బీజేపీ పై టీఆర్ఎస్ రాజకీయ భేరి :తెలకపల్లి రవి విశ్లేషణ      

బీజేపీ పై టీఆర్ఎస్ రాజకీయ భేరి :తెలకపల్లి రవి విశ్లేషణ      

తెలంగాణ ముఖ్యమంత్రి  కె,చంద్రశేఖర రావు ఆయన ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ పార్టీ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతోనూ రాష్ట్రంలో బిజెపితోనూ ముఖాముఖి పోరాటం ప్రారంభించడం ఒక రాజకీయ మలుపు. గతంలో నోట్ల రద్దు,జిఎస్‌టి వంటి విషయాల్లో కెసిఆర్‌ ప్రధాని మోడిని ఎంతగానో  కొనియాడడమే గాక ముందుగా వెళ్లి అభినందించి వచ్చారు కూడా. మెట్రో రైలు, మిషన్‌ భగీరథ వంటి పథకాలకు ఆయనను  ఆహ్వానిస్తే ప్రధాని పాల్గొనడమే గాక నాలుగు మంచి మాటలు చెప్పడం స్థానిక బిజెపి నేతలకు ఇబ్బందిగా కూడా మారిన రోజులున్నాయి.

అప్పటి అద్యక్షుడు అమిత్‌ షా మీరు టిఆర్‌ఎస్‌పై గట్టిగా పోరాడండి అని చెబుతున్నా కేంద్ర మంత్రులు  నేతలు  ఆ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటుంటే బిజెపి రాష్ట్ర నాయకులు  సమర్తించుకోలేని స్థితిలో పడిపోయిన దశ కూడా వుంది. ఇప్పుడు అదంతా గతమే. ప్రస్తుత రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్‌ అనునిత్యం కెసిఆర్‌ ప్రభుత్వంపై ధ్వజమెత్తడమే గాక హిందూత్వ వ్యూహాల తో మత భాషలోనూ మాట్లాడుతున్నారు.

ఇక కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అవకాశం దొరికితే రాష్ట్ర ప్రభత్వం తప్పు చేసిందని దండకం చదువుతున్నారు. ఇవన్నీ మారిన రాజకీయ వాస్తవాలకు అద్దం పడుతున్నాయి. జిఎస్‌టి లోటు భర్తీ, విద్యుత్‌  రంగంలో నూతన సంస్కరణలు , వ్యవసాయ బిల్లు  విషయంలో కేంద్ర విధానాలను విమర్శించడంతో ఆగక టిఆర్‌ఎస్‌ పార్లమెంటులోనూ వ్యతిరేకించింది. రాజ్యసభ ఉపాద్యక్షుడుగా గతంలో బలపర్చిన హరివంశ్‌కు ఈసారి వోటేయకుండా ఓటింగునుంచి దూరంగా వుండిపోయింది. 

 ముఖ్యమంత్రి కెసిఆర్‌ గత ఎన్నికల  ప్రచారంలోనే బిజెపి మత రాజకీయాలను మోడీ వ్యక్తిగత శైలిని కొద్దిగా ప్రస్తావించారు. అయితే పార్లమెంటు ఎన్నికల  నాటికి ఆయన తెచ్చిన  ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన పరోక్షంగా బిజెపికే మేలు  చేస్తుందని కూడా అభిప్రాయం వచ్చింది. ఇంతా చేసి లోక్‌సభ ఎన్నికల  నాటికి ఆ ఫ్రంట్‌ పెద్ద ప్రభావం చూపింది లేదు. దానికి తోడు తెలంగాణలో బిజెపి నాలుగు లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడం కిషన్‌ రెడ్డి మంత్రి కావడంతో రాజకీయ ఉనికి పెరిగింది.  నిజామాబాద్‌,  కరీంనగర్‌  రాజకీయంగా మరింత ఇబ్బందికరంగా మారాయి.

