తెలకపల్లి రవి : ఎన్డీయేలో వైసీపీ చేరిక, కుదరని సమీకరణాల సూచిక

 తెలకపల్లి రవి : ఎన్డీయేలో వైసీపీ చేరిక, కుదరని సమీకరణాల సూచిక

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కాక ముందు నుంచి ఎన్‌డిఎలో వైసీపీ చేరుతుందనే కథనాలు జోరుగా నడిచాయి. వాస్తవంలో జగన్‌ ఢీల్లీ పర్యటన పెట్టుకున్నప్పుడల్లా ముందస్తు కథనాలు ఎక్కువ గానే నడవడం పరిపాటి అయింది. గతసారి హొం మంత్రి అమిత్‌ షా ను కలసుకున్నప్పుడు కోర్టుతో వివాదం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారని అదేపనిగా ప్రచారమైంది. ఏపిలో బిజెపి టిడిపి లు ఆయా సమస్యలపై తీవ్రంగా దాడి చేస్తున్న సమయమది. తిరుమల డిక్లరేషన్ రభస మరింత తీవ్రంగా నడిచింది.

అయితే అదే సాయింత్రం తిరుపతి నుంచి ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్న జగన్‌ తో స్వయంగా ప్రధాని అభినందన పూర్వకంగా మాట్లాడ్డం ద్వారా వాటికి సమాధానమిచ్చారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్న వైసీపీతో సత్సంబంధాలు కేంద్రంలో ముఖ్యంగా రాజ్యసభలో మోడీ సర్కారుకు చాలా అవసరం. శాసనసభ ఎన్నిక తర్వాత మహారాష్ట్రలో శివసేన దూరం కాగా ఇటీవల రైతు వ్యతిరేక బిల్లుపై అకాలీదళ్‌ ఎన్‌డిఎ నుంచి నిష్క్రమించింది. ఈ కారణంగానే వైసీపీని చేర్చుకోవాని మోడీ భావిస్తున్నారనేది ఈ వూహాగానాలకు మూలం.

ఈ వూహలకు వైసీపీ బిజెపి కూడా తమ తమ కోణాలలో దోహదం చేశాయి. భాగస్వాములు కొందరు వెళ్లిపోయినా తమకు మద్దతు బాగానే వుందని చెప్పడం బిజెపి అవసరం అయితే రాష్ట్రంలో టిడిపి బిజెపి జనసేన ఎంతగా తిట్టిపోసినా కేంద్రంలో మోడీ ఆశీస్సులు తమకు వున్నాయని చెప్పుకోవడం వైసీపీ అవసరం. వాస్తవంలో ఈ మూడు పార్టీలు బిజెపికి అనుకూలంగా వుండటం ఏపి రాజకీయాలలో అతి పెద్ద చిక్కుముడి మాత్రమే గాక ప్రత్యేక హోదా, నిధులు విభజన హామీ అమలపై పోరాటానికి పెద్ద ఆటంకంగా వుంది. తమలో తాము పోట్లాడుకోవడమే గాని కేంద్రంపై ఒత్తిడి తేగల సత్తా గాని దృష్టిగాని లేని పరిస్థితి.

ప్రమాణ స్వీకారానికి ముందే జగన్‌ ఆ విషయం తేల్చి చెప్పేశారు. ఇంతవరకూ ఒక్క సిఎఎ వ్యతిరేక తీర్మానం మినహా మరే విషయంలోనూ కేంద్రాన్ని విమర్శ చేసింది లేదు. విజయసాయి రెడ్డి వంటి వారు మరీ అత్యుత్సాహంగా బిజెపి సర్కారును కొనియాడుతుంటారు. జిఎస్‌టి లోటు వంటి విషయాలలో నేరుగా జగన్‌ మద్దతు పలికారు. 2019 ఎన్నికల ముందు ఏడాది ఎన్‌డిఎ నుంచి వైదొలిగి ధర్మయుద్దం పేరిట హడావుడి చేసిన టిడిపి ఎంత పాకులాడినా మోడీ దగ్గరకు చేరనివ్వక పోవడానికి కారణం జగన్‌ మద్దతు వుండటమే. ఈ నేపథ్యంలో కరోనా తర్వాత మొదటి సారి ముఖ్యమంత్రి ప్రధానిని కలసుకోవడం, వివరంగా చర్చలు జరపడం అమిత ప్రచారం పొందింది.

