తెలకపల్లి రవి: విశాఖ ఉక్కుపై నాలుగు వైఖరులు, ఉమ్మడి పోరాట పథం

తెలకపల్లి రవి: విశాఖ ఉక్కుపై నాలుగు వైఖరులు, ఉమ్మడి పోరాట పథం

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకంగా మారిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటాన్ని అందరూ బపరుస్తున్నట్టు కనిపిస్తున్నా మూడు విభిన్న ధోరణులు స్పష్టమవుతున్నాయి. ఈ వారంలో మొదట మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తర్వాతరోజు ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ విశాఖ సందర్శించిన సమయంలో ఈ తేడాలు ప్రస్పుటమైనాయి. మొదటి నుంచి ఉక్కు రక్షణకై పోరాడుతున్న వామపక్షాల నేతలైన బీవీ రాఘవులు, పి.మధు, రామకృష్ణ తదితరులు గానీ, గుర్తింపు యూనియన్‌కు నాయకత్వం వహిస్తున్న సిఐటియూ నేతలు సీహెచ్‌ నరసింహారావు, జె. అయోధ్యరాం. ఎఐటియుసి నాయకుడు ఆదినారాయణ తదితరులు బలంగా చెబుతున్న ఉద్యమ పంథా ఆచరణలో కనిపిస్తూనే వుంది.

విశాఖ ఉక్కు ఆంధ్రు హక్కు అన్నది మొదటి నినాదమే గాని తర్వాత ఉక్కు  ఫ్యాక్టరీ సాధన, స్థాపన ఉత్పత్తి, ఆధునీకరణ, నిర్వాసితల సమస్యలు, పునరావాసం ప్రతిదాని వెనక సుదీర్ఘమైన పోరాట చరిత్ర వుంది. దేశంలో ఇతర ప్రభుత్వ ఉక్కు ఫ్యాక్టరీలతో పోలిస్తే విశాఖకు పెట్టుబడుల్లోనూ గను కేటాయింపులోనూ వివక్ష అందరి కళ్లముందే జరిగింది. కార్మిక సంఘాలు, కమ్యూనిస్టులు వెంటపడితే తప్ప ఈ విషయంలో ప్రధాన పాలక పార్టీలు చొరవ తీసుకున్నది లేదు. ప్రతినిధిలు వర్గాలుగా వెళ్లిన సమయంలో కలసి రావడం, ప్రదర్శనగా వెళ్లినపుడు సభలోప్రస్తావించడం వంటివి మాత్రమే జరిగాయి. ఎందుకంటే ఈ పార్టీల అన్నింటి ఆర్థిక విధానాల్లో నమూనాలోపెద్ద తేడా లేదు. విశాఖ ఉక్కు ఒక రూపం తీసుకోవడం దేశంలో సరళీకరణ విధానాలు మొదలవడం ఒకేసారి జరిగింది. వాస్తవానికి వాటికి ఆద్యుడైన అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు ఈ ఫ్యాక్టరీ ప్రధాన ఘట్టాన్నిప్రారంభించడం యాదృచ్చికం కాదు. తర్వాత దశల వారిగా జరిగిన ఉద్యమాలు, ధర్నాలు నిరసనలకు లెక్కేలేదు, కానీ, ఎప్పుడూ మన పాలక పార్టీ రాజకీయాల్లో అవి ప్రధాన స్థానం ఆక్రమించలేదు. ఎన్‌డిఎ, యుపిఎ1 హయాంలో కొన్ని పరిష్కారాలు జరిగినా అంతకు అనేక రెట్లు వేగంతో ప్రైవేటీకరణ, అమ్మకం వంటి ప్రతిపాదనలు వస్తూనే వున్నాయి తప్ప సద్దుమణిగింది లేదు. 2014లో నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత కంపెనీ అంతర్గత కమిటీ విశాఖ ఉక్కు ప్లాంటుకు రు.4890 కోట్లు అంచనా కట్టింది. వాస్తవానికి 22 వేల ఎకరా భూముతో కలసి దాని విలువ రెండున్నర లక్ష కోట్లకు పైనే వుంటుంది. అప్పుడే దక్షిణ కొరియా ఉక్కు దిగ్గజం పోస్కో రంగ ప్రవేశం, 2018లో పర్యటించడం, 1700 ఎకరాల భూమి వారికి కేటాయించి అధునాతన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంకై 2019లో అవగాహనా ఒప్పందం ఎంవోయు కుదిరాయి. ఆ సమయంలో వారు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు కూడా.. ఇక, దేశంలో రాష్ట్రంలో భిన్నపార్టీలు అధికారం చేస్తున్నా ప్రైవేటీకరణ దిశలో అడుగు ఆగింది లేదు.
 ఇప్పుడు  ప్రస్తుతానికి వస్తే 2019లో నరేంద్ర మోడీ రెండవ సారి విజయం సాధించాక ప్రైవేటీకరణ జ్వరం బాగా పెరిగింది. నిర్మలా సీతారామన్‌ తాజా బడ్జెట్‌లో ఆ ప్రతిపాదనలు లెక్కకు మించినట్టుగా వున్నాయి. సంస్థలు మాత్రమే గాక కేంద్రం అధీనంలోని భూములను కూడా విలువ కట్టి అస్మదీయులకు కట్టబెట్టే ఆర్థిక నీతి అమవుతున్నది. ఈ వేటు విశాఖ ఉక్కుపైనా పడింది. వందశాతం ప్రైవేటీకరణ జాబితాలో చేరింది. ఈ వార్త వచ్చాక కార్మిక సంఘాలు పోరాటం ఉధృతంచేశాయి. 