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బిజెపి సహకరించుకున్నాయనే ఆరోపణ కూడా వుంది. రెండవసారి గెలిచాక  మోడీ ప్రభుత్వ కేంద్రీకృత ఆధిపత్యధోరణులు పెరగడం, కరోనా నివారణ వ్యూహాలలోనూ ఆర్థిక సాయంలోనూ  ముందుకు రాకపోవడం కెసిఆర్‌లో అసంతృప్తిని పెంచింది.మొదటి దశలో కెసిఆర్ ‌ కరోనాను ఎదుర్కోవడం కోసం ప్రధాని మోడీని బలపరుస్తూనే వచ్చారు. అయితే లాక్‌డౌన్‌ నిర్ణయాల లో ఏకపక్ష పోకడలు , 20 లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ రాష్ట్రాల కు శూన్యహస్తం చూపడం పట్ల గట్టి వ్యతిరేకత ప్రకటించారు.

ఆ ప్యాకేజీ బూటకమని కుండబద్దలు కొట్టి చెప్పారు. అదే అదనుగా రాష్ట్ర బిజెపి నాయకులు  దాడి తీవ్రం చేశారు. ఆర్థిక సంక్షోభం పెరిగే కొద్ది కేంద్రం నిర్ణయాలు  కూడా అభ్యంతరకరంగా తయారవడంతో కెసిఆర్‌ ప్రభుత్వం ఫెడరల్‌ సూత్రాలను కాపాడుకోవాలనే వైఖరి తీసుకుంది.మాది  ప్రజలచే ఎన్నికైన రాజ్యాంగ బద్ద ప్రభుత్వం మాకూ హక్కుంటాయని ముఖ్యమంత్రి పలు సార్లు స్పష్టంగా ప్రకటించారు.

దీనికి సమాంతరంగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వ్యక్తిగత దూషణకు పాల్పడటం , తెలంగాణ ముస్లిం రాష్ట్రంగా మారిపోయిందని ఆరోపించడం, వున్న ఒకే ఒక ఎంఎల్‌ఎ రాజాసింగ్‌ మత విద్వేష భాష వీటిపై టిఆర్‌ఎస్‌ రాజకీయపోరాటం  ఒక అనివార్యతగా మారింది. అయితే బిజెపి మత రాజకీయాలతో పోరాడుతున్నా కెసిఆర్‌ నాకన్నా మీరు ఎక్కువ ఆచారాలు  పాటిస్తారా అన్న చందంగా మాట్లాడుతుంటారు. కెసిఆర్‌ వుండగా  ఆరెస్సెస్‌  తరహా హిందూత్వ ప్రత్యేకంగా అవసరం లేదని కెటిఆర్‌ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. ఇది మరో కోణం.    

బిజెపితో కేంద్రంతో ముఖాముఖి విమర్శకు సిద్దం కాకపోగా ప్రతి సందర్భంలో మద్దతునిస్తున్న ఏపీ  ముఖ్యమంత్రి జగన్‌తో పోలిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ వైఖరి పూర్తి భిన్నంగా తయారవడానికి చాలా కారణాలున్నాయి. కాంగ్రెస్‌ బాగా బలహీనపడిపోయింది గనక కేంద్ర పాలక పక్షమైన బిజెపిపై కేంద్రీకరించడం అవసరమని కూడా కెసిఆర్‌ భావిస్తున్నట్టు చెబుతారు.  జిఎస్‌టి లోటుపై కేరళతో సహా బిజెపియేతర రాష్ట్రాల  సమావేశంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాల్గొనడంతో జాతీయ సంకేతాలు  ఇచ్చినట్టయింది . ఆర్థిక మంత్రి హరీష్‌ రావు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రతిపాదనలోని డ్లొల్లతనాన్ని లెక్కలతో సహా ఎండగట్టారు.

