మోడీ స్కామ్‌ బయటపెడతాం...

మోడీ స్కామ్‌ బయటపెడతాం...

 కేంద్రంలో ప్రకంపనలు సృష్టించే కుంభకోణం త్వరలో బయటపెడతామనిఆంధ్రప్రదేశ్ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు వెల్లడించారు. ఆయన ఇవాళ అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ  నెల రోజుల్లోనే అన్ని ఆధారాలతో సహా  మోడీ బండారం బయటపెడతామని ఆయన అన్నారు. ప్రధాని మోదీకి దగ్గరగా ఉండే వ్యాపార సంస్థకు లబ్ధి చేకూర్చారన్న అంశం ప్రకంపనలు సృష్టించబోతోందన్నారు.  కచ్చితంగా ప్రకంపనలు పుట్టించే కుంభకోణం బయటపెడతామని అని బీజేపీ నేతలను హెచ్చరిస్తూ అన్నారు. కేంద్రం చేసిన కుంభకోణంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేస్తామన్నారు. 

ఆర్థికాంశాలు మాట్లాడితే ప్రజలకు అర్ధంకాదని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కుదరదని  కుటుంబరావు అన్నారు. బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.  జీవీఎల్‌ఎన్‌ మాటలు కుక్క తోక వంకరలాగా....  అన్నీ వంకర మాటలేనన్నారు. అసలు యూసీల గురించి  అడగటానికి జీవీఎల్ ఎవరు అని కుటుంబరావు ప్రశ్నించారు. 
నిధుల మళ్లింపు... పారిశ్రామిక కారిడార్లు.. యూసీల మీద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధమని.. 24 గంటల్లో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని సవాల్‌ విసిరారు.  తప్పని తేలితే జీవీఎల్ క్షమాపణలు చెబుతారా..? అని కుటుంబరావు నిలదీశారు.
ఎంపీ అయ్యారనే పొగరు  జీవీఎల్ మాటల్లో కన్పిస్తోందని కుటుంబరావు అన్నారు. జీవీఎల్ సహా బీజేపీ నేతలెవ్వరూ వార్డ్ మెంబర్ కూడా కాలేరని ఆయన ఎద్దేవా చేశారు. తొమ్మిది నెలల్లో బీజేపీ జాతీయ కార్యాలయాన్ని అద్భుతంగా నిర్మించుకున్నారని.. ఆ స్థాయిలో ఒక్క సంస్థ అయినా నిర్మాణం అయ్యేలా ఏపీకి సహకరించారా.. అని కుటుంబరావు ప్రశ్నించారు. ఢిల్లీ-ముంబై కారిడార్‌కు ఎక్కువ నిధులు ఇచ్చి.. మిగిలిన కారిడార్లకు నామమాత్రంగా నిధులు కేటాయించారన్నారు. దేశంలో 25 నోడ్స్ ఉంటే.. 5 నోడ్స్ గుజరాత్‌లోనే ఉన్న విషయాన్ని ఆయన గుర్తించారు. ఈ ఐదు నోడ్స్‌లో డొలేరాకు ఎక్కువ నిధులు ఇస్తున్నారని.. కృష్ణపట్నం నోడ్ విషయంలో మాత్రం ఇంతవరకు కేంద్రం క్లియరెన్స్ ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు ఇమేజ్ డామేజ్ చేయటానికే ఈ అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని కుటుంబరావు ఆరోపించారు. ఎయిర్ ఏషియా వ్యవహారంలో 85 శాతం యూపీఏ ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఫైనల్‌గా ఆమోదం తెలిపిందే మోడీ కేబినెటే అని ఆయన అన్నారు.  ఈ డీల్‌పై ఆరోపణలు వస్తే దీనికి మోడీ కేబినెట్‌ మొత్తం బాధ్యత వహిస్తారా అని ఆయన ప్రశ్నించారు.  ఎయిర్ ఏషియా విషయంలో ఏమీ లేదని.. ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటే.. దానికి చంద్రబాబు, అశోక్ గజపతిరాజులకు సంబంధం ఏమిటని  కుటుంబరావు అన్నారు.