విశాఖ ఉక్కు విషయమై పార్టీ ఒక విధానం తీసుకుంటుందనీ, అప్పటివరకూ ఎవరూ మాట్లాడవద్దని వైసీపీ, జగన్‌ ప్రభుత్వ పెద్దలు చెప్పారు. చివరకు ముఖ్యమంత్రి  ప్రత్యామ్నాయంగా కొన్ని ప్రతిపాదనలతో లేఖ రాశారు. అందులో నష్టా ముద్ర తప్పని గాని, అంత పెద్ద సంస్థ కోల్పోతే రాష్ట్రానికి కలిగే నష్టం వంటివిప్రస్తావించలేదు. ప్రత్యేకంగా గనులు కేటాయించడం, బ్యాంకు రుణాలను వాటాలుగా మార్చడం , పబ్లిక్‌ ఇష్యూకు వెళ్లడం వంటిసూచనలు చేశారు. వెయ్యి ఎకరాల భూమిని అమ్మి ఆ మొత్తం అప్పులకు కట్టొచ్చని కూడా విశాఖ పర్యటన సమయంలో కలిసిన కార్మిక నాయకులకు సూచించారు. అంతేగాక ఉద్యమాలు, ఆందోళలు వద్దని పరోక్షంగా సూచించారు. ఇంతకూ కారణమైన బిజెపి రాష్ట్ర నేతలు కూడా ఉక్కు రక్షణ కోసం పోరాడుతున్నారని అభినందించారు. పోస్కో ప్రతినిధులు తనను కలిసిన మాట నిజమే గాని వారికి విశాఖ ఉక్కుపై ఆసక్తి లేదని బాపనపాడు, కడప, కృష్ణపట్నం వంటి విషయాలు మాట్లాడారని తెలిపారు. తను చొరవ తీసుకుంటే  భేషజాలు వదలిపెట్టి కలిసి నడుస్తామని చంద్రబాబు నాయుడు ముందు రోజు చేసిన వ్యాఖ్యలపై స్పందించలేదు. రాజీనామా వంటి సూచనలు అసలే తీసుకోలేదు. అయితే ఆ పార్టీ ఎంపి విజయసాయి రెడ్డి, మంత్రి ముత్తంశెట్లి శ్రీనివాస్‌ వంటివారు గాని ప్రజా ప్రతినిధులు గాని ఆందోళనకు సంఫీుభావం తము కూడా స్వంతంగా చేయడానికి  పాదయాత్రలు వంటివి చేస్తున్నారు.


తెలుగుదేశం నాయకుడు పల్లాశ్రీనివాస్‌ ఆరురోజు నిరాహారదీక్ష తర్వాత ఆస్పత్రిలో చేర్చబడ్డారు. ఆయనను పరామర్శించేందుకు వచ్చిన చంద్రబాబు తమ పార్టీ సభలో మొత్తం దాడి జగన్‌, విజయసాయి రెడ్డిపై కేంద్రీకరించారు. అయితే, కార్మికుల శిబిరాన్ని సందర్శించినపుడు మాత్రం ఐక్యపోరాటం తాము కలిసిరావడానికి సిద్ధమని ప్రకటించారు. మొత్తంపైన ఆయన ప్రసంగంలో మోడీ కేంద్రం వంటి మాటలే రాలేదు, ఆ పార్టీ నాయకులు కూడా ఇదంతా జగన్‌ ప్రభుత్వ కుట్ర అనేది ప్రధానంగా తీసుకొస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు  ప్రైవేటీకరణపై చాలా పేలవంగా బలహీనంగా స్పందిస్తున్నారు. ఇది దేశమంతటా వున్న విధానమని, ఫ్యాక్టరీ ఎక్కడకీ పోదనేది వారి ప్రధాన సమర్థన. కేంద్ర నాయకులకు వినతలు సమర్పించడంతో ఆగిపోతున్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ కూడా ఒకసారి ఢిల్లీ వెళ్లి హోం మంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేసి సరిపెట్టారు.

ఇవే గాక ఇంకా ఇతర పార్టీలు కూడా ఉక్కు ఫ్యాక్టరీ వ్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నా ఉద్యమంలో కలసి వస్తున్నా వాస్తవంగా వారి వారి ధోరణులు ఇలా వున్నాయి. వామపక్షాలు, కార్మిక సంఘాలు మాత్రం ఉద్యమం ఉధృతం చేయవసిందేనని, ముఖ్యమంత్రి చెప్పిన ఈక్విటీ, భూముల అమ్మకం వంటి సూచనలు కూడా సరికాదని తోసిపుచ్చుతున్నాయి. రాష్ట్రంలో పెద్దపార్టీలైన వైసీపీ, టీడీపీ తమ తమ వ్యూహాలను పక్కనపెట్టి ప్రజా ఉద్యమాన్ని బలపర్చాలని కోరుతున్నాయి. రాష్ట్ర వ్యాపితంగా సాగుతున్న ఈ పోరాటం.. భవిష్యత్‌ రాజకీయాలను చాలా ప్రభావితం చేస్తుంది. విశాఖ పాలక రాజధాని వంటి నిర్ణయాలు, మునిసిపల్‌ ఎన్నికల నేపథ్యం ఇందుకు తోడవుతుంది. రాష్ట్రం కోసం విశాఖ ఉక్కు రక్షణ కోసం సమిష్టిగా పోరాడాన్నది ఏపీలో ప్రజందరి ఆకాంక్షగా వుంది.