తెలకపల్లి రవి : అమరావతి అద్దంలో అయిదేళ్లు! ఎపి రాజధానికి ఎన్నేళ్లు?

తెలకపల్లి రవి : అమరావతి అద్దంలో అయిదేళ్లు! ఎపి రాజధానికి ఎన్నేళ్లు?


    విభజన జరిగి ఆరేళ్లు అయిపోతున్నా మాతృరాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్‌కి  స్పష్టమైన రాజధాని లేకపోవడం ఒక చారిత్రిక వైపరీత్యం. పాలకవర్గ రాజకీయ వ్యూహ ప్రతివ్యూహాలకు  ప్రతిబింభం. జగన్‌ ప్రభుత్వం వికేంద్రీకరణ పేరిట చేపట్టిన విధానం ప్రస్తుతం ఉన్నత న్యాయస్థానం ముందు విచారణలో వుంది. అమరావతినే  కొనసాగించాలంటూ సాగే ఉద్యమానికి 300 రోజు దాటిపోయాయి. ప్రధానిమోడీ శంకుస్థాప‌న‌ చేసి ఐదేళ్లు గడిచిన సందర్బంగా ఈ మొత్తం ప్రహసనాన్ని కళ్లముందు నిలుపుతుంది.

      2014 చివ‌ర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఏర్పాటుచేస్తున్నట్టు ప్రకటించారు. దానికి ముందు తర్వాత  ఆయన అధికారుల‌తో, అస్మదీయులతో తప్ప.. తమ పార్టీ వారితో కూడా సమగ్రంగా చర్చించిన దాఖలాలు లేవు. అమరావతి పేరు, సిఆర్‌డిఎ ఏర్పాటు.. ఆ తర్వాతనే స్విస్‌ ఛాలెంజ్ కూడా కోర్టు ఆదేశాలతో పులుమార్పులకు గురైంది. రైతుల నుంచి పరిహారం లేకుండా పూలింగ్‌ పేరిట 36,000 ఎకరాలు తీసుకోవడం  త్యాగం స్వచ్చందం అంటున్నా  ఒత్తిళ్లు లేవని అనివార్యత సృష్టించబడలేదని చెప్పడానికి లేదు. కౌలుతో సహా  పలు రాయితీలు సాధించుకోవడానికి పెంచుకోవడానికి  ఉద్యమాలు తప్పలేదు. దళితులు, వ్యవసాయ కార్మికులు ప్రత్యేకంగా పోరాడాల్సి వచ్చింది. నిషేదాజ్ఞలు విధించడం, ప్రతిపక్ష నాయకులను నిరోధించడం సర్వసాధారణంగా అమలైంది.  పార్టీలు, ప్రజా సంఘాలు ఎన్నోసార్లు ఇప్పటిలా కరోనా లేకున్నా ఇళ్లలోంచే నిరసను తెల్పినసందర్భాలు కూడా వున్నాయి. జగన్‌ పర్యటన కూడా ఆంక్షల మధ్య నడిచింది. అక్కడ భూములు ముందస్తుగానూ లోపాయికారిగానూ కొనుగోలుచేయడంపై విమర్శులు వస్తే తప్పు లేదని చంద్రబాబు  సభ సాక్షిగా వాదించారు. సింగపూర్‌ పాలకులతో తప్ప ఇక్కడ పార్టీతో ప్రజలతో  ఒక్కసారైనా చర్చ చేయనిచంద్రబాబు.. ఇప్పుడు ప్రజారాజధాని జపం చేస్తుంటారు. నవనగరాలు, ఐకానిక్‌ టవర్స్‌, రివర్‌ ఫ్రంట్‌ హ్యాపీ నెస్ట్‌  ప్రతిదీ రియ్టర్ల భాషలోనే నడిచింది తప్ప ప్రజ కోసం ఫలానాది చేస్తున్నామన్న పాపాన పోలేదు.  ఈ పంచరంగుల‌కు నిధులు ఎలా అన్నది ఎప్పుడూ అంతుబట్టని ప్రశ్న కాగా ఈ భూములనే పెట్టుబడిగా వాడుకోవచ్చని చిట్కాలు చెప్పారు. కారుచౌకగా వాటిని సింగపూర్‌ కంపెనీకి కట్టబెట్టారు. లక్ష కోట్ల వరకూ చెప్పి, చివరకు నిధుల లేక బాండ్లు అమ్మి అప్పు సేకరించడం మొదలెట్టారు. ఆ దశలో ఎన్నికలు వచ్చాయి. విచిత్రమేమంటే ఎన్నికల్లో అమరావతి కీలక అంశంగా లేనేలేదు. నేను నామకరణం చేసినట్టే భ్రమరావతిగా మిగిలిపోయింది.

