ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్‌`పై మెగా ఆస‌క్తి!

ఉద‌య్‌కిర‌ణ్ బ‌యోపిక్‌`పై మెగా ఆస‌క్తి!

తేజ డిస్క‌వ‌రీ ఉద‌య్‌కిర‌ణ్ జీవిత‌క‌థ గురించి తెలిసిందే. `చిత్రం` సినిమాతో ఉద‌య్‌ని హీరోని చేశాడు తేజ‌. తొలి ప్ర‌య‌త్న‌మే బ్లాక్‌బ‌స్ట‌ర్‌. అటుపై `నువ్వు నేను` సినిమాతో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకున్నాడు. ఆ రెండు సినిమాల‌తో హీరో అంటే ఇలా ఉండాలి అని తెలుగు ప్రేక్ష‌కులు వోన్ చేసుకున్నారు. యూత్‌లో అసాధార‌ణ ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక్క సినిమ‌తోనే తెచ్చుకున్న గొప్ప హీరోగా ఉద‌య్‌కిర‌ణ్ హిస్ట‌రీలో నిలిచాడు. టాలీవుడ్‌కి ఓ గొప్ప ట్యాలెంటెడ్ హీరో ప‌రిచ‌యం అయ్యాడ‌ని అంతా మాట్లాడుకున్నారు. ఆ క్ర‌మంలోనే ఉద‌య్‌కిర‌ణ్‌కి మెగా కాంపౌండ్‌తో అనుబంధం పెర‌గ‌డం.. అటుపై మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుశ్మిత‌తో 2003లో నిశ్చితార్థం అవ్వ‌డం.. అనంత‌ర ప‌రిణామాలు తెలిసిందే. జ్యోతిష్కుని సూచ‌న మేర‌కు మెగా కాంపౌండ్ ఆ వివాహాన్ని ర‌ద్దు చేసుకుంద‌ని అప్ప‌ట్లో వార్త‌లొచ్చాయి. ఎప్పుడైతే ఆ స‌న్నివేశం త‌లెత్తిందో ఇక ఉద‌య్‌కి కెరీర్ ప‌రంగానూ డౌన్ ఫాల్ స్టార్ట‌యింది. నిశ్చితార్థం క్యాన్సిల్ అయిన త‌ర‌వాత ఉద‌య్‌కిర‌ణ్ సినిమాల‌కు మెగా ఫ్యాన్స్ నుంచి ఆద‌ర‌ణ ఆటోమెటిగ్గా త‌గ్గింది. ఆ క్ర‌మంలోనే అత‌డు న‌టించిన చాలా సినిమాలు ఫ్లాపుల‌య్యాయి. వ‌రుస ఓట‌ముల‌తో స్టార్‌డ‌మ్ నిల‌బెట్టుకోలేక‌, ఆర్థికంగానూ ఉద‌య్ ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. 

ఆ స‌న్నివేశంలోనే 2012లో విషిత‌ను వివాహ‌మాడాడు. పెళ్లి త‌ర‌వాత ఆర్థిక‌ప‌ర‌మైన చిక్కులొచ్చాయి. దాంతోపాటే కుటుంబంలో క‌ల‌తలు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. ఆ స‌న్నివేశం ఉద‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు పురికొల్పింది. లైఫ్‌లో ఒకే ఒక్క ట‌ర్నింగ్ పాయింట్‌.  ఆ పాయింట్‌లో ఏదో త‌ప్పిదం జ‌రిగింది. ఆ ఒక్క త‌ప్పిదం భ‌విష్య‌త్ స్టార్ జీవితాన్ని క‌నుమ‌రుగ‌య్యేలా చేసింది. ఈ మొత్తం క‌థ‌ను బ‌యోపిక్‌గా తెర‌కెక్కించేందుకు తేజ రెడీ అవుతున్నాడు. ఇది తెలిసిన మెగాఫ్యాన్స్‌లో ఒకటే ఉత్కంఠ నెల‌కొంద‌ని చెబుతున్నారు. అయితే ఇలాంటి క‌థ‌ని డీల్ చేస్తే తేజ వివాదాస్పద అంశాల విష‌యంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటాడు? అన్న‌ది వేచి చూడాల్సిందే.