తెలకపల్లి రవి: మలిదఫా కోవిడ్‌ మరింత ఆందోళనకరం!

తెలకపల్లి రవి: మలిదఫా కోవిడ్‌ మరింత ఆందోళనకరం!

చూస్తుండగానే కోవిడ్‌ 19 సెకండ్‌ వేవ్‌ అదుపు తప్పిపోవడం ఆందోళనకరంగా మారింది, రోజుకు రెండు లక్షల కేసులకు మించి నమోదవడం మొదటి దఫా పరిస్తితిని మించిపోయింది.కేసులు ఎక్కువగా వున్నా మరణాలు ఆ స్తాయిలో లేవని మొదట అనుకున్నారు గాని ఆ సంతోషం కూడా ఆవిరైపోయింది. మొదటి దఫాలో మరణాల రేటు 1.1 శాతం లోపే ఉండగా ఇప్పుడు 1.3 శాతం దాటిపోయిందని లెక్కలు చెబుతున్నాయి. పైగా పెరుగుదల వేగం కూడా గతం కంటే చాలా ఎక్కువగా వుంది.గతంలో మొదటిసారి గనక అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది, ఇప్పుడు ఆ అనుభవం వున్నా వాక్సిన్ రంగంలొకి వచ్చినా కరోనా తాకిడి కలవరం కలిగిస్తున్నదంటే పాలకుల బాధ్యత మరీ ముఖ్యంగా ఇందుకు ఆధ్వర్యం వహిస్తున్న ప్రధాని మోడీ కేంద్ర ప్రభుత్వ బాధ్యత చాలా ఎక్కువగా వుంది. ఈ విధమైన మలిదఫా విజృంభణ గురించి అప్రమత్తం చేయడంలోనూ అవగాహన కల్పించడంలోనూ వారు పూర్తిగా విఫమైనారు. కరోనాపై విజయం సాధించేశామన్న హడావుడి మన దేశంలోనే గాక ప్రపంచానికే వాక్సిన్‌ దాతమన్న ఆత్మస్తుతి శ్రుతి మించిన ఫలితమిది. వాక్సిన్‌ తయారీ ఇతర దేశాలకు సహాయపడటం మంచిదే గాని దాన్ని  ఉత్సవంగా ప్రకటించిన తర్వాత కొరత ఆవరించడం ప్రణాళికా రాహిత్యానికి ప్రతిబింబం. గతంలో కూడా చప్పట్టుకొట్టడం దీపాలు పెట్టడం అంటూ ఏవో ప్రచార ప్రహసనాలు నడిపి ప్యాకేజి విషయంలో నామకార్థంగా ముగించారు. ఇప్పుడు కూడా టీకాలపై ముందస్తు హడావుడికి వాస్తవంగా వేయాల్సి వచ్చేసరికి జరుగుతున్న దానికి పోలికే లేదు.
              బిజెపి పాలిత రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్‌ గుజరాత్‌ బీహార్‌ వంటి చోట్ల కరోనా వ్యాప్తి మరింత తీవ్రంగా వుంది. మొదటి రెండు రాష్ట్రాలోనూ వెయ్యిశాతం పెరుగుద వున్నట్టు అంచనా. దేశానికి అదేపనిగా బోధ పోసే మోడీ తమ పాలనవున్న చోట్లనే ఎందుకు ఇలాంటి స్థితిని అనుమతించారో అర్థం కాదు. మహార్షాష్ట్ర,కర్ణాటక,చత్తీస్‌ గడ్  కేరళ వంటి పదిరాష్ట్రాలో 84శాతంపైన కరోనా పెరుగుదల కనిపిస్తున్నది. రాష్ట్రాలో పాక్షిక ఆంక్షలు, కర్ఫ్యూులు కొన్నిచోట్ల లాక్‌డౌన్ల వంటివి కూడా అమల్లోకి వస్తుంటే రాకపోకలకు మళ్లీ సమస్యగా మారుతున్నాయి. అన్నీ కలిపి 69 శాతం రైళ్లు మాత్రమే నడపగుగుతున్నాము.వలస కార్మికుల సమస్యలు వంటివి పునరావృతమవుతున్నాయి. .ఆస్పత్రులో పడలకు చికిత్స  అరకొరగా వుంటే ఖర్చు మాత్రం విపరీతంగా మండిపోతున్నాయి. కేంద్రం గతంలో చేసిన సాయం కూడా ఇప్పుడు చేయడం లేదు పిఎంకేర్స్‌ పేరిట సేకరించిన కరోనా నిధి పూర్తిగా ప్రధాని ఇష్టానుసారమే కేటాయించబడుతున్న పరిస్థితి.కొన్ని రాష్ట్రాలో కరోనా వ్యాప్తి తీవ్రతను సరిగ్గా నివేదించడంలేదని వస్తున్న వార్తను బట్టి చూస్తే సమస్య మరింత తీవ్రంగా వుందనేది స్పష్టం.
