రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ...

రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు ...

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి ఇంకా మిస్టరీగానే మిగిలింది. సుశాంత్ తండ్రి కె.కె. సింగ్ విజ్ఞప్తి మేరకు బీహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వెంటనే పని మొదలెట్టిన సీబీఐ, సుశాంత్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తితో పాటు మరో నలుగురిపై ఛార్జిషీట్ నమోదుచేసింది. తాజాగా ఈడీ నోటీసుల మేరకు రియా చక్రవర్తి, ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫీసుకి హాజరైంది. ఇప్పటికే శామ్యూల్ మిరాండాని 8 గంటల పాటు విచారించిన ఈడీ.. రియాతో పాటు సుశాంత్ ఫ్రెండ్ సిద్దార్థ్ పితాని మరియు శృతి మోదీకి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న రియా చక్రవర్తి నేడు ముంబై లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైంది.ఈ క్రమంలో పోలీసులు రియా చక్రవర్తి గతేడాది కాల్ రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం.. రియా చక్రవర్తి దర్శకనిర్మాత మహేష్ భట్ కు 16 కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆమె తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తితో 1122 సార్లు మాట్లాడారు. ఇక రియా మేనేజర్ సుశాంత్ బిజినెస్ మాజీ మేనేజర్ శృతి మోదీకి 808 కాల్స్ మరియు శామ్యూల్ మిరాండాకి 289 కాల్స్ చేసినట్లు తెలుస్తోంది. రియా తన బాయ్ ఫ్రెండ్ సుశాంత్ సింగ్ తో ఏడాది కాలంలో 147 సార్లు మాత్రమే మాట్లాడింది. వీరితో పాటు బాంద్రా డీసీపీ అభిషేక్ త్రిముఖితో రియా పలుమార్లు సంభాషించినట్లు వెల్లడైంది. డీసీపీ అభిషేక్ ప్రస్తుతం సుశాంత్ సూసైడ్ కేసుని హ్యాండిల్ చేస్తుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.