తెలకపల్లి రవి విశ్లేషణ: దుబ్బాక ఉపఎన్నిక: బిజెపి గెలుపు కుదుపా?మలుపా?

తెలకపల్లి రవి విశ్లేషణ: దుబ్బాక ఉపఎన్నిక: బిజెపి గెలుపు కుదుపా?మలుపా?

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందనరావు విజయం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఒక కుదుపు అనడం నిస్సందేహం.అత్యధిక రౌండ్లలో ఆధిక్యత చూపుతూ వచ్చిన బిజెపి చివరి దశలో మారినట్టు కనిపించిన సంఖ్యను కూడా మళ్లీ మార్చి విజయం సాధించింది. గతంలో 25వేలకు అటూ ఇటుగా వున్న బిజెపి ఓట్లు 65వేలు దాటిపోయాయంటే ఎంతపెంచుకున్నది తెలుస్తోంది. అభ్యర్థి రఘునందనరావు గతంలో మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు కావడం, ముందే ప్రచారం ప్రారంభించి దూకుడుగా వెళ్లడం,  ఇవన్నీ ఈ ఫలితానికి దారితీశాయి. చివరి పది పదిహేను రోజుల్లో బిజెపినాయకత్వం కేంద్ర సహాయ మంత్రి కిషన్‌ రెడ్డితో సహా కదలివచ్చారు. బిజెపికి టిఆర్‌ఎస్‌ హైప్‌ ఇస్తున్నదని కాంగ్రెస్‌ ఆరోపిస్తే కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌ ఒకటేనని బిజెపి ఆరోపించింది. ఈ విధంగా ఎన్నిక దృశ్యం తికమక అయింది. పాలకపక్ష అభ్యర్థిగా పోటీ చేసిన సోలిపేట సుజాత మృతిచెందిన ఎంఎల్‌ఎ రామలింగారెడ్డి భార్య గా సానుభూతి పొందలేకపోగా బహీనపోటీదారుగా తేలిపోయారు. కాంగ్రెస్‌లో చేరి  అభ్యర్థిగా నిలిచిన చెరకు శ్రీనివాసరెడ్డి ముందే వెనక బడ్డారు.కేంద్రంలో పాలక పార్టీగా వుండటమే గాక న్యాయవాదిగా టీవీలో అధికార ప్రతినిధిగా పరిచితుడైన రఘునందన్‌ బలంగా కనిపించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వ  విధానాలపై వ్యతిరేకత, సిరిసిల్ల, గజ్వేల్‌ సిద్దిపేటతో దుబ్బాకను పోల్చి చేసిన ప్రచారం స్థానికులను ఆకట్టుకున్నట్టు కనిపించింది.రఘునందన్‌ను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిగట్టుకుని వెంటాడుతున్నదనే భావం కూడా కలిగింది.  రాష్ట్ర బిజెపి కొత్త అద్యక్షుడు బండి సంజయ్‌ దుందుడుకు భాష సవాళ్లు ఉద్వేగం పెంచి ఆ పార్టీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్త ఆత్మహత్య చేసుకునే విపరీత స్తితిని తీసుకొచ్చాయి.
