నేతల మధ్య లొల్లి పెట్టిన ఖైరతాబాద్ గణేశుడు.!

నేతల మధ్య లొల్లి పెట్టిన ఖైరతాబాద్ గణేశుడు.!

కరోనా టైమ్‌లో ఖైరతాబాద్‌ గణేషుడు హైదరాబాద్‌ నేతల మధ్య పెద్ద పంచాయితీనే పెట్టాడు. ఒకరు లోకల్ మినిష్టర్‌ను అని అంటే... ఇంకొకరు లోకల్‌ చంటిగాడిని అని అంటున్నారు. చివరకు ఎవరి మాట నెగ్గింది? ఇంతకీ గణనాథుడు పెట్టిన లోకల్‌ లొల్లి ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. 

ఖైరతాబాద్‌లో 3 అడుగుల విగ్రహమే ఉండాలని పోలీసులు సూచన!

వినాయక చవితి ఉత్సవాలకు హైదరాబాద్‌లో ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించినా.. ఖైరతాబాద్‌ గణేష్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. 66 ఏళ్లుగా విగ్రహాన్ని ఒక్కో అడుగు పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ ఏడాది కరోనా ఎఫెక్ట్‌తో ఖైరతాబాద్‌ గణనాథుడి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలనే దానిపై పెద్ద చర్చే జరిగింది. ఈ అంశంపై మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ పలు దఫాలు సమావేశమైంది. పోలీసులను ఆశ్రయిస్తే కేవలం 3 అడుగుల ఎత్తే ఉండాలని సూచించారట. ఈ సూచనతో అసంతృప్తి చెందిన ఉత్సవ కమిటీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను ఆశ్రయించారట. 

విగ్రహం 4 అడుగులు ఉండాలని సూచించిన మంత్రి తలసాని!

ఇంత వరకూ బాగానే ఉన్నా.. మంత్రి తలసాని చెప్పింది విన్న కమిటీ సభ్యులకు ఆయన సలహా కూడా రుచించ లేదట. పోలీసులు 3 అడుగుల గణేష్‌ విగ్రహాలు పెట్టుకోమని చెబితే.. మంత్రి తలసాని మరో అడుగు పెంచి 4 అడుగుల విగ్రహం పెట్టుకోవాలని చెప్పారట. మరీ నాలుగు అడుగులు అంటే ఏం బాగుంటుందని అనుకున్నారో ఏమో.. లోకల్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను ఆశ్రయించారు కమిటీ సభ్యులు. విగ్రహం ఎత్తుపై ఎమ్మెల్యేను కమిటీ సభ్యులు గట్టిగానే నిలదీసినట్లు సమాచారం. 

9 అడుగుల విగ్రహానికి ఓకే చెప్పిన ఎమ్మెల్యే దానం నాగేందర్‌!

కమిటీ సభ్యులు చెప్పింది విన్న తర్వాత  ఖైరతాబాద్‌ గణనాథుడి ఎత్తు 9 అడుగులు పెట్టుకోవాలని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ చెప్పారట. ఆ మాటకు ఫిక్స్‌ అయిన కమిటీ..  9 అడుగుల వినాయక విగ్రహ తయారీకి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఖైరతాబాద్‌ గణేష్‌ పంచాయితీని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఇద్దరూ సీరియస్‌గా తీసుకున్నారట. దాంతో లొల్లి మొదలైందని అంటున్నారు. 

తన నియోజకవర్గంలో తలసాని జోక్యంపై దానం ఫైర్‌?

తన నియోజకవర్గంలో జరిగే ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవాలకు మంత్రి తలసానికి సంబంధం ఏంటని దానం వర్గీయులు నిలదీస్తున్నారట. దీనిపై మంత్రి శిబిరం నుంచి ఇంకా స్పందన లేదు. కాకపోతే ఈ సమాచారం మంత్రి చెవిన పడినట్లు చెబుతున్నారు. వాస్తవానికి కరోనా నిబంధనల మేరకు  ఈసారి విగ్రహం ఎత్తు తగ్గించి 27అడుగులకు పరిమితం చేయాలని అప్పట్లో కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం వేసవిలో కర్రపూజ కూడా నిర్వహించాలని భావించారు. తొలుత 18 శిరస్సుల విశ్వరూప వినాయకుడి ప్రతిష్టించాలని అనుకున్నారు. ప్రభుత్వం, పోలీసులు, ఉత్సవ కమిటీ సభ్యుల మధ్య సమాలోచనల తర్వాత రూపంలో మార్పులు చేర్పులు చేశారు. 

విగ్రహం ఎత్తుపై ఇంకా ట్విస్ట్‌లు ఉంటాయా? 

కరోనా కష్టాలతోపాటు ఈసారి రాజకీయ ఛట్రంలో  ఖైరతాబాద్‌ గణేషుడు చిక్కుకున్నాడనే  కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. ఇప్పటికైతే 9 అడుగుల విగ్రహ తయారీ పూజ అయిపోయింది. ఉత్సవాలు సమీపించే కొద్దీ ఈ సమస్య ఇంకా ఎన్నెన్ని మలుపులు తిరుగుతుందోనని చర్చించుకుంటున్నారట. పైగా మంత్రి తలసాని, ఎమ్మెల్యే దానం మధ్య రాజకీయ వైరాన్ని పెంచినట్లు చెవులు కొరుక్కుంటున్నారు. మరి.. వీరి మధ్య తలెత్తిన ఈ సమస్యను విఘ్ననాయకుడు పరిష్కరిస్తాడో లేక.. నేతల మధ్య ఆధిపత్య పోరుకు బీజం పడుతుందో చూడాలి.