తెలకపల్లి రవి విశ్లేషణ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పై జవాబురాని ప్రశ్నలు 

తెలకపల్లి రవి విశ్లేషణ: భారత్ బయోటెక్ కోవాగ్జిన్ పై జవాబురాని ప్రశ్నలు 

భారత్‌ బయోటెక్‌ వాక్సిన్‌ కోవాగ్జిన్‌పై  సందేహాలను తేలికగా కొట్టిపారేయలేమని నిపుణులు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్‌ ఆక్సాజెనికా తయారు చేసిన కోవిషీల్డ్‌ సీరమ్‌ ఇన్‌స్ట్ట్టిట్యూట్‌ ఆఫ్‌  ఇండియా ద్వారానూ పూనాలో తయారవుతుంటే హైదరాబాదులో కోవాగ్జిన్‌ పూర్తిగా దేశీయ వాక్సిన్‌ కావడం పట్ల అందరూ సంతోషించారు. ఈ రెండు వాక్సిన్ లు కూడా పూర్తి పరీక్షలు కాకుండానే అత్యవసర ప్రాతిపదికమీద వాడటానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతించారు. అమెరికాకు చెందిన ఫైజర్‌ బయోటెక్‌ ఎన్‌, మాడ్రనా వాక్సిన్‌ లు కూడా అందుబాటులోకి వచ్చినా  సాంకేతిక ఆర్థిక కారణాల వల్ల  ఇండియా ఈ రెంటినీ ఎంచుకుంది. గత నెలలో ప్రధాని మోడీ ప్రత్యక్షంగా ఆ రెండు కేంద్రాలకు వెళ్లిరావడం కూడా తెలిసిందే. వాస్తవానికి ఇండియాలో అత్యవసర ప్రాతిపదికపై వాడటం అన్న అనుమతి వుండదు. కాకపోతే ప్రమాదం లేదని నిరూపితమైన వాక్సిన్‌ను పరీక్ష దశలోనే ప్రజలకు కూడా ఇవ్వడాన్ని అనుమతిస్తుంటారు. వాక్సిన్‌ నిర్ధారణ జరిగి వాడకంలోకి రావడానికి మూడు గాక నాలుగు దశలుంటాయి. తొలి దశలో చాలా కొద్ది మందికి ప్రయోగాత్మకంగానే ఇచ్చి అతిజాగ్రత్తగా పరీక్షిస్తారు రెండవ దశలో ఎక్కువ మందికి ఇచ్చి చూస్తారు.దాని వల్ల హాని వుండదనేది ఈ   దశలో ముఖ్యంగా తేస్తారు. మూడవ దశలోనూ అదే చేస్తారు గాని సంఖ్యభారీగా వుండొచ్చు. దాని సమర్థత శాతం ఈ దశలో అంచనా కడతారు.  ఇవన్నీ అయిన తర్వాత లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేస్తారు. నాలుగోవ దశలో అధికారులు, వైద్యులు అందరూ పరిశీలించి ఆమోదం తెలుపుతారు. ఇందులో రెండవ దశ తర్వాత ఆక్స్‌ఫర్డ్‌ వాక్సిన్‌ను  బ్రిటన్‌ నేరుగా అనుమతించింది. భారత దేశంలో అంతకంటే కొంచెం ఎక్కువగానే పరీక్షించామంటూ సీరమ్‌ కూడా అనుమతి పొందింది,

        భారత్‌ బయోటెక్‌ వారు కూడా ఆ సమయంలోనే  దరఖాస్తు చేశారు, హఠాత్తుగా వారికి డ్రగ్స్‌ నియంత్రణ సంస్థ అనుమతి భించింది.  అప్పటికి మూడవ దశ మిగిలి వుంది.  ఈ వాక్సిన్‌ వల్ల హాని లేదని మాత్రమే అప్పటికి తేలింది. ఆక్స్‌ఫర్డ్‌ వాక్సిన్‌వలె గాక మరో తరహాలో పనిచేసే ఈ వాక్సిన్‌ సమర్థత ఎంత శాతం అన్నది ఇంకా తేలలేదు. విస్తారంగా ప్రయోగించి చూడలేదు కూడా. ఓపెన్‌ లేబుల్‌ ట్రయల్‌ పేరిట జరిగే ఈ ప్రక్రియ ఇండియా అనుసరిస్తుంది. కాని దానిపై స్పష్టత లేదు. ఈ విధంగా హడావుడిగా అనుమతిస్తే ఇబ్బందులు రావచ్చని నిపుణు హెచ్చరికలు చేశారు.  సీరం సంస్థ సిఇవో ఆదార్‌ పూనావాలా కూడా అదే విధమైన సందేహాలు వెలిబుచ్చారు. ప్రభుత్వం సురక్షితమే కదా అని మీడియా అడిగినపుడు మంచినీళ్లు ఏ విధంగా సురక్షితమో  ఇవీ అంతే అని వ్యాఖ్యానించారు. ఈ మాట భారత్‌ బయోటెక్‌ సిఎండి కృష్ణ ఎల్లాకు బాగా బాధ కలిగించాయి. ఆయన జనవరి 4న ఆన్‌లైన్‌ మీడియా సమావేశం నిర్వహించి తమ వాక్సిన్‌  గురించి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించారు, అయితే ఓపెన్‌ లేబుల్‌ ట్రయల్‌ ఏమిటనేదానిపై మాత్రం సమాధానం ఇవ్వలేదని సైన్స్‌ సంపాదకులు  వ్యాఖ్యానిస్తున్నారు. నేను కూడా తెలుసుకోవాలి అనే రీతిలో చాలా సమాధానాలిచ్చి సరిపెట్టారు. ఇంత పెద్ద సంస్థు అనుమతినిచ్చాయంటే అర్హత లేకుండా ఇస్తాయా అన్నది దాని సారాంశం.

