బీజేపీ కొత్త బృందం వ్యూహం, టీడీపీ పోటీ హిందూత్వ వైనం..!

బీజేపీ కొత్త బృందం వ్యూహం, టీడీపీ పోటీ హిందూత్వ వైనం..!

 తెలకపల్లి రవి విశ్లేషణ :

          ఎన్నికల్లో టిడిపి ఘోరంగా దెబ్బతిని జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక  ఆ వూసు లేకుండా పోయింది.  టిడిపి పాలనలో అక్రమాల పై వైసీపీ ప్రభుత్వ సీట్స్ , ఉపసంఘాలు, ప్రజా వేదిక కూల్చివేత, రాజధాని మార్పు, అచ్చెం నాయుడితో సహా పలువురిపై కేసులు, కక్ష సాధింపు ఆరోపణలు  కరోనా ఆంక్షలు  అన్నింటి మధ్యన టిడిపి తీవ్రమైన ప్రతికూల  పరిస్తితిని ఎదుర్కొవలసి వచ్చింది. రాజ్యసభలో ఆ పార్టీ  సభ్యులు  దాదాపుగా బిజెపిలో విలీనమై పోయారు. మాజీ మంత్రులు  కూడా కొందరు చేరారు. ఇంత జరిగినా టిడిపి మాత్రం బిజెపిపై పాత విమర్శలు  దిగమింగడమే గాక ప్రధాని మోడీని ప్రశంసించడం విధానంగా మార్చుకుంది. కరోనాపై ప్రధానితో మాట్లాడటానికి చంద్రబాబు స్వయంగా ప్రయత్నించి మళ్లీ కాల్‌ చేయించుకుని సంతోషించారు. వైసీపీ ప్రభుత్వ పాలన అరాచకంగా వుంది గనక కేంద్రం జోక్యం చేసుకోవాలని పదేపదే ప్రతినిధి బృందాలను పంపి మరీ కోరారు. 
   
టిడిపి వైఖరి ఇప్పటికి ఇలాగే వుంది కానీ  బిజెపి  స్పందించకపోగా వైసీపీతో నేస్తానికే ప్రాధాన్యతనిస్తున్నది. పార్లమెంటులో నాలుగో స్థానంలో  వున్న వైసీపీ బలం   అందుకోడానికి  కారణం.  ప్రత్యర్థి  పార్టీపై కేంద్ర ఏజన్సీలను పురికొలిపే  మోడీ  దూకుడు దృష్ట్యా జగన్‌పై కేసు విచారణ నేపథ్యంలో కేంద్రంతో ముఖాముఖి ఘర్షణ పెట్టుకోరాదన్నది వైసీపీకి పగ్గాలు  వేస్తుండడం మరో  కారణం. రాష్ట్రంలో  వైసీపీ తప్పిదాలను తన కోణంలో విమర్శిస్తూనే టిడిపిని కూడా దెబ్బతీసి పెద్ద పార్టీగా  ఎడగాలన్నది బిజెపి వ్యూహంగా మారింది. ఈ క్రమంలో గత పర్యాయం కాంగ్రెస్‌ మాజీ  మంత్రి  కన్నా లక్ష్మీనారాయణను రాష్ట్ర అద్యక్షుడుగా పెట్టుకుని  బయిటవారిని రాబట్టి రాజకీయ పట్టు పెంచుకోవాని ఒక తరహాలో అడుగు వేసింది. కన్నాను జగన్‌ బొత్తిగా మన్నించే పరిస్థితి లేకపోవడం ఆయన కూడా టిడిపినే అనుసరిస్తున్నాడని అధిష్టానం భావించడంతో ఆస్యంగానైనా ఆయన స్థానంలో ఆరెస్సెస్‌ గోత్రీకుడైన సోము వీర్రాజును తీసుకురావడంతో తదుపరి విధానం దాదాపు స్పష్టమైపోయింది. వీర్రాజు చంద్రబాబు వ్యతిరేకి గనక తమకు బాగా ప్రయోజనమని వైసీపీ అమితంగా సంతోషిస్తే ఇది స్వఉపకారమే  వుంటుందని బిజెపి వారు జనాంతికంగా అంటూ వచ్చారు. ఆ మాట అంతరార్థం అంతర్వేది  రథం దగ్ధం తర్వాత బాగా అర్థమవగా కార్యవర్గం మరింతగా తెలియచుబుచ్చుతోంది. టిడిపి నుంచి వచ్చిన సుజనా చౌదరి లేదా పురందేశ్వరి వంటివారి పేర్లు వినిపించిన పరిస్తితి నిజం కాలేదు. వారిని ఎంచుకోకపోవడంలో  సోషల్‌ ఇంజనీరింగ్‌ కూడా తేలిపోయింది. కొత్త కార్యవర్గం కూర్పులో మాధవ్‌, విష్ణువర్ధనరెడ్డి వంటివారిని ప్రధాన కార్యదర్శలను చేయడం, విష్ణు కుమార్‌ రాజును  ఉపాద్యక్షుడుగా నియమించడం, మధ్యలో శ్రుతి మించి మాట్లాడిన మాజీ టిడిపి గొంతును అధికార ప్రతినిధుల  జాబితా నుంచి తగ్గించడం,  సత్యమూర్తి, ఆంజనేయ రెడ్డి తిరుపతి రావు చందు సాంబశివరావు తదితరులను కొనసాగిస్తూ ప్రాంతీయ ప్రాతినిధ్య భావన కలిగించడం, మహిళకు స్థానం,  పెద్ద నేతను మాత్రమే గాక వారి అనుయులకు కూడా చోటు ఇవ్వకపోవడం ఆరోపణలున్నా కొందరిని తొగించకపోవడం ఇవన్నీ యాదృచ్చికం కాదు. మోడీ  హిందూత్వ జోడు గుర్రాపై ఏపీ  రాజకీయాలలో ప్రాభల్యం పెంచుకోవాలనే బిజెపి ఆశకు అంతర్వేది రథం మంటలు  కలసి వచ్చాయి. అయితే  ఇక్కడ కూడా గతంలో టిడిపితో మైత్రి చేసినప్పుడు కెపెంటపాడు రథం దగ్ధం వంటివి కనిపించ లేదా అన్న ప్రశ్న తప్పలేదు. కనుకనే వారిని దూరం పెట్టి  మొన్న  ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న జనసేనాని పవన్‌ కళ్యాణ్‌పై ఆధారపడటమే మెరుగని కూడా నిర్ణయించుకున్నారు,