 రెండు తెలుగు రాష్ట్రాలకూ కీలకమైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం కంటే జగన్‌ భేటీనే ఎక్కువ ఫోకస్‌ లోకి వచ్చిందంటే పైన చెప్పిన వూహాగానాలే కారణం, నిన్నటి నుంచి తెలుగు మీడియానే గాక జాతీయ మీడియా కూడా ఇదే చర్చ జరిపింది. నన్ను ఇంగ్లీషు పత్రిక ప్రతినిధులు ఇదే విషయమై ప్రశ్నించినపుడు ఎన్‌డిఎలో చేరడం వంటిది ఇప్పుడు జరగదని చెప్పాను. కారణం బిజెపి హిందూత్వ రాజకీయాలు, జగన్‌ హయాంలో ఏపి క్రైస్తవ రాజ్యంగా మారిపోతున్నదని వారు వేసిన ముద్ర. అంతర్వేది రథం దగ్ధం తర్వాత ఇది పరాకాష్టకు చేరింది. జగన్‌ ఓటర్ల పునాదిపైనా ఈ చేరిక ప్రభావం చూపిస్తుంది.చంద్రబాబును దెబ్బతీసేందుకు మోడీతో నేరుగా కలిస్తే మతభావనను కూడా కాదని వారు ఆమోదించవచ్చు.

కాని తప్పనిసరిగా ప్రభావం వుండకుండా పోదు. పైగా ఒక్క సీటు లేని పెద్ద ప్రజా పునాది లేని బిజెపితో చేరడం వల్ల వైసీపీకి అదనంగా ఒరిగేది వుండదు. ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా కేసుల కోసం లోబడిపోయారని ఇప్పటికే వున్న ప్రచారం ఇంకా తీవ్రం కావడం ప్రత్యర్థులకే మేలు చేస్తుంది. ఇక బిజెపి కోణంలో చూస్తే ఎన్‌డిఎ యేతర పార్టీ ప్రభుత్వాలు మద్దతు వుందని చెప్పుకోవడానికి బయిట నుంచి ఎలాగూ వైసీపీ మద్దతు లభిస్తూ వుంది. ఏపిలో ప్రయోజనం కోసం కలిస్తే జాతీయంగా తమ హిందూత్వ ఇమేజికి దెబ్బ తగలొచ్చు.

కనుకనే రోగి కోరింది వైద్యుడు ఇచ్చింది ఒకటే అన్నట్టు ఉభయులు స్నేహ గీతాలు పాడుతూనే విడివిడిగా ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఇష్టపడతారు. కేంద్రంలో చేరడం మంత్రి పదవులు తీసుకోవడం వంటి వూహగానాలు గత ఏడాది కూడా నడిచాయి. ఆ ఆశ, ఆసక్తి వున్నవారు వాటిని వదులుతూ ఉండవచ్చు. కాని ఇప్పటి రాజకీయ పరిస్థితిలో మోడీ ఎలాంటి ప్రయోగం చేసే అవకాశం లేదని చెప్పాలి. అప్పులు పాలైన ప్రభుత్వ నేతగా కేంద్రం సాయం కోసం జగన్‌ ఎన్‌డిఎలో చేరతారన్న వూహలు అన్నిటికన్నా బలహీనమైందని చెప్పడానికి టిడిపి ఉదాహరణ వుండనే వుంది. రాజధాని మార్పు, న్యాయవివాదాలలో తలమునకవుతున్న జగన్‌ను కలుసుకోవడం ద్వారా ప్రధాని మొన్నటి అభినందన సంకేతాన్ని ఈ భేటీతో ఇంకా గట్టిపరిచారన్నమాట. రేపు ఏమి జరిగినా ఈ రోజుకు అది ఉపయోగం. ఇక దీర్ఘకాలంలో ఏమి జరుగుతుంది ఏది జరగబోదు అని అతిగా జోస్యాలు చెప్పడం బొత్తిగా అనవసరం. చేరినా చేరకున్నా ఈ విషయంలో అన్ని అవకాశాలు తెరిచే వుంచాలని ఉభయ నేతలు భావిస్తున్నారన్నది స్పష్టం.