ఉపఎన్నికలకి భయపడుతున్న టీడీపీ?

ఉపఎన్నికలకి భయపడుతున్న టీడీపీ?

అమరావతి రాజీనామా విషయంలో ఎమ్మెల్యేలు నిజంగా రాజీనామా చేస్తారా?  మళ్లీ ఎన్నికలకు వెళ్తే టీడీపీ  నిలబడుతుందా? చంద్రబాబు ఆ సూప్‌లో పడిపోతారని భయపడింది ఎవరు? టీడీపీ అధినేత అందుకే వ్యూహాత్మకంగా మెలిక పెట్టారా? ఇరువర్గాలు సవాళ్లేనా? సాధించేది ఏమైనా ఉందా?  
 
ఏపీలో ఎన్నికల  సీన్‌ కనిపిస్తోందా అన్నంత చర్చ!

అమరావతి చుట్టూ ఏపీ రాజకీయం వేడెక్కింది. రాజీనామాల సవాళ్లు, ఛాలెంజ్‌లు తెరపైకి వచ్చాయి. డెడ్‌లైన్లు పెట్టే వరకూ తీవ్రత వెళ్లింది. దీంతో ఏపీలో మళ్లీ ఎన్నికల సీన్‌ కనిపిస్తోందా అన్నంత చర్చ జరుగుతోంది. దమ్ముంటే  టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయండి.. మీరు గెలిస్తే మళ్లీ అమరావతి ఊసెత్తం అని మంత్రి అనిల్‌ సవాల్‌ చేశారు. తర్వాత అనేక మంది మంత్రులు, వైసీపీ నేతలు ఇదే డిమాండ్‌తో టీడీపీని ఉక్కిరిబిక్కిరి చేశారు. 
 
ఉప ఎన్నికలకు వెళ్లితే 23 సీట్లూ వైసీపీకేనా?

అయితే మంత్రి అనిల్‌ తదితరులు విసిరిన సవాల్‌కు టీడీపీ చంద్రబాబు సై అంటారా? ఆయన సూప్‌లో పడిపోతారా? అని పార్టీ నాయకులు ఆందోళన చెందారు. ఒకవేళ వైసీపీ ట్రాప్‌లోకి చంద్రబాబు వెళ్లి.. టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తే ఏమౌతుందనే చర్చ మొదలైంది. నంద్యాలలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాడు గెలిచారో.. టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా ద్వారా వచ్చే ఉప ఎన్నికల్లో వైసీపీ అలాగే గెలుస్తుందని కలవర పడ్డారట తెలుగు తమ్ముళ్లు.  చంద్రబాబు కూడా ఓడిపోవడమే కాదు.. 23 సీట్లూ జగన్‌కే వస్తాయి అని పార్టీ వర్గాలు అనుకున్నాయట. 
 
చంద్రబాబు చివరి నిమిషంలో మెలిక పెట్టారా?

అందుకే చంద్రబాబు మీడియా సమావేశం అనగానే టీడీపీ వర్గాల్లో టెన్షన్‌ పెరిగిపోయింది. బాబు ఏం చెబుతారో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూశారు. రాజీనామాలకు సిద్ధమని అంటే.. టీడీపీ భవిష్యత్‌ ఏంటనే ప్రశ్నలు వేసుకున్నారు. కానీ.. చంద్రబాబు  మెలిక పెట్టారు. 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామ చేయండి.. మేము కూడా చేస్తామని షరతు పెట్టారు టీడీపీ అధినేత. దీంతో టీడీపీ వాళ్లు రాజీనామా చేయరు.. వైసీపీ వాళ్లు రాజీనామా జోలికి వెళ్లరు అనేది స్పష్టమైపోయింది. ఏదో జరగబోతుందని అనుకున్న జనాలే పప్పలయ్యారు. 
 
ఉప ఎన్నికల రాజకీయం వేరేగా ఉంటుందా?

మంత్రి అనిల్‌, ఇతర నేతల కవ్వింపులకు లొంగి టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉన్నట్లయితే రాష్ట్రంలో వారి అడ్రస్‌ గల్లంతవడం ఖాయం. అసలు చంద్రబాబు చరిత్ర చూసుకుంటే ఎదురెల్లి పోరాడటం అనేది ఉండదు. చాలా ఎన్నికల్లో ఎవరితో ఒకరితో కలిసే పోటీ చేశారు. ఒంటరిగా వెళ్లి టీడీపీ దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. అందుకే రాజీనామాలు, ఉప ఎన్నికలు అంటే.. ఒకప్పుడు వేరు.. ఇప్పుడున్న రాజకీయం వేరు అనుకుంటున్నాయి. 
 
