తెలకపల్లి రవి విశ్లేషణ : కేంద్రం ఒత్తిడి..ఉచిత విద్యుత్‌ అలజడి..!

తెలకపల్లి రవి విశ్లేషణ  : కేంద్రం ఒత్తిడి..ఉచిత విద్యుత్‌ అలజడి..!

తెలకపల్లి రవి 

                ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించాలన్న జగన్‌ ప్రభుత్వ నిర్ణయం చాలా అలజడికి దారితీస్తున్నది. ఒక్కో రైతు వ్యవసాయానికి ఎంత వాడుతున్నది ఖచ్చితంగా లెక్కగట్టి ఆ సొమ్మును తన ఖాతాకు బదలాయించి  నగదుగా జమచేయాలన్నది ఈ పథకం పరమార్థం. ఎన్టీఆర్‌ శ్లాబ్‌ రేటు పెట్టిన ఫలితంగా 1984లో అదృశ్యమైన  విద్యుత్‌ మీటర్లు జీవో నెం 22 ద్వారా మళ్లీ ప్రవేశిస్తున్నాయి. అప్పటికంటె ఇప్పుడు స్మార్ట్‌గా తయారైన ఈ మీటర్లు వాస్తవంలో ఓవర్‌ స్మార్ట్‌గా ఉచిత  విద్యుత్‌కు ఎసరు పెడతాయనే ఆందోళన అందరిలో వుంది. రైతులపై ఒక్క రూపాయి కూడా భారం మోపబోమని ముప్పై ఏళ్లు  ఉచితాన్ని కొనసాగించే సత్తా వుందని ముఖ్యమంత్రి జగన్‌ ఇతర మంత్రులు  చెబుతున్నా ప్రశ్నలు  మాత్రం అలాగే వున్నాయి. మొదటి అంశమేమంటే  ఇప్పుడు ఈ మీటర్లు ప్రవేశపెట్టడానికి కారణం కేంద్రంలోని మోడీ ప్రభుత్వ షరతు తప్ప రాష్ట్రం ఐచ్చికంగా చేస్తున్నది కాదు. రాష్ట్రాలు ద్రవ్యలోటు పరిమితికి మించి అప్పులు  తెచ్చుకోవడాన్ని అనుమతించాలంటే కేంద్రం నాలుగు  షరతులు పెట్టింది. ఒకే  రేషన్‌, పట్టణ పాక సంస్థ స్వయం సమృద్ధి, స్మార్ట్‌ మీటర్లు, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పెంచడం అనే ఈ షరతులన్నీ ఆచరణలో ప్రజలపై భారం పెంచడానికి ప్రైవేటు కార్పొరేట్ల ప్రయోజనాలకు దారితీసేవే. అత్యధిక రాష్ట్రాల నడక కూడా ఆ వైపే వుంది గనక ఒప్పుకుని  మొదలుపెట్టాయి. దీనికి ముందే కేంద్రం కొత్త విద్యుత్‌ సంస్కరణ పేరిట ముసాయిదా  పంపించింది.అందులో విద్యుత్‌ను ఉత్పత్తి వ్యయం కంటే తక్కువకు ఇవ్వరాదని నిర్దేశించింది. అంతేగాక రాష్ట్ర ప్రభుత్వాల  పాత్ర నామమాత్రం చేసి ప్రైవేటు పెత్తనానికి రంగం సిద్ధం చేస్తున్నది. ఈ ప్రకారం చూస్తే ఆరు రూపాయల పైన యూనిట్‌కు విద్యుత్‌ తయారీ ఖర్చు లెక్కకట్టినప్పుడు రాష్ట్రం రెండు రూపాయల లోపుగానే సబ్సిడీ ఇవ్వడం అనుమతించబడుతుంది. సహజంగానే ఉచితం అని  ఒప్పుకోవడం వుండదు. 
    

