తున్నాయనే ప్రచారం ప్రభావం ఎలా వున్నా  కరోనా నేపథ్యంలో ఉద్యోగాలు ఉపాధి ఆరోగ్యం ఆహారం వంటి వాటిని కూడా మెరుగుపరిస్తే ఈ ఎన్నిలకు సార్థకమవుతాయి.