             అయితే నిపుణులు దీనిపై లేవనెత్తే సందేహాలు కూడా తీవ్రమైనవి. మొదటి విషయం పరీక్ష భారత్‌ బయోటెక్‌ కోవాక్సిన్‌పై  జవాబు రాని ప్రశ్నల కోసం తయారు చేసిన వాక్సిన్‌ను ఆ దశలోనే వినియోగించడం పొంతన కుదరుతుందా? దాన్ని ఆ దృష్టితో  చేయలేదు కదా? అది ప్రధాన ప్రశ్న, శాస్త్ర పరిశోధనలో వినియోగం వేరు ప్రయోగం వేరు అని చెప్పనవసరం లేదు.
          రెండవది: మూడవ దశ తర్వాత గాని సమర్ధత పై అంచనా రాదు. వస్తే గాని దాన్ని ఇవ్వడం వల్ల  ఉపయోగం వుండదు. మరి ఇక్కడ ఎకాఎకిన మూడో దశనే వినియోగ దశగా చేయడం సమర్థమైన ఫలితాలిస్తుందా?
         మూడవది : డిసిజిఐ గాని ఐసిఎంఆర్‌ గాని కోవాగ్జిన్‌ను ఎలా అనుమతించాయనేదానిపై సాధికారిక సమాచారం లేదు. గతంలో వారు హైడ్రోక్టోరోక్విన్ ‌వంటివాటిని అనుమతించి వెనక్కు తగ్గడం మనకు తెలుసు, మరోసారి అలా జరిగితే?
       నాలుగోవాది: భారత్‌ బయోటెక్‌ కూడా ఇందుకు సంబంధించిన అన్ని విధాలైన సాధికారిక సమాచారం లేదంటున్నది, కోవిషీల్ట్‌లా గాక మరో తరహా కోవిడ్‌ వైరస్‌కు కోవాగ్జిన్‌  తాత్కాలికంగా ఉపయోగపడుతుందని అనుమతించినట్టు డిసిజిఐ చెబుతున్నది. అలా చెప్పడానికి ఆధారాలు ఏమిటో మాత్రం వ్లెడిరచలేదు, అలాంటి డేటా తమ దగ్గర లేదని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. ఐసిఎంఆర్‌ తరపున  ఈ  నిర్ణయాన్ని సమర్తిస్తూ మాట్లాడిన బరాం భార్గవ కూడా  అది తమ అంచనా అని మాత్రమే చెబుతున్నారు. కాని శాస్త్రీయ ఆధారాలు వుండాలి కదా?
            వాక్సిన్‌ రంగంలో భారతదేశానికి మంచి అనుభవలు, ప్రతిష్ట వున్నాయి, మన జనాభా ఎక్కువగా వుండటంతో పాటు వ్యాధులు కూడాచాలా కలం కొనసాగడం, ఔషదరంగంలో ప్రభుత్వ సంస్థ కృషి,తర్వాత ఫార్మా రంగంప్రగతి ఇందుకు కారణాలైనాయి. ప్రపంచంలోనే అతి పెద్ద వాక్సిన్‌ కార్యక్రమం మనం చేపడుతున్నట్టు ప్రధాని ప్రకటించారు కూడా. అయితే సురక్షితంగా నమ్మకంగా వుండటం అన్నిటికన్నా ముఖ్యం కదా?  కాస్త ఆలస్యమైనా సరే స్పష్టమైన ఫలితాలు సమర్థత సురక్షితత్వం తేలాకే ముందుకు వెళ్లడం మంచిది. ఇదేదో దేశ విదేశీ సమస్య కానేకాదు. విశా ప్రజానీకం ఆరోగ్యభద్రత సమస్య కరోనాతో ఇప్పటికి పడిన అవస్తవలు చాలక అస్పష్టంగా అడుగేయడం పొరబాటు కాదా? దీనివల్ల కలిగే కష్టనష్టాలు ప్రజలును మరింత హడలెత్తిస్తే? అసలు ఆక్స్‌ఫర్డ్‌ వాక్సిన్‌ ఫైజర్‌ వాక్సిన్‌తోనే కొన్ని దుష్పలితాలు బయిటపడుతున్నసమయంలో మరింత జాగ్రత్త వుండాలి.