విలీన ప్రక్రియ పూర్తి.. టీడీఎల్పీ కనుమరుగు

విలీన ప్రక్రియ పూర్తి.. టీడీఎల్పీ కనుమరుగు

తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిథ్యమే లేకుండా పోయింది.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం (టీడీఎల్పీ),  టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో పూర్తిస్థాయిలో విలీనం అయ్యింది.. ఇందుకు సంబంధించిన బులెటిన్ ను శాసన సభ కార్యదర్శి నరసింహాచార్యులు విడుదల చేశారు. కాగా, తమను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేయమని టీడీఎల్పీ సభ్యులు సండ్ర వెంకట వీరయ్య, మెచ్చ నాగేశ్వర్ రావు చేసుకున్న వినతిని పరిశీలించిన అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. వారి విలీనానికి అంగీకారం తెలిపామని టీఆర్ఎస్ ఎల్పీ అందించిన సమాచారాన్ని కూడా అందుకున్నారు. అనంతరం దాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం.. టీఆర్ఎస్ ఎల్పీలో టీడీఎల్పీ విలీనాన్ని రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ లోని నాలుగో పేరా ప్రకారం ఆమోదించారు. ఇక, టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులతోపాటుగా సీట్లను కేటాయించనున్నట్లు అసెంబ్లీ కార్యదర్శి బులెటిన్ లో పేర్కొన్నారు. 


సత్తుపల్లి నియోజకవర్గం నుండి సండ్ర వెంకట వీరయ్య, అశ్వారావుపేట నియోజకవర్గం నుండి మెచ్చ నాగేశ్వర్ రావులు ఇప్పటి వరకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు.. గత సాధారణ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నుంచి ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు గెలుపొందారు.  కాగా, తాము టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీలో విలీనం కాదలుచుకున్నట్టు బుధవారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిసి లేఖను  అందించారు.. వారు టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం అయ్యేందుకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూలులో పొందుపరిచిన నాలుగవ పేరా ప్రకారం అనుమతివ్వాల్సిందిగా కోరారు.. ఈ మేరకు స్పీకర్ వారి విలీనాన్ని ఆమోదించారు.. దీంతో అధికారిక ప్రకటన విడుదల చేశారు. టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావడం ద్వారా  శాసన సభలో తెలుగుదేశం పార్టీ లెజిస్లేటివ్ పార్టీ పూర్తిస్థాయిలో కనుమరుగయింది.
 రాజ్యంగంలోని పదవ షెడ్యూలు నాలుగవ పేరాలో పొందుపరిచిన  నిబంధన ప్రకారం... ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండు వంతుల 2/3 సభ్యులు, తాము వేరే ఏదైనా పార్టీలో విలీనం కావాలనుకుంటే రాజ్యాంగపరంగా అందుకు స్పీకర్ అనుమతించాల్సి వుంటుంది. కాగా, తెలుగుదేశం పార్టీలో వున్నదే ఇద్దరు ఎమ్మెల్యేలు... ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎల్పీలో విలీనం కావాలని నిర్ణయం తీసుకున్నందున శాసన సభలోని నూటికి నూరు శాతం టిడిపీ  సభ్యులు టిఆర్ఎస్ లో విలీనమైనట్టయింది. వీరిద్దరూ ఇకనుంచి పూర్తిస్థాయిలో టిఆర్ఎస్ పార్టీ శాసన సభ్యులుగానే కొనసాగనున్నారు.