తెలకపల్లి రవి: బీహార్ ఎన్నికలు: పాటలీపుత్రతో పరివర్తనకు నాంది?

తెలకపల్లి రవి: బీహార్ ఎన్నికలు: పాటలీపుత్రతో పరివర్తనకు నాంది?

బీహార్‌ ఎన్నిక ప్రణాళికలో బిజెపి కరోనావాక్సిన్‌ ఉచితంగా ఇస్తానని వాగ్దానం చేయడంపై ఎన్నో విమర్శులు  విసుర్లూ రావడం అక్కడ పరిస్తితికి ప్రతిబింబం.కరోనా వాక్సిన్‌ ఇంకా తయారు కాలేదన్నది ఒకటైతే, కేంద్రంలో పాలన చేసే పార్టీ ఒక రాష్ట్రంలోనే ఆ విధమైన వాగ్దానం ఎలా చేస్తుందనేది అంతకన్నా కీలకమైన ప్రశ్న,  బీహార్‌లో నితిష్‌ కుమార్‌ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం కరోనాను అరికట్టడంలో విఫలమైన తీరుపై ప్రజల్లో ఉన్నఅసంతృప్తిని గుర్తించక తప్పలేదు గనకే బిజెపి ఈ విపరీత వాగ్దానం చేసింది. గత ఎన్నికల్లోనూ ప్రధాని మోడీ 2015లో ఎన్ని వేల కోట్ల ప్యాకేజీ కావాలి లక్ష కోట్లా రెండు లక్షల కోట్లా అనివూరించిన తీరు అపహాస్యం పాలైంది.ప్రజలు బిజెపిని పూర్తిగా తిరస్కరించి ఒకటిగా ముందుకొచ్చిన ఆర్జేడీతో కలసి ముందుకొచ్చిన నితిష్‌ కూటమిని గెలిపించారు. కాని తర్వాత నితీష్‌ తనదైన రాజకీయంతో ఆ కూటమినుంచి ఆర్జేడీని తొలగించి మళ్లీ ప్రజలు తిరస్కరించిన బిజెపికి ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు, గద్దెపై ముఖ్యమంత్రిగా తానున్నా ఈ సారి నితిష్‌ పూర్తిగా పరాధీనమై పోయారన్నది జనవాక్యంగా మారింది.మోడీకి తనే ప్రత్నామ్నాయమన్న స్తాయిలో ఆయనను రానివ్వబోనని చెప్పిన నితిష్‌ మధ్యలో మళ్లీ గెవడానికి నాటకం నడిపి ఆ తర్వాత మళ్లీ నెత్తినపెట్టుకోవడం రాజకీయ అనైతికతకు పర్యాయపదమైంది. ఇప్పుడు అసెంబ్లీ ప్రచారంలోనూ ఎక్కడ చూసినా మోడీ బొమ్మలే దర్శనమిస్తున్నాయి. సభలు కూడాఆయనే ఎక్కువగా నిర్వహిస్తున్నారు.పదిహేనేళ్ల నితిష్‌ పాలనలో బీహార్‌ సుపరిపాలన ప్రచారం తలకిందులై అవినీతి ఆత్యాచారాలు అసమర్థత తాండవిస్తున్నాయి.  ఉత్తర భారత దేశంలో బిజెపి నేరుగా అధికారంలోకి రాలేకపోయిన ఏకైక రాష్ట్రం బీహార్‌.1990 వ దశకంలో విపిసింగ్‌ను కూదోసేందుకై అద్వానీ రథయాత్ర పేరుతో మండల్‌కు పోటీగా కమండల్‌ రథయాత్ర మొదలెట్టినప్పుడు పగ్గాలు వేసింది బీహార్‌. అప్పటినుంచి పదిహేనేళ్లు లాలూ ఆయన గడ్గి కుంభకోణంలో చిక్కాక  రబ్రీదేవి పాలననడిచింది.మరో పదిహేనేళ్లుగా నితిష్‌  ఏలుతున్నారు.

              భారత దేశంలో మొదటి మహాసామ్రాజ్యమైన మౌర్యవంశం నాటి నుంచి బీహార్‌ను వెనకబడిన కులా చైతన్యానికి నిలయంగా చెబుతుంటారు.1970లో జయప్రకాశ్‌ ఉద్యమం కూడా అక్కడే మొదలైంది. అప్పటి నుంచి దాన్ని హైజాక్‌ చేయడానికి బిజెపికూటమి తంటాలు పడుతూనే వుంది.లౌకిక శక్తులు అనైక్యతల  వారు అధికారంలో వున్నప్పటి తప్పిదాలు కలసి అందుకు అవకాశమిచ్చాయి. 2014లో కేంద్రంలో మోడీ ఘన విజయంసాధించిన తర్వాత మొదట దెబ్బతిన్నది బీహార్‌లోనేనంటే దానికి కారణం నితిష్‌ ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించి ఆర్జేడీతో కలవడమే.  ఆ ఎన్నికల్లో మోడీగాని,అప్పటి బిజెపి అద్యక్షుడు అమిత్‌షా గాని చేసిన ప్రసంగాలు జుగుప్స కలిగించాయి.  నితిష్‌ కూటమి గెలిస్తే పాకిస్తాన్‌లో పండుగ చేసుకుంటారని నోరు పారేసుకున్నారు. ఆ సమయంలోనూ సర్వేలు  బిజెపికి గెలుపునే జోస్యం చెప్పాయి.కాని కూటమి ఘన విజయంతోమోడీ మోతకు పగ్గాలు పడ్డాయి. తేజస్వి యాదవ్‌ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. కానికుటిల నీతికి మారుపేరైన నితిష్‌ కుమార్‌ ఒక క్రమపద్ధతిలో దానికి తూట్టు పొడిచారు.లాలును దేశంలోనే అరాచకానికి మారుపేరుగా చిత్రించిన మోడీ అనుకూల మీడియా  ఆ ప్రచారాన్ని పునరుద్ధరించింది. కేంద్రం పత్యేకంగా

