ఇంతన్నారు, అంతన్నారు..సొంత గ్రామాల్లోనే తుస్సు మన్నారు..!

ఇంతన్నారు, అంతన్నారు..సొంత గ్రామాల్లోనే తుస్సు మన్నారు..!

ఇంతకాదు అంతన్నారు. మైక్‌లలో ఊదరగొట్టేశారు. సత్తా చూపిస్తామని తొడకొట్టారు కూడా. సీన్‌ కట్‌ చేస్తే.. సొంత గ్రామాల్లోనే తుస్‌ మనిపించారు ఆ జిల్లాలోని టీడీపీ సీనియర్‌ నాయకులు. పల్లెలో పట్టు తప్పి.. పార్టీ శ్రేణుల్లో చర్చకు కారణమైన ఆ నాయకులు ఎవరో.. ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

పంచాయతీ పోరులో వ్యూహం లేదా? 

ఎన్నికల్లో ఓటమి నుంచి కొందరు గుణపాఠాలు నేర్చుకుంటారు. ఎక్కడ లెక్క తప్పిందో.. ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకుని జాగ్రత్త పడతారు. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్‌ టీడీపీ నాయకులు మాత్రం దీనికి భిన్నంగా వెళ్తున్నారట. నియోజకవర్గాలలో ఆధిపత్యపోరు, వర్గ విభేదాలకే ప్రాధాన్యం ఇస్తూ.. కేడర్‌తోనూ సమన్వయం చేసుకోవడం లేదట.  పార్టీ పరంగా పెద్ద పెద్ద పదవులు ఉన్నా.. అవి పేరు వెనక రాసుకోవడానికి తప్ప.. ఎన్నికల వ్యూహం అమలులో అక్కరకు రావడం లేదన్న విమర్శ టీడీపీలోనే వినిపిస్తోంది. 

పనితీరుకు పంచాయతీ ఎన్నికలే గీటురాయి?

విజయనగరం జిల్లా నుంచి కేంద్రమంత్రులుగా పనిచేసిన అశోక్‌ గజపతిరాజు, కిశోర్‌ చంద్రదేవ్‌, రాష్ట్ర మంత్రిగా చేసిన సుజయ్‌కృష్ణ రంగారావు, సీనియర్‌ నేతలు పతివాడ నారాయణస్వామి, కోళ్ల లలితకుమారి వంటి సీనియర్లు టీడీపీలో ఉన్నారు. కానీ.. 2019 ఎన్నికల్లో వీరందరికీ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. నేతల ఊహకు అందని విధంగా ఓటర్లు తీర్పు ఇచ్చారు. దగ్గర దగ్గర రెండేళ్లు గడిచిపోయింది. ఇప్పటికైనా ఆ ఓటమి భారం నుంచి బయటకొచ్చి.. కొత్త వ్యూహ రచన ఏదైనా చేస్తున్నారా అంటే లేదని చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. దీనికి పంచాయతీ ఎన్నికలనే ఉదాహరణగా వెల్లడిస్తున్నారు. 

బొబ్బిలిలో బేబినాయన ఒక్కరే పోరాడారా? 

జిల్లాలో మొదటి విడతగా పార్వతీపురం డివిజన్‌లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. సీనియర్లు ఉన్న నియోజకవర్గాల్లోనే టీడీపీ మద్దతుదారులకు పరాభవం తప్పలేదు. బొబ్బిలి నియోజకవర్గంలో.. బొబ్బిలి రాజ వారసుడు, టీడీపీ ఇంఛార్జ్‌ బేబినాయన ఒక్కరే కాస్త ఫర్వాలేదని అనిపించారు. 110 సర్పంచ్‌ స్థానాలు బొబ్బిలిలో ఉంటే.. 40కిపైగా గ్రామాల్లో టీడీపీ మద్దతుదారులను గెలిపించుకున్నారు. కురుపాం, సాలూరు, పార్వతిపురం నియోజకవర్గాల్లో మాత్రం ఫలితాలు చాలా దారుణంగా ఉన్నాయి. 

మామపై పైచేయి సాధించిన డిప్యూటీ సీఎం!

పార్వతీపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు సొంత ఊరు కృష్ణాపురంలో తెలుగుదేశం మద్దతుదారు ఓడిపోయారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యురాలు, ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యారాణి తన సొంత గ్రామం కవిరిపల్లిలో సైతం తెలుగుదేశానికి ఎదురుదెబ్బే తగిలింది. కురుపాం, చినమేరంగి రాజులు ఒక్కటైనా కురుపాంలోనూ అదే పరిస్థితి. అభ్యర్థుల తమవారే అని ప్రకటించినా.. వారి తరఫున ప్రచారం చేయలేదు నాయకులు. మామ-కోడలి ఫైట్‌గా మారిన చినమేరంగిలో డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణే పైచేయి సాధించారు. ఇక్కడ శత్రుచర్ల సోదరులకు పరాభవం తప్పలేదని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 

ఇంట గెలిచి రచ్చ గెలవాలని పార్టీలో కామెంట్స్‌!

పల్లెపోరులో ఓటములపై టీడీపీలో అప్పుడే విమర్శలు మొదలయ్యాయి. పదవులు అనుభవించిన వారు కేడర్‌ను పట్టించుకోకపోతే ఇంతకంటే మెరుగైన ఫలితాలు ఎలా వస్తాయని కొందరు ప్రశ్నిస్తున్నారట. చిన్న చిన్న విభేదాలను సైతం సరిచేయడం లేదట. ఇంట గెలిచి రచ్చ గెలిస్తే బాగుండేదని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు. అందుకే రాబోయే 3, 4 దశల పంచాయతీ ఎన్నికల్లో ఇతర సీనియర్‌ నాయకులు ఏ మేరకు రాణిస్తారో అన్న చర్చ టీడీపీలో మొదలైంది.