రాజకీయంగా టిడిపి స్థానాన్ని తాము పొందాలని బిజెపి ఆశపడుతుంటే  బిజెపి కన్నా తామే హిందూత్వ పరిరక్షకులు గా కనిపించాలని టిడిపి తాపత్రేయపడటం ఈ  కథలో కొసమెరుపు. జగన్‌ ప్రభుత్వ దాడుల  కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న టిడిపి అన్ని అంశాలపై విమర్శలు  చేస్తూనే ఆయన క్రైస్తవానుబంధాన్ని లక్ష్యంగా చేసుకోవడం పాత ఎత్తుగడే. గతంలో విఫలమైనా వదలిపెట్టని టిడిపి అవకాశం దొరికినప్పుడల్లా మత కోణం ప్రస్తావిస్తూనేవస్తున్నది. అమరావతిని అయోధ్య చేస్తామనడం, హిందూమహాసభ నేతలను జెఎసి నేతలుగా పెట్టుకోవడం ఇందులో భాగమే,  అంతర్వేది ఘటన తర్వాత బిజెపిని మించి టిడిపి జనసేన మత పరమైన భాషలో మాట్లాడాయి. హిందూత్వ అన్నది  హిందూమతం కాదని బిజెపి విధానమని కూడా టిడిపి మరిచి పోయి ఆ మాటలనే  మంత్రంలా ఉపయోగిస్తున్నాయి. ఇదొక పోటాపోటీ హిందూత్వంలా  తయారైంది.ఆ పార్టీలకు దీనివల్ల  కలిగే ప్రయోజనం ఎంత అనేది ఒకటైతే మతవిశ్వాసాల  ఆధారంగా రాజకీయాలు  చేస్తే కలిగే అనర్థం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటికే కులచిచ్చు రగుతున్న ఏపిలో మతపరమైన ఉద్రిక్తతలు  పెంచడం అనుమతించరానిది. లౌకికవాద వరవడి గల రాష్ట్ర ప్రజలు బహుశా  ఏ విధమైన మత వ్యూహాలకు లోబడిపోరని ఆశించాలి. ప్రజాసమస్యలపై కేంద్రీకరించి కేంద్రం నుంచి నిధులు, హోదా వంటివి తేవడానికి ప్రయత్నిస్తూనే  సోము వీర్రాజు టీమ్‌ కొంతైనా నిలదొక్కుకోగలుగుతుంది.