తెలకపల్లి రవి: రామతీర్థంలో సమరభేరి, విశాఖ ఉక్కుపై సన్నాయినొక్కులు!

 తెలకపల్లి రవి: రామతీర్థంలో సమరభేరి, విశాఖ ఉక్కుపై సన్నాయినొక్కులు!

ఆంధ్రప్రదేశ్‌లో  ప్రధాన పార్టీలైన వైసీపీ, టిడిపి, కేంద్రంలో పాలిస్తున్న బిజెపి నాయకులు ప్రతి విషయాన్ని తమ ప్రయోజనాల కోణం నుంచి మాత్రమే చూస్తున్నారనడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ ఆందోళన తాజా ఉదాహరణ. ఉక్కు ఫ్యాక్టరీలో గుర్తింపు యూనియన్‌గా వున్న సిఐటియు, వామపక్షాల నాయకులు ఈ వార్త వచ్చిన నాటి నుంచి తీవ్రస్థాయిలో అందరినీ కలుపుకొని పోరాడేప్రయత్నం చేస్తున్నారు. పోస్కోతో కేంద్రం ఒప్పందంపైనా వారు గతం నుంచి పోరాడుతూనే వున్నారు. ఈ సమయంలోనూ వాటన్నింటినీ గుర్తు చేయడమే గాక రోజూ ర్యాలీలు. దీక్షలూ సాగిస్తున్నారు. వైసీపీ నేతలు పార్టీగా ఒక వైఖరి తీసుకుంటామని ప్రకటించిన తర్వాత ముఖ్యమంత్రి జగన్‌ ప్రధానికి లేఖ రాశారు. అందులోనూ విశాఖ ఉక్కు వాటా అమ్మకం, రుణాలు బ్యాంకుకు బదలాయించడం వంటి ప్రత్యామ్నాయాలు ఆలోచించాలని సూచించారే గానీ.. నిక్కచ్చిగా నిలిపేయానే వైఖరి తీసుకోలేదు. ఆ పార్టీ ఎంపి విజయసాయి రెడ్డి వంటివారు విశాఖ దీక్షా శిబిరాన్ని సందర్శించినప్పుడు సంఘాల నుంచి నిరసన వస్తే మా ప్రయత్నం మేము చేస్తామన్నట్టు మాట్లాడారు. మరోవైపున టిడిపి విషయానికి వస్తే విశాఖ ఉక్కు అమ్మకం నిర్ణయంపై పోరాటం కన్నా ఇదంతా జగన్‌ సారథ్యంలో జరిగిందనే ప్రచారం ప్రధానంగా చేపట్టారు. ఈ మాట మొదట్లోనే పోస్కో ప్రతినిధి వర్గం 2019 అక్టోబరులో  అవగాహనా ఒప్పందం కుదిరాక ముఖ్యమంత్రిని కలిసిన సంగతి నేను ముందే ప్రస్తావించాను. దానికి కొంత ట్విస్ట్‌ ఇచ్చి వైరల్‌ చేశారు కూడా. 2018లో చంద్రబాబు పాలిస్తున్న సమయంలోనూ పాస్కో బృందం సందర్శన ప్రాథమిక చర్చ గురించి కూడా నేను చెప్పాను. ఆ మాటకొస్తే  వీరితో పాటు కాంగ్రెస్‌, బిజెపి కూడా మౌలికంగా ప్రైవేటీకరణ విధానాన్ని బలపర్చేవే. 2009-14 మధ్య చంద్రబాబు 54 ప్రభుత్వ సంస్థను అమ్మివేశారని వైసీపీ విమర్శిస్తుంటుంది.. గానీ, దాని విధానం కూడా అందుకు భిన్నం కాదు. అయితే విశాఖ ఉక్కు వంటి ప్రాణ ప్రదమైన సమస్యలలోనూ ఈ పార్టీలు పరస్పరం తిట్టుకుంటూ.. కేంద్ర బిజెపిని, మోడీ సర్కారును మోయడమే బాధాకరమైన వాస్తవం. 