          ముఖ్యమంత్రి జగన్‌ అంతక్రితం తన పాదయాత్రలో గాని అంతకు ముందు గాని  ప్రచారంలో గాని గెలిచాక గానీ  అమరావతి రాజధానిని మారుస్తానని చెప్పలేదు.. సరికదా కట్టుబడివున్నానన్నారు.  సీనియర్‌ మంత్రి బొత్స వరదను సాకుగా తీసుకుని రాజధాని మార్చే ఆలోచన వున్నట్టు సూచనగా బయిటపెట్టారు. చంద్రబాబు హయాంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను ప్రస్తావిస్తూ చర్చ అటూ ఇటూ తిప్పి మూడు రాజధానుల ముచ్చట బయిటపెట్టారు. మార్చడం అనకుండా  ప్రాంతాలకు న్యాయం పేరిట వికేంద్రీకరణ.. న్యాయ, కార్యనిర్వాహక , శాసన రాజధానులంటూ ఫార్ములా త్రీ తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమరావతిలో ఆందోళన సాగుతున్నది. దానిపై వ్యతిరేకత సందేహాలు బ‌లంగానే వున్నాయి. అన్ని వేల కిలోమీటర్లు నడిచిన ప్రస్తుత  ముఖ్యమంత్రి తన ఇంటిపక్కనే నిరాహారదీక్ష చేసేవారితో ఎందుకు మాట్లాడరు? వారి సమస్య ఎందుకు పరిష్కరించరు? 

        అమరావతి విషయంలో చంద్రబాబు వ్యూహానికి  జగన్‌ కోణానికి కుదరదు. ఆయన తన వారికి కాంట్రాక్టు పనుల అవకాశాలు కట్టబెట్టిన తర్వాత  ప్రస్తుత పాలక  పార్టీకి లాభం లేకపోగా నష్టం. అప్పుడూ ఇప్పుడూ కూడా నిధుల అందుబాటు  శూన్యం. భూములున్నా  వాటిపై చిటికె మీద కోట్లు కురిసేప్రసక్తిలేదు. జగన్‌  ఆడంబరం లేకుండా రాజధాని కడదామనుకుంటే చంద్రబాబు కన్నా వెనకబడిపోయారనే ప్రచారం తప్పక ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వైసీపీ రాజకీయ  ఆర్థిక ప్రయోజనా కోణంలో విశాఖ ఉత్తరాంధ్ర ఒక వైపు.. రాయల‌సీమ మరో వైపు ప్రముఖ స్థానం ఆక్రమిస్తున్నాయి.  విశాఖ.. ఏపీలో ఏకైక పారిశ్రామిక ఆర్థిక నగరం గనక కొద్దిపాటి కార్యాల‌య నిర్మాణాలతో రాజధాని నడిపించుకోవచ్చన్నది జగన్‌ ప్రభుత్వ వ్యూహం.  అంటే అమరావతిలో చంద్రబాబు ప్రారంభించింది.. జగన్‌ విశాఖలో  ప్రయత్నం చేస్తారన్న మాట. ఈ రెంటి మధ్యలో కర్నూలులో హైకోర్టు  న్యాయమే అయినా కంటితుడుపు తప్ప మూడవ రాజధాని మాత్రం కాదు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన నాడు  విజయవాడలో రాజధాని అంటే అడ్డుకుని కర్నూలులో అరకొర రాజధానితో సరిపెట్టిన ఉదాహరణ వుంది. పాలకులకు సంబంధించినంతవరకూ రాజధాని నిర్మాణం రాజకీయార్థికక్రీడ మాత్రమే. ఇంతగా చెల్లాచెదురైన చోట అమరావతి నగరం వస్తుందని వూరించడం. సిఆర్‌డిఎను రద్దు చేసి ఎఎంఆర్‌డిఎ ఏర్పాటు ప్రతిపాదించడం అందుకే. స్థలలా కేటాయింపు పేరిట ఇతర చోట్ల వారిని తీసుకొచ్చి తగాదాలు పెట్టడం , కట్టిన ప్లాట్లను అమ్మే  పథకాలు వేయడం అందులో భాగమే. ఈ 30 వేల ఎకరాల పైబడిన భూమిని వాణిజ్య కోణంలో వాడుకోవాలన్నదే‌ ప్రభుత్వ దృక్పథం. సిబిఐ దర్యాప్తు జరిపించి టీడీపీ పట్టును పెకిలించి వేయాలి. అమరావతి పై  ఏం ఖర్చుపెట్టినా  ఆ ఘనత గత పాలకులకు తప్ప తమకు రాదన్నది వీరి అంచనా. అదిమరో చోట పెడితే.. లేక మరో పథకానికి వెచ్చిస్తే తమ ప్రచారానికి తద్వారా ఓట్లకూ తోడ్పడవచ్చు. ఇప్పటికి వెచ్చించిన ప్రజా ధనం దురుపయోగమైనా సరే.

           ఈ ప్రహసనంలో మూడో కీలక పాత్రధారి ఒక విధంగా సూత్రధారి  బిజెపి. ఎపికి ఢిల్లీని మించిన రాజధాని కట్టిస్తానని వూదరగొట్టిన నరేంద్రమోడీ.. మట్టి తెచ్చి నీళ్లుపోసి అమరాతి శంకుస్థాప‌న చేశారు. నిధులు విదిల్చింది నామమాత్రం. రాజధాని మార్పుతో కేంద్రానికి సంబంధం లేదని మూడు సార్లు అఫిడవిట్లు ఇచ్చారు, కేంద్రం సాయం చేయలేదనే విమర్శ పోవాలంటే రాజధాని మార్చడం రాజమార్గం. అలాంటి మోడీ బొమ్మతో ఈ రోజు  కొందరు ప్రదర్శను చేయడం ఊహకందని విషయం. రాజకీయ అవసరాల రీత్యా బిజెపికి లోబడి వుంటున్న వైసీపీ అధినేత మోడీ వద్దని వారిస్తే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే సాహసం చేయరు. అమరావతి అంగుళంకదలదని చెప్పిన వారెవరూ ఇప్పుడు కనిపించడం లేదు.  అమరావతిలో అప్పుడూ ఇప్పుడూ రైతులు, పేదలు, దళితులు, ఇతర సామాన్యప్రజలున్నారు. అంతేగాని అధికార పార్టీ పదేపదే వారిని పెయిడ్‌ ఆర్టిస్టుల‌ని అవహేళన చేయడం సరికాదు.  అక్కడ విచ్చిన్నమైన జీవితం వుంది. పూర్తయిన ఇళ్లు కూడా వున్నాయి. ఆ  ఇళ్లనూ స్థలాను అవసరమైన వారికి కేటాయించి వాస్తవిక ప్రాతిపదికన రాజధానిని పూర్తి చేస్తే రాష్ట్రం దారిన పడుతుంది.  రాయసీమను అభివృద్ధి. విశాఖ విస్తరణ కూడా ఆ క్రమంలో తప్పక చేయొచ్చు.  అలాగే అమరావతి దుస్తితికి కారణమైన   టిడిపి ఆందోళనలో ముందుంటే  విశ్వసనీయత దక్కదని ఐదేళ్ల నిరసన  సందర్బంలో సిపిఎం నేత మధు అన్నారు. సిపిఐ మాత్రం వారితో కలిసే పాల్గొంటున్నారు. కమ్యూనిస్టు అమరావతి ఆందోళనలో పాలుపంచుకోవడమేమిటని ఈ రోజు బొత్స  వంటివారు అందరిపైనా ఆగ్రహిస్తున్నారు. టీడీపీ దేశం ఇన్‌సైడర్‌ ట్రేడింగుకూ వేలాది మంది సామాన్య రైతులు, వ్యవసాయ కార్మికుల అవేదనకూ సంబంధమేమిటి? వ్యూహాత్మకంగా అక్కడే యాబైవేలమందికి ఇళ్లస్థలాలు ఇస్తామంటూవారితో పోటీ నిరసలను చేయించడం ఉచితమేనా?  ప్రభుత్వం ఒక అఖిలపక్షం జరిపి అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రజాస్వామికంగా అడుగేస్తే  అమరావతికి న్యాయం చేయడం సాధ్యమే.

    ఏది ఏమైనా ఇన్ని మెలికల మధ్య  ఈ ప్రభుత్వ హయాంలోనైనా సంపూర్ణ రాజధాని రూపు దాల్చడం దుర్లభమే. ఎందుకంటే హైకోర్టులో అనేకానేక పిటిషన్లపై విచారణ ముగిసి తీర్పు ఎటువైపు వచ్చినా మరో పక్షం సుప్రీం కోర్టుకు వెళ్లడం అనివార్యం. ఈ ప్రభుత్వ హయాంలోనూ ఏపీకి స్పష్టమైన సంపూర్ణ  రాజధాని ఏర్పడుతుందా అనేది సందేహమే.