వారిపైనే దాడులు  చేసి రెచ్చగొట్టింది. లాలూకు శిక్షపడిన జైలు పాలైనా ఆ కుటుంబం, ఆర్జేడీలు మళ్లీ వూపిరిపోసుకోవడానికి  తనతో పొత్తు కారణమని ఆయన భయపడ్డారు. ఈ తలకిందులు  రాజకీయాన్ని జెడియు అద్యక్షుడైన శరద్‌ యాదవ్‌ వ్యతిరేకిస్తే రాజ్యసభలో ఆయన సభ్యత్వం రద్దు చేయించారు.
             పదిహేనేళ్ల పాలనలో నెరవేరని వాగ్దానాతో ప్రజల్లో పలుచనై పోయారని ప్రతిష్ట కోల్పోయారని బిజెపి భావిస్తున్నది. రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కుమారుడైన చిరాగ్‌ పాశ్వాన్‌ మోడీకి విధేయత చాటుతూనే కూటమి నుంచి బయిటకు రావడంవెనక బిజెపి హస్తం బహిరంగ రహస్యం. ప్రజా వ్యతిరేకత మూటకట్టుకున్న నితిష్‌ పాలనతో విడగొట్టుకుంటూ వీలైతే రేపు చిరాగ్‌తో కసి పాలనలోకి రావాలని బిజెపి  కలుకంటున్నది. అయితే ముఖ్యమంత్రిగా ఆయనను ముందుంచక తప్పని స్థితి.  ఇరువైపులా ఘనీభవించిన ఈ  అవకాశవాదంతో నితిష్‌ మోడీ ప్రచారంపై ఆధారపడటం ఒకవైపు ఆయనను ముందుంచుతూనే తమ వ్యూహాలు సాగిస్తున్న బిజెపి నేతలు చాణక్యం మరోవైపు బీహార్‌ రాజకీయాలను రక్తికట్టిస్తున్నాయి. కేంద్రం ఆధీనంలోని నీతిఆయోగ్‌ కూడా బీహార్‌ వెనకబడిపోయినట్టు లెక్కలు  విడుదల  చేసింది. జాతీయనేరాల సంస్త లెక్కలు కూడా అలాగే వున్నాయి.


               తేజస్వి యాదవ్‌ నాయకత్వంలో ఆర్జేడీ కాంగ్రెస్‌ వామపక్షాలు సంఘటన మహాఘట్‌బంధన్‌కు ప్రచారంలో ప్రజాదరణ ా కనిపిస్తున్నది. సిపిఐ సిపిఎం,సిపిఐఎంఎల్‌ మూడింటికి బీహార్‌లో తమవైన కేంద్రాలు  వున్నాయి. ఆర్జేడీ కూటమి సీట్ల సర్దుబాటు త్వరగా పూర్తి చేసుకుని రంగంలోకి రావడం సానుకూల అంశంగా వుంది. తన వయసులో సగం కూడా లేనియువ నాయకుడైన తేజస్విపై నితిష్‌ పేరెత్తి మరీ దాడి చేయడం బట్టి పోటీని ఎంత తీవ్రంగా తీసుకుంటున్నారో తెలుస్తోంది.లాలూ ప్రసాద్‌ ఆటవిక పాలన నుంచి బీహార్‌ను విముక్తి చేసిన సుశానం నితిష్‌ది అని చెప్పిన వ్యాఖ్యాతలు కూడా ఇప్పుడు సమర్తించలేకపోతున్నారు. ఎన్‌డిఎ కూటమిపై జరిగే పోరాటంలో చిరాగ్‌ పాశ్వాన్‌ ఎల్‌జెపి,ఒవైసీ మజ్లిస్‌ నాయకత్వంలో ఏర్పడిన మరో కూటమి సైంధవ పాత్ర పోషిస్తున్నాయని విమర్శకుల భావనగా వుంది.  కాంగ్రెస్‌ ఆర్జేడీలు ఎన్‌డిఎను నివరించలేవనీ తామే ఓడిస్తామని విస్తారంగా పోటీలు పెట్టిన మజ్లిస్‌ బిఎస్‌పి  కూటమి ఓట్ల చీలికకు  కారణమవుతున్నది.  