కార్మిక సంఘాలు, వామపక్షాల ఉమ్మడి ఉద్యమంలో ఇప్పటివరకూ వీరు పాల్గొనడం లేదు. వైసీపీనాయకుల సంఫీుభావాలు, ప్రకటనలతో సరిపెడుతున్నారు. ఆ పైన టిడిపి కోణంలోవిమర్శలు సంధిస్తున్నారు. సవాళ్లు చేస్తున్నారు. ఇక విడిగా సాగుతున్న టిడిపి నాయకుడు పల్లా శ్రీనివాస్‌ నిరవధిక నిరాహారదీక్ష ఆరో రోజుకు చేరింది. ఆయన తర్వాత తను కూచుంటానని మాజీ ఎంపి సబ్బం హరి ప్రకటించారు. ఇది ఏ మేరకు జరుగుతుందనేది ఒకటైతే ఈ లోగా టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు తమ పదవులకు రాజీనామాకు సిద్దమని అయితే పాలక పార్టీగా వైసీపీ చొరవ తీసుకోవాని ప్రతిపాదించారు. ఎప్పటిలాగే  ఈ ప్రైవేటీకరణ నిర్ణయానికి జగన్‌ బాధ్యుడని తమ నాయకుడు చంద్రబాబు ముందు బచ్చా అని అపహాస్యం చేశారు. ఇంతకూ ఉమ్మడి ఉద్యమం చేసే ఆలోచన మాత్రం ఈ ఉభయ పార్టీల నేతలకూ లేదని తేలిపోయింది. ఈ లోగా బిజెపి నాయకుడు సోము వీర్రాజు సంబంధిత కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలిసి విశాఖ సెంటిమెంటును వివరించినట్టు ఢిల్లీలో మీడియాకు చెప్పారు. ఆయనవి కూడా పైపై మాటల్గాగే వున్నాయి గాని ఏ హామీని ఇచ్చేవిగా లేవు. కొద్ది రోజు కిందట వారి మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ కూడా హోంమంత్రి అమిత్‌షాను కలిసి విశాఖ ఉక్కుపైనే విజ్ఞప్తి చేశారు. నిర్ణయం తీసుకోవలసింది కేంద్రమేనని తేల్చేశారు. మొత్తంపైన నాలుగు పార్టీల నాయకులు సమరశీల పోరాటం గురించి గాని సమైక్య ఒత్తిడి గురించి గాని మాట్లాడిన పాపాన పోలేదు.

సీన్‌ కట్‌ చేస్తే ఇప్పుడు కొద్ది మాసాల కిందట రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనకు వెళదాం. వార్త బయిటకురాగానే చంద్రబాబు నాయుడుతో సహా టిడిపినేతలు ఆఘమేఘాల మీద బయల్దేరారు. ఆవెనకే విజయసాయి రెడ్డి కూడా పర్యటన పెట్టుకున్నారు. ఈ ఉభయ పార్టీలు పోటాపోటీ యాత్రల మధ్య పోలీసులు అల్లాడిపోయారు. ఆ సమయంలో విజయసాయి కారును చుట్టుముట్టడంపై కేసు కూడా పెట్టారు. ఇలాంటి విషయాల్లో ముందుండే బిజెపిని కూడా మించి చంద్రబాబు మాట్లాడితే పవన్‌ కళ్యాణ్‌ కూడా గొంతు కలిపారు. సోము వీర్రాజు మరో రోజు వెళితే పోలీసులు ఆపారని ఆగ్రహోదగ్రులైనారు. పునరుద్ధరణ కోసం ప్రభుత్వం నిధిని విడుదల చేసింది. ఈ మతపరమైన సెంటిమెంటును సంతృప్తి పర్చడం కోసం ముఖ్యమంత్రి జగన్‌ గోసేవకు బయల్దేరారు. దాదాపు నెలన్నర పాటు రాష్ట్ర రాజకీయాలు దాని చుట్టే తిరిగాయి. ఇప్పటికి అది వివాదంగానే వుంది. దేవుడు విశ్వాసాలు ఎవరూ కాదనరు.. గాని ఆంధ్రప్రదేశ్‌ నేపథ్యంలో చారిత్రికంగా చూసినా, పారిశ్రామికీకరణ ఉపాధి కోణంలో చూసినా ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం ప్రాణప్రదమైంది. ఒకసారి పోస్కోకో మరొకరికో అప్పగించిన తర్వాత ప్రైవేటు పెత్తనం తప్ప ప్రజకు మిగిలేది శూన్యమే. ప్రత్యేక హోదా, లోటు భర్తీ విషయంలో అన్యాయం, తత్ఫలితంగా అప్పుల వలయం, అమరావతిపై ప్రతిష్టంభన చాలక విశాఖ ఉక్కును లాగేసుకోవడం దారుణమన్న సృహ ఈ ప్రధాన పార్టీలలో లేకపోవడమే బాధాకరం. మత విశ్వాసాలపై వివాదం పెట్టడంలో వున్న ఆసక్తి మనుగడ నిలిపేవిశాఖ ఉక్కు రక్షణంలోకనిపించకపోవడం శాశ్వతనష్టకారణం అవుతుంది. మంగళవారం నాడు చంద్రబాబు నిరాహారదీక్ష సందర్శనకు వెళుతున్నా ఆ పార్టీ వైఖరిలో ఇంతకన్నా మార్పు వచ్చే అవకాశం వుండదు. అధికార పార్టీగా వైసీపీ ఈలోగానే మరిన్నిచర్యలకు దిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. గంటా శ్రీనివాసరావు ఒకటికి రెండు సార్లు రాజీనామా చేయడం ఈ కథలో కొసమెరుపు.