       ఇవన్నిటితో పాటు రైతు సమస్యలు, సన్నాలు కొనడం లేదనే ఫిర్యాదు, కరోనా కష్టాలు రాష్ట్ర ప్రభుత్వంపై విముఖత కలిగించాయి. కేంద్రంసహాయ నిరాకరణ గురించి, నిధులు పంపకపోవడం గురించి చేసిన ప్రచారం బొత్తిగా ఫలితమివ్వలేకపోయింది. బీహార్‌లోనూ ఇతర  రాష్ట్రాల ఉప ఎన్నికలోనూ కూడా బిజెపి మంచి ఫలితాలే సాధించడం ఇక్కడా ప్రభావం చూపింది. కాంగ్రెస్‌ ఓట్లు కూడా బిజెపికి తరలిపోయిన పరిస్తితి కొంత వుంటుంది. ఇక టిడిపి రాజకీయంగా చురుగ్గా లేకున్నా గతంలో ఆ పార్టీని బలపర్చిన ఓటర్లు ఒక్కసారిగా అదృశ్యమైపోయారు గనక బిజెపికి పడ్డాయి.ఈ అంశాన్నీ కలసి వెయ్యి పైచిలుకు ఓట్లతో రఘునందనరావు విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో పాలక పార్టీకి వ్యతిరేకంగా తీర్పు రావడం అసాధారణం కాదుగాని మంత్రి హరీశ్‌ రావు సర్వశక్తులు కేంద్రీకరించి ఆఖరి నిముషం వరకూ పనిచేసినా స్థానం కోల్పోవడం రాజకీయంగా దెబ్బే.
టిఆర్‌ఎస్‌ నల్లేరుమీద బండిలా నడిచిపోతుందనే అంచనా మార్చుకోవాలని దుబ్బాక ఉప ఎన్నిక హెచ్చరించింది. అప్రమత్తం అవుతామని మంత్రి కెటిఆర్‌ చెవితే బాధ్యత తనదేనని హరీశ్‌ అన్నారు. అంతకంటే కూడా ప్రజలో వ్యతిరేకతకు కారణమైన విధానాల సమీక్ష ముఖ్యం. కాంగ్రెస్‌ నాయకత్వమంతా బూత్‌ స్థాయి వరకూ బాధ్యత తీసుకున్నామని చెబుతున్నా సుదూర తృతీయ స్థానంలోనే మిగిలిపోవడం బిజెపికి సానుకూల పరిణామమే. వారి ఓట్లు లోపాయికారిగా బదలాయించారనే ఆరోపణ నిజమైతే  అది స్వయంకృతాపరాధం, ఇక బిజెపి విషయానికి వస్తే  ఈ విజయం రాష్ట్రంలో తమను ప్రత్యామ్నాయం చేస్తుందని మరీ మరీ చెప్పుకోవడం తొందరపాటు.ఇది రాజకీయ కుదుపే గాని మొత్తంగా  రాష్ట్రంలో మలుపు అని చెప్పడం తొందరపాటు అవుతుంది.ఈ ఫలితాలు రావడానికి ముందు రాత్రి బండి సంజయ్‌ మాది బరాబర్‌ హిందూ పార్టీ అని ప్రకటించడం చూస్తే బిజెపి ప్రజల తీర్పును సరిగ్గా అర్థం చేసుకుందా లేక తన మత రాజకీయాలవైపు మరల్చే పొరబాటు చేస్తున్నదా అని సందేహం కలుగుతుంది.  జిహెచ్‌ఎంసి ఎన్నికలు, రెండు శాసనమండలిస్తానాల ఎన్నికలు కూడా జరిగాక  ఒక మధ్యంతర తీర్పు పూర్తవుతుంది. బహుశా వాటిని  కోసమే ఆ పార్టీ ఇలాంటి నినాదమిస్తుండవచ్చు గాని దుబ్బాక తీర్పు బిజెపి మత రాజకీయాలకు ఆమోదం కాజాలదు. రఘునందనరావు చిరకాల వాంచ నెరవేరినందుకు సంతోష పడొచ్చు గాని బిజెపి అక్కడ వచ్చిన  1100 ఓట్ల ఆధిక్యతను అతిగా అంచనా వేసుకుంటే బెడిసికొట్టవచ్చు కూడా.  అయితే ఆరు వందల  ఓట్లు అటైతే మారిపోయే పరిస్తితే గాని లక్ష ఓట్లతో గెలుస్తామన్న టిఆర్‌ఎస్‌ కోణంలో చూస్తే ఆ ఓటమి చాలా పెద్దదే. ఆ రీత్యా ఇది  ఎన్నిక చరిత్రలో నిలిచిపోతుంది.