స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై టీడీపీ ఎందుకు సైలెంట్ అయింది?

స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై టీడీపీ ఎందుకు సైలెంట్ అయింది?

ఏ విషయంపైనైనా భగ్గుమనే ఆ మాజీ మంత్రి సైలెంట్‌గా ఉన్నారు. అధికార పార్టీని దుమ్మెత్తిపోసే ఆ మాజీ ఎమ్మెల్యే నోరెత్తలేదు. స్థానిక ఎంపీ అయితే అటు రానే రాలేదు. బెజవాడ స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై టీడీపీ మౌనం వహించిందా? ఆ పార్టీ నాయకులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? 

నిర్లక్ష్యంగా ఉన్నవారిపై సర్కార్‌ కన్నెర్ర!

కోవిడ్‌ సెంటర్‌గా ఉన్న బెజవాడలోని స్వర్ణ ప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ విషాదంలోకి నెట్టింది. చికిత్స కోసం వచ్చినవారు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని సైతం స్పందించి పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా  50 లక్షల పరిహారం ప్రకటించి.. తదుపరి అంశాలపై వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఈ నిర్లక్ష్యం వెనక ఎవరున్నా ఊరుకునేది లేదని గట్టిగానే స్పష్టం చేసింది సర్కార్‌. 

బెజవాడ ప్రమాదంపై సైలెంట్‌గా ఉన్న టీడీపీ నేతలు!

వైజాగ్ గ్యాస్‌ లీక్‌ ఘటనపై ప్రభుత్వాన్ని గట్టిగా  ప్రశ్నించిన టీడీపీ బెజవాడ ప్రమాదంపై ఎందుకో  అంత తీవ్రంగా మాట్లాడలేదు. స్పీడుగానూ వ్యవహరించలేదు అనే చర్చ జరుగుతుంది. ప్రమాదానికి నిర్లక్ష్యం కారణమనేది స్పష్టమవుతోంది. హోటల్‌కు ఆస్పత్రికి మధ్య ఒప్పందం ఉందా లేదా అనేది కూడా తెలియకుండా ఉంది. ఏ పరిస్థితుల్లో అధికారులు అనుమతులు ఇచ్చారన్నది తేలాల్సి ఉంది. ప్రధాన నిందుతులు పరారీలో ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో కృష్ణాజిల్లాలోని టీడీపీ నేతలు మాత్రం పెద్దగా రచ్చ చేయడం లేదు. ప్రమాదంపై విచారణ కోరి.. ఆవేదన వ్యక్తి చేసి సరిపెట్టారు.

హోటల్‌, ఆస్పత్రి నిర్వాహకులు టీడీపీకి దగ్గర?

ఇలాంటి ఘటనలు జరిగితే.. మాజీ మంత్రి దేవినేని ఉమా నుంచి బోండా ఉమా వరకు అంతా రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని కడిగేసేవారు. స్వర్ణ ప్యాలెస్‌ ప్రమాదంలో మాత్రం టీడీపీ నేతల నుంచి ఆ స్థాయిలో గళం వినిపించలేదు అనే చర్చ జరుగుతుంది. దీనికి కారణం ఏంటన్న దానిపై భిన్న వాదనలు ఉన్నాయి. ఇటు హోటల్, అటు ఆస్పత్రి నిర్వాహకులు ఇద్దరు టీడీపీకి దగ్గరగా ఉండే వారు అనే ప్రచారం ఉంది. ఈ విషయంలో కారకులపై చర్యలు తీసుకోవాలని టీడీపీ పెద్దగా డిమాండ్ చేయలేకపోతుంది అనే వాదన వినిపిస్తోంది.

టీడీపీ విమర్శలు చేయకపోవడానికి ఆ పరిచయాలే కారణం?

ప్రమాదం జరిగింది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కావడంతో  మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా వచ్చి పరిశీలించి వెళ్లారు. ప్రభుత్వం ప్రకటించిన సాయంపై ఆయన సానుకూల అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ కేశినేని నాని ఘటనాస్థలం దగ్గరకు రాలేదు. ప్రకటన  ద్వారా సంతాపం తెలియజేశారు. హోటల్‌, ఆస్పత్రి యాజమాన్యాలు రెండూ ప్రముఖ వ్యక్తులకు చెందినవే. టీడీపీ నేతలకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఘాటైన విమర్శలకు దిగకపోవడానికి కారణం అదే అనే వాదనా వినిపిస్తోంది. 

టీడీపీ అడగడానికి ఏమీ లేకుండా సర్కార్‌ చర్యలు తీసుకుందా?

ఇదే సందర్భంలో మరో అంశం కూడా తెరపైకి తెస్తున్నాయి టీడీపీ వర్గాలు. విమర్శలు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం చర్యలకు దిగిందనేది అందులో ఒకటి. సహాయ చర్యల నుంచి కేసులు... అరెస్టుల వరకు క్షణాల మీద జరిగిపోయాయి. ప్రతిపక్షం అడగడానికి ఏమీ లేకుండా పోయింది. అందువల్లే సైలెంట్‌గా ఉన్నామని టీడీపీ నేతలు చెప్పుకొంటున్నారు. వైజాగ్ ప్రమాదాన్ని ఈ ఘటనతో పోల్చవద్దని సూచిస్తున్నారట. ఆ ప్రమాదంలో ప్రభుత్వ తప్పిదాలు ఉన్నాయని.. ఇక్కడ మాత్రం పరిస్థితి భిన్నమని వారు లెక్కలు వేస్తున్నారట. ఒకవేళ ప్రభుత్వం చర్యలకు దిగకపోయి ఉంటే.. ప్రతిపక్షంగా నిలదిసేవారిమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఏది ఏమైనా.. విజయవాడ దుర్ఘటనపై  టీడీపీ కాస్త లోవాయిస్‌తోనే ఉందనే చర్చ జరుగుతోంది.