నితిష్‌కు మహిళల ఓటింగు  పెట్టని కోట అని అంటున్నా ఈకాలంలో ముజఫరాపూర్‌ మహిశాశ్రయంలో అత్యాచారాలపై సిబిఐ చార్జిషీటు మేరకు శిక్షలు  పడటం సంచనం కలిగించినపరిణామం.ఇక మహిళా వికాస్‌ సమితిలో రెండు వేల కోట్లు, బిసి అభివృద్ధి సమితి పేరిట ఐఎస్‌ఎస్‌ రామయ్య ద్వారా మరో భారీ కుంభకోణం కుదిపేశాయి. టాయిలెట్ల కుంభకోణం కుళాయి కుంభకోణం  రోత పుట్టించాయి. హత్రాస్‌ అత్యాచారానికి ముందే ఏరియాలో దళిత బాలికపై అమానుషం జరగడమే గాక ఆమె తలిదండ్రులను జైలు పాలు చేయడం తీవ్ర నిరసనకు దారితీసింది. ఆర్జేడీ  పదిలక్షల ఉద్యోగాలు   కల్పిస్తామంటే ఎగతాళిచేసిన బిజెపి తాము 19 లక్షల ఉద్యోగాలిస్తామని గొప్పగా వాగ్దానం చేీసింది.బీహార్‌లో మిల్లుల మూతను నివారించి తగు చర్చులు తీసుకునే బదులు దేశానికే చౌకగా వలస కార్మికులను ఎగుమతి చేసే ఫ్యాక్టరీగా మారిందని నితిష్‌ నింద మూటకట్టుకున్నారు.లాక్‌డౌన్‌ కాలంలో  వలస కార్మికుల సమస్య బీహార్‌నే ఎక్కువగా ప్రభావితంచేసింది. తిరిగివచ్చిన వారు పని తిండి లేక నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఈ వాస్తవాన్నీ ప్రజల దృష్టిలోవుండబట్టే ప్రభుత్వ వ్యతిరేకత ప్రస్పుటంగా కనిపిస్తున్నది.ఇక చిరాగ్‌ పాశ్వాన్‌ మోడీనికి కీర్తిస్తూనే తనూ నితిష్‌కు వ్యతిరేకమన్నట్టు సాగించేప్రచారం తికమకపెడుతున్నది.వీటన్నిటినీ అధిగమించి తామే విజయం సాధిస్తామని, నవంబర్ 9 న నితీష్ ఓడిపోతే 10న బైయిల్ పై లాలూ విడుదల కానున్నారని తేజస్వి చెప్తున్నారు.  తేజస్వి యువ నాయకత్వంపై ఆసక్తి పెరుగుతుండగా, యువత నుంచి నితీష్ ప్రసంగాలకు డిజ్ లైక్స్ పెరుగుతున్నాయని కొందరు పోల్చి చూస్తున్నారు.  మోడీ ప్రచారంలో కాశ్మీర్ సమస్య, చైనాతో ఉద్రిక్తతలో బీహార్ జవాన్ల పాత్ర వంటి అంశాలను లేవనెత్తి జాతీయవాదం జొప్పించాలని చూస్తున్నారు.  గత ఎన్నికల్లో కాశ్మీర్ కార్డు విఫలైనట్టే ఇవి కూడా విఫలం కావలసిందేనని ప్రత్యర్ధులు చెప్తున్నారు.  ఇప్పుడు మతతత్వ రాజకీయాలు, హక్కులపై దాడి, కరోనా అనంతర సంక్షోభం అత్యాచారాల నేపథ్యంలో తొలి పరీక్షగా బీహార్ ఎన్నికలను చూడవలసి ఉంది.  దీని తరువాత బెంగాల్, యూపి తదితర ఎన్నికలు వస్తాయి.  ప్రస్తుత శాసనసభలో ఎన్డీఏకు 125స్థానాలుండగా, మహాఘట్ బంధన్ కు 100 స్థానాలు ఉన్నాయి.  నవంబర్ లో ఎన్నికల్లో జెడియు 122, బీజేపీ 121 స్థానాల్లో పోటీ చేస్తుంటే ఆర్జేడీ 144, కాంగ్రెస్ 70, వామపక్షాలు 29 చోట్ల పోటీ చేస్తున్నాయి.  ఎల్జేపీ మజ్లీస్ కూటమి, ఎన్ సీపీ కూడా అత్యధిక స్థానాల్లో పోటీలో ఉన్నాయి.  జోస్యాలు, సర్వేలు ఎలా ఉన్నా, గతంలో చాలాసార్లు చారిత్రిక పరిణామాలకు సాక్షిగా నిలిచిన పాటలీపుత్రం ప్రస్తుత తీర్పు ఎలా వుంటుందని దేశమంతా ఆసక్తిగా చూస్తున్నది.