టీఆర్ఎస్ నేతలకు మరోసారి సింబల్ టెన్షన్ !

టీఆర్ఎస్ నేతలకు మరోసారి సింబల్ టెన్షన్ !

టీఆర్‌ఎస్‌ పార్టీకి మరోసారి సింబల్‌ టెన్షన్‌ పట్టుకుందా ? గత కొన్ని ఎన్నికల్లో కారును పోలిన గుర్తులు ఉండటం.. గులాబీ పార్టీని ఇబ్బంది పెట్టాయి. ఇప్పుడు నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అవుతోందా ? గులాబీ శ్రేణుల్లో ఆందోళనకు కారణం ఏంటి ?

నాగార్జున సాగర్ ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు  సవాల్‌గా మారింది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న టీఆర్‌ఎస్‌.. జానారెడ్డిని ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. అయితే ప్రణాళిక ప్రకారం ఎన్నికల ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు.. కొన్ని ఎన్నికల గుర్తులు  ఆందోళన కలిగిస్తున్నాయి.
గత అసెంబ్లీ ఎన్నికల్లో కారును పోలి ఉన్న గుర్తులు మరో రెండు, మూడు ఉండటం వల్ల టీఆరెస్  అభ్యర్థులు కొందరు ఓటమి చెందారని, మరికొన్నికోట్ల మెజార్టీ తగ్గిందని గులాబీ నేతలు ఆందోళన చెందారు. ముఖ్యంగా ఆటో, ట్రక్కు లాంటి గుర్తులు బ్లాక్ అండ్ వైట్ లో ఉండటం.. ఓటర్లను గందరగోళానికి గురిచేశాయి. ముఖ్యంగా వృద్ధులు, నిరక్షరాస్యులు.. "కారు" గుర్తుకు వేయాలనుకున్న వారు సైతం మిగతా గుర్తులకు ఓట్లు వేశారు. అందుకే ఆయా గుర్తుల మీద పోటీచేసిన స్వతంత్రులకు  కూడా వేలకు వేలు ఓట్లు వచ్చాయంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవొచ్చు.

ఎన్నికల్లో గుర్తు సమస్యలపై టీఆర్‌ఎస్‌ పోరాటం చేసింది. ట్రక్కు గుర్తు తొలగించాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు గులాబీ నేతలు  ఫిర్యాదు చేశారు. టీఆరెస్ నేతల కంప్లైంట్‌తో  ట్రక్కు గుర్తును ఈవిఎం జాబితా నుంచి తొలగించారు. ఆ తరువాత కొన్నాళ్లకు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో "రోడ్డు రోలర్" గుర్తు కూడా గులాబీపార్టీని ఇబ్బందిపెట్టింది.  భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ౦లో అయితే రోడ్డు రోలర్ గుర్తుకు భారీగానే ఓట్లు పడ్డాయి.  అంతేకాదు చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులు గట్టెక్కినా.. మెజార్టీ మాత్రం తగ్గింది.

నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ కారును పోలి ఉన్న గుర్తులు.. ఆ పార్టీ శ్రేణులకు ఆందోళన కలిగిస్తోంది. ఇద్దరు  ఇండిపెండెంట్ అభ్యర్థులకు చపాతీ రోలర్, రోడ్డు రోలర్ గుర్తులొచ్చాయి. అచ్చం కారును పోలి ఉన్న చపాతీ రోలర్..  దుబ్బాక ఉపఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీని  డ్యామేజ్ చేసింది. ఆ గుర్తుకు 3 వేల పై చిలుకు ఓట్లు వచ్చాయి. ఇక రోడ్డు రోలర్ గుర్తు కూడా గతంలో పెద్ద డ్యామేజ్ చేసిందే. ఈ నేపధ్యంలోనే సాగర్ లో చపాతీ రోలర్,రోడ్డు రోలర్ గుర్తుల విషయంలో ఓటర్లు కన్‌ఫ్యూజ్‌ కాకుండా అవగాహన కల్పించే చర్యలు చేపట్టారు టీఆర్ఎస్ శ్రేణులు. ఏకంగా డమ్మీ ఈవీఎంనే సృష్టించి ఓటర్లను చైతన్యం తెచ్చేందుకు సాగర్ లో నానా తంటాలు పడాల్సి వస్తుంది.