తెలకపల్లి రవి : విశాఖ పంచాయితీమిథ్య , పాలనారాజధానితథ్యం!

తెలకపల్లి రవి :  విశాఖ పంచాయితీమిథ్య , పాలనారాజధానితథ్యం!

విశాఖపట్టణంలో పాలనారాజధాని ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది గాని ఉక్కు నగరంలో పాలక వర్గ వైసీపీ నేతలు ఊపు ఉత్సాహాలు ఏ మాత్రం తగ్గలేదు. మరోవైపున కబ్జాసురులు , ఆక్రమణ దారులు, లిటిగెంటులు కూడా విజృంభించి స్థలాలను స్వంతం చేసుకోవాలనే ప్రయత్నాలు ముమ్మరం చేయడం కాదనలేని సత్యం. 

కొండ చరియల్లో భూములను కొనుగోలు చేయడం ద్వారా కొండలనూ కలుపుకోవచ్చనే వ్యూహం చాలా మంది బడాబాఋలు, కంపెనీలు అనుసరించడం పరిపాటిగా మారింది. మరోవంక ప్రభుత్వమే బిల్డ్‌ ఏపి పథకం కింద 110 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు 15 ఎకరాలు అమ్మేందుకు నవంబరు 23ను ముహూర్తంగా నిర్నయించి ప్రకటించింది. రాజదాని  ప్రకటన తర్వాత వేలాది భూ అక్రమాలు జరిగాయనీ ఇవన్నీ ఇన్‌సైడర్‌ ట్రేడిరగ్‌ కిందకు వస్తాయని టిడిపి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ  ఆరోపించారు. 

    ప్రతిపక్షం ఆరోపణ ఒకటైతే పాలక పక్ష ప్రముఖుడు విశాఖ ఇన్‌చార్జిలా వ్యవహరిస్తున్న ఎంపి విజయసాయి రెడ్డి కూడా ఒక అధికారిక సమావేశంలో ఇలాంటి ఆరోపణలే చేయడం కాక రేపింది. అవినీతిపరులు భూములు ఆక్రమిస్తున్నారని డీడీఆర్సీ సమావేశంలో ఆయన అనడంతో వైసీపీ ఎమ్మెల్యే  ధర్మశ్రీ, అమర్‌నాథ్‌ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. నిర్ధారించుకుంటే అందరినీ కలిపి అనడం పట్ల చోడవరం ఎమ్మెల్యే అభ్యంతరం నిజమేనని తెలియవచ్చింది.అయితే సమావేశానంతరం జాయింట్‌ కలెక్టర్‌ ఇతర అధికారులు వ్యక్తిగత అపోహలు తొలగించే ప్రయత్నం చేయడంతో వారు సంతృప్తి చెంది సర్దుకున్నారు. ఈ సమయంలోనే వైసీపీలో విజయసాయిరెడ్డిపై తిరుగుబాటు వచ్చిందని , పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్‌ వారిని పిలిపించి మందలించారని మీడియాకు కథనాలు లీకైనాయి.

    అయితే అలాంటి సమావేశమే జరగలేదని తాము అమరావతి వెళ్లనేలేదని ఎమ్మెల్యే గట్టిగా  ఖండిస్తున్నారు. ఆక్రమణలు ఆక్రమాలపై చర్యలు తీసుకోవాలనేది తమ విధానమని కూడా చెబుతున్నారు. విశాఖలో పాలనా రాజధాని రావడం ఇష్టం లేని వారే ఇలాంటి కథలు వ్యాప్తి చేస్తున్నారనీ వారి ప్రత్యారోపణగా వుంది. ఇవన్నీఎలా వున్నా 2021 ఫిబ్రవరినాటికి విశాఖకు పాలనా రాజధాని తరలి రావడం తథ్యమని అధికార పక్ష ఎమ్మెల్యే లు విశ్వాసంగా వున్నారు ఇందుకు తగినట్టే విజయసాయిరెడ్డి కూడా నగరంలో ఒక ఉత్సవంలో పాల్గొంటూ రాజధాని వచ్చేస్తుందని ప్రకటించారు. ఎమ్మెల్యే తోనూ చర్చలు జరిపారు. స్థానిక సంస్థ ఎన్నికలకు సన్నాహాలపై ఈ సమావేశం జరిపినట్టు సాక్షిలో వార్త ప్రచురించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థ ఎన్నికలు ఇప్పుడు జరపలేమనే వైఖరితో వుంది గనక ఈ  వార్త ఎంతవరకు నిజమన్నది ప్రశ్నార్థకమే అవుతుంది. ఏమైనా విశాఖలో వివాదాలు సందడి పెరగడం మాత్రం నిజం. వైసీపీ నాయకులు పాలనా రాజధాని పరుగులాపలేదన్నదీ నిజం.