సీనియర్ నాయకులను అణగదొక్కుతున్నారు: రెహమాన్

సీనియర్ నాయకులను అణగదొక్కుతున్నారు: రెహమాన్

విశాఖ నియోజకవర్గంలో సీనియర్ నాయకులను అణగదొక్కుతున్నారు. ముఖ్యంగా ముస్లిం నాయకులను, కార్యకర్తలను చిన్న చూపు చూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత ఎస్ఏ రెహమాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖలో రెహమాన్ మాట్లాడుతూ... టీడీపీ అర్బన్ అధ్యక్షుడిగా, ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్  నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాజ్యాంగేతర శక్తులు పక్కన పెట్టుకొని నియోజకవర్గంలో పాలిస్తున్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అనుచరులకు వత్తాసు పలుకుతున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నాయకులను అణగదొక్కుతున్నారు. ముఖ్యంగా ముస్లిం నాయకులను, కార్యకర్తలను చిన్న చూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి ఎమ్మెల్యేకు మళ్లీ టికెట్ కేటాయిస్తే ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని రెహమాన్ పేర్కొన్నారు.

వాసుపల్లికి టికెట్ కేటాయించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని రెహమాన్ సూచించారు. దక్షిణ నియోజకవర్గంలో సుమారు 20,000 మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. వారంతా వాసుపల్లిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినా వాసుపల్లి టికెట్ కేటాయిస్తే.. అతడ్ని అధిష్ఠానమే గెలిపించుకోవాలి. వాసుపల్లి ఓటమి చెందితే మమ్మల్ని నిందించకూడదని రెహమాన్ అన్నారు.