ఎక్కువ మాట్లాడితే వేటు వేస్తాం జాగ్రత్త అంటోన్న ఏపీ బీజేపీ

ఎక్కువ మాట్లాడితే వేటు వేస్తాం జాగ్రత్త అంటోన్న ఏపీ బీజేపీ
పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా నోరెత్తితే వేటు వేస్తున్న తీరు.. ఏపీ బీజేపీలో తీవ్ర కలకలం రేపుతోంది. క్రమశిక్షణలో పెట్టడానికి ఇదే పరిష్కారమా? కేవలం కిందిస్థాయి నేతలపైనే అస్త్రాలు వేస్తారా? పైస్థాయిలో ఉన్నవారికీ గురిపెడతారా? ఈ చర్యలతో బీజేపీకి మేలు జరుగుతుందా? అసలుకే ముసలం పుడుతుందా? ఉన్నదే ఇంత.. అందులో సస్పెన్షన్ల సంత అన్నట్లు తయారైందని నేతలు ఎందుకు అనుకుంటున్నారు? లెట్స్‌ వాచ్‌.
 
అమరావతిపై కేంద్ర జోక్యంపై మాట్లాడితే చర్యలు!

ఏపీ బీజేపీలో ఇప్పుడు సస్పెన్షన్ల పర్వం నడుస్తోంది. ఎక్కువ తక్కువ మాట్లాడిన వారికి పార్టీ పెద్దల ఆదేశాలతో నిమిషాల్లో నోటీసులు ఇస్తున్నారు. గంటల వ్యవధిలో వేటు వేస్తున్నారు.  కీలక అంశాలపై నేతలు తలో మాట మాట్లాడటం వల్ల పార్టీ నవ్వుల పాలవుతోందని భావించిన రాష్ట్ర నాయకత్వం చర్యలకు వెనుకాడటం లేదన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రాజధాని అమరావతి విషయంలో కేంద్ర జోక్యంపైనే నోటీసులు, సస్పెన్షన్లు ఉంటున్నాయి. ఇప్పటి వరకూ ముగ్గురు నేతలపై నెల రోజుల వ్యవధిలో చర్యలు తీసుకున్నారు. మరో ఐదుగురు నేతలకు, అధికార ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. 
 
రైతుల సభలో మాట్లాడిన గోపాలకృష్ణపై చర్యలు

కన్నా లక్ష్మీనారాయణ ఏపీ బీజేపీ అధ్యక్షునిగా ఉన్న సమయంలో అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజాను సస్పెండ్‌ చేశారు. అనుమతి లేకుండా టీవీ చానళ్ల చర్చలకు వెళ్తున్నారన్నది లక్ష్మీపతిపై ఉన్న అభియోగం. దిలీప్‌, రామకోటయ్యలకు కూడా నోటీసులు ఇచ్చారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. సమాధానం చెప్పాలని నోటీసుల్లో కోరారు. ఇప్పుడు ఏపీ బీజేపీ సారథిగా సోము వీర్రాజు వచ్చారు. అమరావతి విషయంలో ఎంపీ సుజనాచౌదరి వ్యాఖ్యలు పార్టీ విధానం కాదని ఎంట్రీలోనే కౌంటర్‌ ఇచ్చారు వీర్రాజు. పార్టీ అధికారిక ట్విటర్‌ అకౌంట్‌ నుంచి గంటల వ్యవధిలోనే క్లారిటీ ఇచ్చేశారు. కానీ సుజనాకు నోటీసు ఇవ్వలేదు. వివరణా కోరలేదు. సుజనాను నోటీసులు, సస్పెన్షన్ల నుంచి మినహాయించారు. ఇది జరిగిన పది రోజులకే పార్టీ నుంచి మరో ఇద్దరిని సస్పెండ్‌ చేశారు. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా అమరావతి విషయంలో వ్యాసాలు రాశారని ఓబీ రమణపైనా.. రైతుల సభలో భిన్నంగా వ్యవహరించారని వెలగపూడి గోపాలకృష్ణపై వేటు వేశారు. ఇలా నెల వ్యవధిలో మొత్తం ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. 
 
క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉన్నట్లు మెసేజ్‌!

టీవీ చర్చా కార్యక్రమాల్లో పార్టీ లైన్‌ తప్పారనే కారణంగా  బీజేపీ నేతలు రఘురాం, టీడీపీ నుంచి బీజేపీలో చేరిన లంకా దినకర్‌లకు నోటీసులు ఇచ్చారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారే కాకుండా.. ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవారికి కూడా ఇలా నోటీసులు వెళ్లడం చర్చకు దారితీసింది. ఈ చర్యల ద్వారా ఏం చెప్పాలనుకున్నారనేదానిపై బీజేపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. క్రమశిక్షణ విషయంలో సీరియస్‌గా ఉన్నామనే మెసేజ్‌ అందరికీ పంపే ప్రయత్నమని కొందరు.. బీజేపీలో ఉన్న వర్గపోరు వల్ల ఇలాంటి చర్యలు తీసుకొంటున్నారని మరికొందరు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. 
 
సస్పెన్షన్లే  మార్గమా?

ఏపీలో బీజేపీకి గత ఎన్నికల్లో ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. నోటా కంటే తక్కువ వచ్చాయి. పైగా బీజేపీలో ఉన్న కొందరు తలోదారిన వెళ్తున్నారు. వీరిని కట్టడి చేయాలంటే సస్పెన్షన్లే సరైన మార్గమని నిర్ణయించినట్లుగా  తెలుస్తోంది. అయితే ఇలాంటి పోకడలు మంచిది కాదని.. పార్టీలో చర్చల ద్వారా పరిష్కారం చూపవచ్చని కొందరు సూచిస్తున్నారట. ఏదిఏమైనా బీజేపీలో సస్పెన్షన్లు.. నోటీసులు దుమారమే రేపుతోంది. మరి.. ఇవి ఎలాంటి మలుపు తీసుకుంటాయో చూడాలి.