టీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలి

 టీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పాలి

విభజన హామీలపై టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో గళం విప్పాలని అన్నారు రావుల చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలోకి లాక్కున్నారని తెలిపారు.  ఇప్పటికైనా పార్లమెంట్ లో టీఆర్ఎస్ ఎంపీలు గళం విప్పకపోతే తెలంగాణ నష్టపోతుందని వెల్లడించారు. టీటీడీపీ బృందంగా కలిసి ఢిల్లీకి వెళ్తున్నామని.. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి విభజన హామీలపై మాట్లాడాలని కోరుతామని వివరించారు. టీడీపీ జాతీయ భావాలు ఉన్న ప్రాంతీయ పార్టీ..  ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ అని ఆయన వెల్లడించారు. విభజన చట్టంలో అన్ని అంశాలు, అంతకు మించి అమలు చేస్తామని మోడీ హామీ ఇచ్చిందని... అవి అమలు కాకపోవడంతోనే పార్లమెంట్ లో బీజేపీపై అవిశ్వాసం పెట్టామని వివరించారు. 

2014 నుంచి తెలుగు ప్రజలను ఆశలుపెట్టి మోసం చేశారని... నీతిఆయోగ్ ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వకూడదని ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు.  అవిశ్వాసంపై ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీలు టీడీపీకి సహకరించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. టీఆర్ఎస్ పార్టీ టీడీపీ అవిశ్వాసానికి సహకరించాలని తెలిపారు. విభజన హామీలు తెలంగాణకు ఏ ఒక్కటీ అమలుకాలేదని.. గిరిజన యూనివర్సిటీ, ఆర్టికల్చర్ ఇన్స్టిట్యూట్, ఖమ్మంలో స్టీల్ ఫ్యాక్టరీ వంటివి ఇప్పటివరకు కేంద్రం అమలు చేయలేదని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన విభజన హామీల అమలు కోసం పార్లమెంటులో టీఆర్ఎస్ ఎంపీలు పోరాటం చెయ్యాలని వెల్లడించారు. నార్త్ రాష్ట్రాలకు ఇస్తున్న తరహాలో మన తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇవ్వాలని.. ఖాజిపేట్ కోచ్ ఫ్యాక్టరీపై విభజన జరిగిన 6నెలల్లో అమలు చెయ్యాలి అని చట్టంలో ఉందని... ఇంతవరకు లేదని తెలిపారు. అంతేకాకుండా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తా అన్నారు... ఇప్పుడు సరైన అవకాశం కేసీఆర్ ఉపయోగించుకోవాలని వివరించారు. తెలంగాణకు పారిశ్రామిక రంగంలో ఎలాంటి ప్రోత్సాహం లేకుండా కేంద్రానికి ఎందుకు సహకరించాలని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు.