ఏపీలో బీజేపీ వర్సెస్‌ టీడీపీ మొదలైందా?

ఏపీలో బీజేపీ వర్సెస్‌ టీడీపీ మొదలైందా?

బీజేపీని టీడీపీ టార్గెట్‌ చేయడం మొదలు పెట్టిందా? 2019 తర్వాత కమలంపై కన్నెత్తి చూడని తెలుగుదేశం ఇప్పుడు మెల్లగా కర్రెత్తుత్తోందా? అధినేత సైలెంట్‌గా ఉండి.. నేతలతో విమర్శలు గుప్పిస్తున్నారా? కాంగ్రెస్‌ తరహాలో బీజేపీకి కూడా ఏపీకి తీరని ద్రోహం చేసిందనే తెలుగుదేశం ఆరోపణలు దేనికి సంకేతం? 

బీజేపీ పట్ల టీడీపీ వైఖరి మారిందా? 

ఎన్నికల్లో ఓటమి తర్వాత బీజేపీతోపాటు కేంద్ర ప్రభుత్వంపై నోరెత్తడానికి పెద్దగా ఇష్టపడలేదు టీడీపీ పెద్దలు. కేంద్రానికి ప్రధాని మోడీకి ఏదోలా దగ్గరయ్యే ప్రయత్నం చేశారు అనే ప్రచారం జరిగింది. అయితే రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారడంతో తెలుగుదేశం వ్యూహం మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి విషయంలో బీజేపీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న టీడీపీ.. కమలనాథులను టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. కాంగ్రెస్‌ తరహాలో బీజేపీ కూడా ఏపీకి అన్యాయం చేస్తోందని  మండిపడుతున్నారు టీడీపీ నాయకులు.

రాజధానిపై రాష్ట్రానిదే నిర్ణయమని తేల్చేసిన బీజేపీ!

ఏపీలో జగన్ ప్రభుత్వ దూకుడుతో రాజకీయంగా తెలుగుదేశం కొంత ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంది. ఈ దశలో బీజేపీతో దూరం మంచిది కాదనే నిర్ణయానికి వచ్చి..ఏడాదిగా  కేంద్రం తీసుకున్న నిర్ణయాలకు మద్దతు ఇచ్చింది. కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన విషయాల్లో కూడా మౌనం దాల్చింది. కరోనా సమయంలో కేంద్రం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు అనేక సందర్బాల్లో కొనియాడారు. ఇదే సమయంలోనే అమరావతిపై రాష్ట్రం తేల్చేసింది. మూడు రాజధానుల చట్టం తెచ్చేసింది. అప్పటి వరకు అడ్డుపడుతాం అని చెప్పిన బిజెపి కూడా ప్రభుత్వానిదే అధికారం అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. 

బిల్లులు ఆమోదించకుండా ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్న!

అయినప్పటికీ చంద్రబాబు ఎక్కడా బీజేపీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడా విమర్శించలేదు. కాకపోతే  ఆ బాధ్యతను పార్టీలోని ఇతర నేతలకు అప్పగించినట్లు తెలుస్తోంది. కేంద్రం చేతిలో రాష్ట్రం మరోసారి మోసపోయిందనే టీడీపీ నేతల కామెంట్స్‌ ఈ కోవలోకే వస్తాయంటున్నారు. అమరావతి విషయంలో గవర్నర్‌ బిల్స్‌పై నిర్ణయం తీసుకోకుండా కేంద్రం ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నాడు అమరావతి నుంచి రాజధానిని అంగుళం కూడా కదల్చలేరని కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రకటనలను గుర్తు చేస్తున్నారు. 

అమరావతికి టీడీపీ తప్ప మరెవ్వరూ మద్దతుగా లేరా?

రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్నది బీజేపీ ప్రయత్నం.  టీడీపీ నుంచి  నేతలను చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది. బీజేపీని  అమరావతి అంశంలో ఎండగట్టాలన్నది  ప్రతిపక్షం వ్యూహంగా కనిపిస్తోంది.  అమరావతికి టీడీపీ తప్ప మరెవ్వరూ మద్దుతుగా లేరని చెప్పడం ఒకటైతే.. బీజేపీ చివరి నిమిషంలో మోసం చేసిందని ఎస్టాబ్లిష్‌ చెయ్యాలన్నది టీడీపీ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల సోషల్‌ మీడియా వర్గాలు, అమరావతి రైతులు బీజేపీని టార్గెట్‌ చేసుకుని పోస్టులు పెడుతున్నారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమ వీర్రాజు  చేసిన కామెంట్స్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. మరి.. రానున్న రోజుల్లో బీజేపీతో టీడీపీ ఇదే వైఖరి కొనసాగిస్తుందో లేదో చూడాలి.