వెయిట్‌ అండ్‌ వెయిట్‌ అన్న పద్ధతిలో చంద్రబాబు

అప్పట్లో ఇలా అంటే అలా రాజీనామా చేసేవారు గులాబీ దళపతి కేసీఆర్‌.  పీసీసీ చీఫ్‌గా ఉన్న ఎం. సత్యనారాయణరావు ఛాలెంజ్‌ను సవాల్‌గా తీసుకుని కేసీఆర్‌ రాజీనామా చేశారు. నాటి నుంచి అనేక సందర్భాలలో రండి అంటే రండి అన్నట్లుగా ఉండేది ఆయన వైఖరి. అలాంటి  ధైర్యం చంద్రబాబు చేస్తారేమోనని పార్టీ వర్గాలు భయపడ్డాయి. అయితే అది చంద్రబాబు రక్తంలోనే లేదు అని కామెంట్స్‌ చేస్తుంటాయి పార్టీ వర్గాలు.  వెయిట్‌ అండ్‌ వెయిట్‌ అనే పద్ధతిలో చంద్రబాబు వెళ్తుంటారు. ఆవేశాలు ఉండవు.  
 
చంద్రబాబు సవాల్‌ చేశారని వైసీపీ వాళ్లు ఎన్నికలు తెచ్చుకోరు?

కాంగ్రెస్‌తో విభేదించి ఉప ఎన్నికలకు వెళ్లిన జగన్‌కు ఐదు లక్షలకుపైగా మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. అమరావతి ఎపిసోడ్‌లో మాత్రం చంద్రబాబు మెలిక పెట్టి తప్పించుకున్నారనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఒకవేళ చంద్రబాబు ఒప్పుకొని అప్పటికప్పుడు రాజీనామా చేస్తే.. రాష్ట్రంలో అత్యంత బలంగా ఉన్న వైసీపీని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. ప్రజాకర్షక పథకాలు చాలా అమలు చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. నిధులు కుమ్మరిస్తోంది. ఓటు బ్యాంక్‌ను సాలిడ్‌ చేసుకుంటోంది. అందువల్ల చంద్రబాబు ఉప ఎన్నికలు అనే పిచ్చి పని చేయబోరని ఓ వర్గం వాదిస్తోంది.  వైసీపీకి ప్రస్తుతం 151 సీట్లు ఉన్నాయి. చంద్రబాబు సవాల్‌ చేశారని వైసీపీ వాళ్లు ఇప్పుడు ఎన్నికలు తెచ్చుకోరు. అలాగే తొందరపడి  చంద్రబాబు అండ్‌ బ్యాచ్‌ రాజీనామా చేస్తే టీడీపీ అడ్రస్‌ ఉండదు.  ఫైనల్‌గా జరగబోయేది ఏంటంటే.. ప్రత్యేక హోదాలాగే రాజీనామాలు ఎటూ జరగవు. మధ్యలో ప్రజలకు ఎంటర్‌టైన్‌మెంట్‌ తప్ప. 
 
స్పీకర్‌ ఫార్మాట్‌లో టీడీపీ రాజీనామాలు ఇస్తే 2 నిమిషాల్లో ఆమోదం!

చంద్రబాబు ఎప్పుడైతే మెలిక పెట్టారో అప్పుడే టీడీపీ శ్రేణులు ఉపశమనం పొందాయి. కొత్త చంద్రబాబును చూస్తారనుకున్నవాళ్లు 48 గంటల డెడ్‌లైన్‌ విన్న తర్వాత  తేలికపడ్డారట.  రాజీనామాలు వాళ్లూ చేయరు.. వీళ్లు చేయరు అని అర్థమైపోయింది. ఒకవేళ స్పీకర్‌ ఫార్మాట్‌లో చంద్రబాబు అండ్‌ కో రాజీనామాలు చేస్తే వాటిని రెండు నిమిషాల్లో ఆమోదించేస్తారు. దాంతో చంద్రబాబుకు ఇదే చివరి ఎన్నిక అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుకున్నారు విశ్లేషకులు. అలాంటి ప్రమాదకర పరిస్థితుల నుంచి వ్యూహాత్మకంగా స్పందించారు టీడీపీ అధినేత. ఈ ఉపద్రవం నుంచి తప్పించుకున్నారు.