కీలక బిల్లులపై  పార్లమెంటులో ఓటింగుతో ఇది  పరాకాష్టకు చేరిందని చెప్పాలి.ఇదే సమావేశంలో  తెలంగాణకు చేసిన సాయంపై విడుదల చేసిన లెక్కలు  కూడా రాష్ట్ర  ప్రభుత్వ వాదనలకు బలం  చేకూర్చాయి. కరోనాను ఎదుర్కొవడానికి తెలంగాణకు ఏడు వేల కోట్లపైన ఇచ్చామని బండి సంజయ్‌ ప్రకటించగా వాస్తవంగా ఇచ్చింది 200 కోట్లు మాత్రమేనని అధికారికంగా సమాధానం వచ్చింది. కెటిఆర్‌ ఈ రెంటినీ ఉటంకిస్తూ ట్వీట్‌ చేశారు. విద్యుత్‌ రంగంలో మార్పుకు వ్యతిరేకంగా శాసనసభ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది.

రైతులు  అనధికారికంగా నీరు తీసుకున్నా అదేం దోపిడీ కాదనీ, ఉచిత విద్యుత్‌కు పదివేల కోట్లు కేటాయిస్తామని కెసిఆర్‌ సుస్పష్టమైన ప్రకటనచేశారు. హరీశ్‌ రావు మరో అడుగు ముందుకేసి గతంలో చంద్రబాబు నాయుడుకు మీటరు పెట్టినట్టే ఇప్పుడు మోడీకి పెట్టాలని జగన్‌ నాలుగు వేల  కోట్లకు ఆశపడి మీటర్లు పెట్టడానికి అంగీకరించారని విమర్శించారు. ఇది కూడా రాజకీయ సంబంధాలలో ఒకింత మార్పును సూచిస్తుంది.తెలంగాణలో రాబోయే కార్పొరేషన్‌ ఎన్నికకు దుర్బాక  ఉప ఎన్నిక దృష్ట్యా ఇలా మాట్లాడుతున్నారనే వారూ లేకపోలేదు.

అయితే దేశ వ్యాప్తంగా పరిణామాల  నేపథ్యంలో అంత తేలిగ్గా చూడటం వాస్తవికత అనిపించుకోదు. దుర్బాకలో బిజెపి రఘునందన రావు ఇప్పటినుంచే ప్రచారంలోకి దిగారు, ఇక త్వరలో జరిగే శాసనమండలి ఎన్నికలో కూడా బిజెపిని ఓడిరచాలనే వైఖరిని  టిఆర్‌ఎస్‌ ప్రదర్శిస్తుందేమో చూడాలి. హైదరాబాద్‌ రంగారెడ్డిలో  బిజెపి రామచంద్రరావు సిటింగ్‌ స్థానంగా వున్నందున ఇది రాజకీయ ప్రశ్న కానుంది. గతంలో ఎంఎల్‌సిగా రెండు సార్లు ఎన్నికవడమే గాక ఒకసారి టిఆర్‌ఎస్‌ మద్దతు పొందిన ప్రొఫెసర్‌ నాగేశ్వరరావుకు మద్దతునివ్వచ్చనే భావన ఒకటి వుంది.

ప్రస్తుత మేయర్‌ ఆ స్థానం ఆశిస్తున్నారనే మాట  కూడా వుంది.  కాంగ్రెస్‌ నాయకులు  కూడా పోటీ పెట్టాలని భావిస్తుండగా రాష్ట్రీయ లోక్‌దళ్‌ ను పునరుద్దరించినమాజీ ఎంఎల్‌సి దిలీప్‌ కుమార్‌ కూడా పోటీ యోచనలో వున్నారట. ఇవన్నీ స్ప్షష్టం కావడానికి మరికొంత సమయం పడుతుంది.  అంతర్వేది రథం దగ్ధం తర్వాత ఏపిలోనూ బిజెపి దూకుడు పెరగడంతో టిడిపి అధినేత చంద్రబాబు కూడా హిందూత్వ రాగాలు  అందిపుచ్చుకోవడం చూస్తున్నాం,ఎపితో పోలిస్తే కొంత మత ఘర్షణ నేపథ్యం, మత పొందికలో తేడావున్నా తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం బిజెపి వ్యూహాలను గట్టిగానేఎదుర్కోవలసి రావచ్చు. కేంద్రంపై టిఆర్‌ఎస్‌ వైఖరిని బలపరుస్తూ సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అదే చెప్పడం గమనించదగింది.