ఆ టీడీపీ నేతను సొంత పార్టీ వాళ్లే పక్కన పెట్టారా?

ఆ టీడీపీ నేతను సొంత పార్టీ వాళ్లే పక్కన పెట్టారా?

రాజకీయాల్లో అన్ని రోజులూ ఒకలా ఉండవు. పల్లకీ మోసేవాళ్లు ఎప్పుడూ అలాగే ఉంటారనుకోవటం భ్రమ. ఎంత అభిమానం చూపిస్తారో.. ఇక చాలు సారూ అనటంలో కూడా అంతే గట్టిగా ఉంటారు. ఈ విషయంలో పశ్చిమగోదావరిలో ఓ నేతకు స్పష్టంగా కనిపిస్తోంది.

ఒకప్పుడాయనకు తిరుగు లేదు..ఆ ఏరియాలో మంచి అభిమానం సాధించుకున్నారు. మంత్రిగా కూడా పనిచేశారు. కానీ, తనవాళ్లనే వేధిస్తున్నారనే విమర్శలు మూటగట్టుకుని చివరికి నియోజకవర్గాన్ని వదులుకునే పరిస్థితి వచ్చింది. అయితే అన్ని రోజులు ఒక్కలా ఉండవు. ఎక్కడెక్కడో తిరిగినా, మళ్లీ తన పాత అడ్డాకే రావాలనుకుంటున్నా,  స్థానిక నేతలు మాత్రం ససేమిరా అంటున్నారట.

పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటాయి. ఇక్కడ సీట్లు ఎక్కువే.. నాయకులు ఎక్కువే. అంతేకాదు గ్రూపు రాజకీయాలూ ఎక్కువే. గ్రూపుల్లో ఒకదానికి మరొకదానితో పడదు అంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, ఒక గ్రూపులోకూడా అనేక లుకలుకలు కనిపిస్తాయి. చివరికి ఈ పంచాయితీలు తీర్చటానికి ఏకంగా పార్టీ అధినేతే రంగంలోకి దిగాల్సి వస్తోంది. కొవ్వూరు నియోజకవర్గం సాధారణంగా పెద్దగా వార్తల్లోకి రాదు. గత టిడిపి ప్రభుత్వంలో ఇక్కడి నుంచి గెలిచిన జవహర్ మంత్రి కావడంతో ఒక్కసారిగా కొవ్వూరు నియోజకవర్గం  వార్తల్లోకి ఎక్కింది. అయితే, జవహర్మంత్రిగా ఉన్న సమయంలో సొంత పార్టీ నేతలే తమను హీనంగా చూస్తున్నారని ఫిర్యాదులు వినిపించాయి. దళిత నేత జవహర్ మంత్రి పదవిలో ఉన్న సమయంలో పార్టీలోన దళితులకే సమస్యగా మారారని పెద్ద ఎత్తున నిరసనలు వినిపించాయి. స్వయంగా అధినేత చంద్రబాబుకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి.  దీంతో 2019 ఎన్నికల్లో జవహర్ను అక్కడి నుంచి తప్పించి ఆ సీటును అనితకు ఇచ్చాడు చంద్రబాబు. జవహర్ కృష్ణాజిల్లా తిరువూరు నుంచి పోటీ చేశారు. అయితే ఈ రెండు చోట్ల టిడిపి ఓటమి పాలవటంతో, చంద్రబాబు నాయకుల మార్పు ప్రయోగం బెడిసి కొట్టినట్టయింది. 

ఇవన్నీ ఇలా ఉంటే కొవ్వూరు నియోజకవర్గ నేతలకు మాత్రం కొత్త భయం పట్టుకుంది. జవహర్ ను రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జ్ గా నియమించడంతో మళ్ళీ ఆ నియోజకవర్గం లో గ్రూపులు తెరపైకి వచ్చాయి. గతంలో ఎలాగోలా ఇక్కడి నుంచి పంపించి వేస్తే మరో సారి తమపై పెత్తనం చేయడానికి జవహర్ వస్తున్నాడనే టాక్ మొదలయింది. ఈ ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవాలని చూస్తున్నారట కొవ్వూరు నియోజకవర్గ తమ్ముళ్లు.ఇప్పటికే ఈ విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారంట. కొవ్వూరు నియోజకవర్గం రాజమండ్రి పార్లమెంట్ నియోజవర్గం పరిధిలోది కావటంతో, జవహర్  పార్లమెంట్ ఇన్ చార్జ్ అయితే తమ నియోజకవర్గంపై కూడా మరోసారి పెత్తనం చేసే అవకాశాలు ఉంటాయంటున్నాయని కంగారు పడుతున్నారు. 

ఇప్పటికే కొవ్వూరు నియోజగవర్గంలో టీడీపీలో ఉన్న మరో గ్రూపు నేతలు తెలుగు యువత తో సమావేశమయ్యారు. మాజీ మంత్రి జవహర్  రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి అయినప్పటికీ కొవ్వూరు అసెంబ్లీ ఇంచార్జిగా మాత్రం వద్దు అంటున్నారట. ఆంధ్ర షుగర్స్ జె. యమ్. డి. పెండ్యాల అచ్యుత రామయ్య నేతృత్వంలో ఎవరిని నియమిస్తే వారితో పని చేయడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారట.  అయితే రాజమండ్రి పార్లమెంట్ ఇంచార్జి అయిన తరువాత మొదటి సారి కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చిన జవహర్ కి ఒక గ్రూపు నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి మాత్రం మరో గ్రూపు టీడీపీ నాయకులు ఎవరు రాలేదు. ఇలా నియోజకవర్గం లో టీడీపీ రెండు గ్రూపులుగా చీలి కనిపిస్తోంది. ఇది చివరికి పార్టీకే నష్టమని మరికొందరు తటస్థ నేతలు బాధపడుతున్నారట. ఇప్పటికే అనేక సమస్యలతో సతమతమౌతున్నా చంద్రబాబు కొవ్వూరు లాంటి సమస్యలు మరింత తలనొప్పిగా మారే అవకాశం ఉంది.