స్మార్ట్‌ మీటర్లు ఎందుకంటే ప్రభుత్వం వారికి నగదు బదలాయించి మళ్లీ కట్టించుకోవడం కోసమని చెబుతున్నారు. అయితే ఈ ప్రక్రియ అంత సుభం కాదు. నాలుగు  పత్రాలు  రైతు పేరు, భూ యాజమాన్య పత్రం, ఆధార్‌ కార్డు బ్యాంకు ఖాతా అన్నీ సరిపోలితేనే బిల్లు  చెల్లించడం జరుగుతుంది. అలాగే అనధికారిక పంపుసెట్లను క్రమబద్దీకరించుకోవడానికి చాలా వ్యయ ప్రయాసలు  వడపోతలు  ఎదురవుతాయి. ఇదంతా దేనికంటే ఖచ్చితంగా వ్యవసాయానికే ఈ కరెంటు వాడుతున్నట్టు నిర్ధారించుకోవడానికట. అంటే అసలు  ఉద్దేశమే వడపోత. ఈ క్రమంలో తేడాలు  ఫిర్యాదు విధానపరమైన మార్పు ఎక్కడికి దారితీస్తాయోనన్న ఆందోళన!  వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మొదలైన ఉచిత విద్యుత్‌కు  ఆయన పుట్టిన రోజునే అది కూడా విద్యుదుద్యమ ఇరవయ్యేళ్ల సందర్భంలో సవాళ్లు ఎదురవడం  ఒక విపరీతం. గతానుభవాల  నేపథ్యంలో చూస్తే  హామీలు   ఎన్ని వున్నా  సాధించుకున్న రాయితీల  కోత పడటం, ప్రయోజనాలు  మాయం కావడం ప్రజలకు తెలుసు . దానికి తోడు మరికొన్ని కీలకమైన ప్రశ్నలు ఎపిలో ఉత్పన్నమవుతున్నాయి. జగన్‌ అధికారం చేపట్టగానే పిపిఎ  సమీక్ష అంటూ విద్యుత్‌ వ్యయం తగ్గిస్తానన్నారు. కేంద్రం ఒత్తిడి తర్వాత ఆ జోరు తగ్గింది. సౌర పవన విద్యుత్‌ను చంద్రబాబు ప్రభుత్వం అవసరాన్ని మించి కొన్నట్టు ఆరోపించారు. ఇప్పుడు తామే దాన్ని విస్తరిస్తామంటున్నారు. ఇప్పటి వరకూ ఉచిత విద్యుత్‌కు నాలుగువేల  కోట్లు సబ్సిడీ ఇస్తుంటే ఇప్పుడు దాన్ని ఎనిమిది వేల కోట్లకు పెంచి చూపిస్తున్నారు. పిపిఎ సమీక్షతో ధర తగ్గివుంటే ఈ విధంగా రెట్టింపు వ్యయం ఎందుకు చూపిస్తున్నట్టు? షరతుల  ప్రకారం ఉచితాన్ని కూడా ఎక్కువ ధర లెక్క కడతారా? కేంద్రం చెప్పిన ప్రకారం అప్పు తెచ్చుకోగలిగిన మొత్తం 1500 కోట్లు దాటదు. కాని స్మార్ట్‌ మీటర్లు బిగించడానికే వెయ్యికోట్లు కేటాయించినట్టు  అధికారులు  చెబుతున్నారు. పైగా దీన్ని  అమలు  చేయడానికి పర్యవేక్షించడానికి వివిధ స్థాయిల్లో కమిటీలు  ఏర్పాటు కానున్నాయి. మొత్తంపైన చెప్పాలంటే సజావుగా సాగిపోతున్న  ఉచిత వ్యవసాయ విద్యుత్‌లో అనేక దొంతరు మెలికలు  ఏర్పడుతున్నాయి. దీంతో పాటు ఎస్‌సిఎస్‌టికు దోబీఘాట్‌కు సోన్లకు ఉచితంగానూ రాయితీతోనూ ఇస్తున్న విద్యుత్‌కు విఘాతం ఏర్పడనుంది. ఇవన్నీ మే 17న కేంద్రం రాసిన లేఖలోని షరతుల  ప్రభావమని రాష్ట్ర  ప్రభుత్వం  స్పష్టంగా చెబుతున్నది. అలాంటప్పుడు రేపు ఆ షరతులు  మరెంత బిగుసుకుంటాయో మరెన్ని కొత్త ఆంక్షలు చేరతాయో ఎవరు చెప్పగలరు? ముఖ్యమంత్రి రూపాయి భారం పడబోదని చెప్పినా మరో మంత్రి అలా జరిగితే రాజీనామా చేస్తానన్నా ఆచరణలో ఆపేదేముంటుంది? అందులోనూ దేశంలోనే మొదటగా ఎపి ఈ ప్రక్రియలో ఎందుకు ఉత్సాహం చూపిస్తున్నది? రాజకీయంగా కొత్త విద్యుత్‌ విధానాన్ని వ్యతిరేకించిన తెలంగాణ కూడా స్మార్ట్‌ మీటర్లను తెప్పిస్తున్న మాట నిజం. రాష్ట్రాలపై   కేంద్రం ఒత్తిడి క్షేత్రస్థాయిలో రైతు అలజడికి కారణమవుతున్నది.  సందేహాస్పద విధానాలను విడనాడటం తప్ప గంభీర వాక్కుతో విశ్వాసం కలిగించడం కష్టం.