          ప్రభుత్వ వైద్యరంగాన్నిపూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రైవేటు కార్పొరేట్‌కే వదిలివేసిన పరిస్థితిలో కరోనా ను ఎదుర్కోవడం మరింత సవాలుగా తయారైంది, రెమిడిస్‌వేర్‌ వంటి మందు గాని వాక్సిన్లుగాని పూర్తిగాప్రైవేటు రంగంలోనే వుండిపోవడంతో వారు లాభాలు తప్పక చూసుకుని గిరాకిని బట్టి తయారు చేయడం కొరతకు కారణమవుతున్నది. విదేశాలో అందుబాటులోవున్న మరిన్ని వాక్సిన్లను ఆమోదించితీసుకురావడంలోనూ జాప్యం  కూడా నష్టం కలిగించింది.  అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా టీకాపై తగినంత శ్రద్ద పెట్టకపోవడానికి కారణం తగినంత లాభం లేకపోవడమే.  ఈ కారణం వల్లనే ఇండియా వ్యాక్సిన్ తయారీలో ఒకప్పుడు అగ్రస్థానమునలంకరించింది.  అయితే, ప్రభుత్వ ఫార్మా రంగాన్ని చేజేతులారా దెబ్బతీసుకోవడంతో మనదేశం కూడా ప్రైవేట్ చేతుల్లోనేచిక్కుకుంది .  ప్రైవేటుకు ప్రోత్సహించవచ్చుగాని, ప్రాణరక్షణకు సంబంధించిన వైద్య ఔషధ రంగాలు కూడా వారి చేతుల్లో పెడితే పేద, మధ్యతరగతి వారి ఆరోగ్యానికి భరోసా ఉండదు.  ఇప్పుడు టీకాల కార్యక్రమం అర్ధాంతరంగా ఆగిపోతున్న స్థితికి ఇవన్నీ కారణాలే.  అందిన మేరకు పైతరగతుల వారికీ అందినంతగా అట్టడుగు వర్గాల వారికి అందింది లేదు.  గత అనుభవం రీత్యా ఉపాధికోసం, భద్రతా కోసం, ముందే ఏదో ఒకటి చేసుకోవాలన్న ఆందోళన కూడా వారిని ఆవరించింది.  మాస్కులు, శానిటైజర్లు వంటి వాటి విషయంలోనూ పెద్ద మార్పు వచ్చింది లేదు.  ప్రజారోగ్యం ప్రధమం అన్న వాతావరణం మారిపోవడం ఇందుకు మూలకారణం. ఇవేకాక, కుంభమేళా వంటి కూడా మత రాజకీయాలతో మరింత తీవ్ర సమస్యగా మారుతున్నాయి.  గత ఏడాది మర్కజ్ అనుభవం మరుగునపడిపోవడం  ఆశ్చర్యమే.  ఎన్నికల ప్రక్రియ కూడా ప్రజలు గుమికూడటానికి ఒక కారణమవుతున్నది.  ఒక దశలో విజయవంతంగానే కోవిడ్ ను ఎదుర్కొన్నట్టు చెప్పుకున్న దేశం తృటిలో మళ్ళీ విపత్కర దశకు చేరుతుంటే పాలకులపై దేశ ప్రజలు నిజంగా నమ్మకం పెట్టుకోగల స్థితి లేకుండా పోయింది. వూరికే భయపెట్టవద్దనే నిజమేగాని కళ్ళముందు కనిపించే కరోనా సవాలును కాదనడం ఎలా సాధ్యం?