అమరావతి ఎజెండాగా సత్తా చాటేందుకు సిద్దమవుతున్న టీడీపీ

అమరావతి ఎజెండాగా సత్తా చాటేందుకు సిద్దమవుతున్న టీడీపీ

అమరావతి అజెండాగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగే ఏ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలన్నది టీడీపీ వ్యూహం. కానీ.. ఆ ఎన్నికల్లో మాత్రం ప్లాన్‌ బీ వైపు వెళ్తోందట. ఇందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తోందట. 

స్వతంత్రంగా పోటీ చేస్తానంటున్న ఎమ్మెల్సీ రామకృష్ణ

కృష్ణా, గుంటూరు టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్సీగా టీడీపీకి చెందిన  AS రామకృష్ణ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి పోటీ చేయాలన్నది ఆయన కోరిక. కాకపోతే టీడీపీ అభ్యర్థిగా కాకుండా ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతానని ప్రకటించారు రామకృష్ణ. ఈ ప్రకటనే టీడీపీ వర్గాలను, రెండు జిల్లాల ప్రజలను ఆశ్చర్యపరుస్తోందట. అమరావతి అజెండాగా పోరాటం చేస్తున్న టీడీపీ.. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఏ ఎన్నికలు వచ్చినా సత్తా చాటాలని చూస్తోంది. కానీ.. టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాత్రం కొత్తగా ఆలోచించడమే ప్రశ్నగా ఉందట.
...

టీచర్లు అండగా ఉండరనే అనుమానాలు ఉన్నాయా?

టీచర్‌ ఎమ్మెల్సీకి 2015లో ఎన్నిక జరిగింది. అప్పటికే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఉంది. అందుకే రామకృష్ణను గెలిపించేందుకు పార్టీ నేతలు కూడా బాగా శ్రమించారు. అధికారం చేతిలో ఉండటంతో రామకృష్ణ విజయం సాధ్యమైందనే ప్రచారం కూడా జరిగింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ విపక్షంలో ఉంది. అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజధాని సెంటిమెంట్‌ ఈరెండు జిల్లాల్లో బలంగా ఉన్నా.. విద్యావంతులైన టీచర్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంత వరకూ టీడీపీకి అండగా నిలుస్తారనే అనుమానం నెలకొందట. ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో  ఏమో  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రామకృష్ణతో ముందుగానే ప్రకటన చేయించారని అనుకుంటున్నారు. 

రామకృష్ణ ఓడితే.. టీడీపీ చేతికి మట్టి అంటదనే లెక్కలు?

రామకృష్ణ ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటే.. టీడీపీ మరొకరిని పోటీకి పెట్టే అవకాశాలు తక్కువే. ఆయనకే బయట నుంచి మద్దతు ఇచ్చే వీలు ఉంటుంది. అలాగే ఈ రెండు జిల్లాల్లోని టీచర్‌ ఓటర్లను కలిసి అమరావతిపై చెప్పడానికి ఇదొక అవకాశం కలుగుతుందని టీడీపీ భావిస్తోందట. పార్టీ ముద్ర లేకుండా రాజధాని అజెండాగానే ఎన్నికలకు వెళ్తారట. ఒకవేళ ఓడిపోతే.. పార్టీ చేతికి మట్టి అంటకుండా చూసుకోవడం.. ఒకవేళ గెలిస్తే రాజధాని ఉద్యమంలో బయట నుంచి పనిచేశాం కాబట్టి వర్కవుట్‌ అయిందనే ప్రచారం చేసుకోవచ్చునని టీడీపీ లెక్కలు వేసుకుంటోందట. టీడీపీ ఆవులిస్తే.. లెక్కలు బయటకు తీయడానికి అధికార వైసీపీ రెడీగా ఉంది. వారు కూడా అందుకు తగ్గా వ్యూహమే రచిస్తారు. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకుంటున్న ఈ వ్యూహం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.