రోహిత్ ను బ్లైండ్‌గా నమ్మాను : సూర్య కుమార్‌ యాదవ్‌

రోహిత్ ను బ్లైండ్‌గా నమ్మాను : సూర్య కుమార్‌ యాదవ్‌

ప్రస్తుతం ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్‌ జట్టులో సూర్యకుమార్‌ యాదవ్‌ కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. 2012లో ముంబై ఇండియన్స్‌ సూర్యకుమార్‌ను కొనుగోలు చేసింది. కానీ అతనికి రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. ఆ తర్వాత 2014లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో సూర్యకుమార్‌ యాదవ్‌ను కేకేఆర్‌ కొనుగోలు చేసింది. కేకేఆర్‌ వెళ్లిన తర్వాత ఒక్కసారిగా అతని ఆటస్వరూపం మారిపోయింది.  ముఖ్యంగా ఐపీఎల్‌ 2015లో ముంబై ఇండియన్స్‌, కేకేఆర్‌ మధ్య  లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఆ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 98 చేసాడు. కేకేఆర్‌ తరపున సూర్యకుమార్‌ కేవలం 20 బంతుల్లో 5 సిక్స్‌లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు.  ఐపీఎల్‌ కెరీర్‌లో సూర్యకుమార్‌కు ఇదే టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఆ తర్వాత 2018లో జరిగిన వేలంలో సూర్యకుమార్‌ను రూ. 3.2 కోట్లతో మళ్లీ ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో మంచి ప్రదర్శన ఇస్తున్న సూర్యకుమార్‌ రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 79 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా మ్యాన్‌ ఆప్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్‌ మాట్లాడుతూ... ముంబై ఇండియన్స్‌కి ఆడిన కొత్తలో ఎక్కువగా లోయర్‌ ఆర్డర్‌లో ఆడేవాడిని. కానీ ఈరోజు నా ప్రదర్శనతో టాప్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు రావడం.. రాణించడం సంతోషంగా ఉంది.  గత రెండు మూడేళ్లలో నాలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు కారణం ముంబై కెప్టెన్‌గా ఉన్న రోహిత్‌ శర్మ. 2018లో నేను మళ్లీ ముంబై జట్టులోకి వచ్చిన తర్వాత రోహిత్‌ నన్ను నమ్మి టాప్‌ఆర్డర్‌లో బ్యాటింగ్‌ అవకాశం ఇచ్చాడు. ఆ సమయంలో అతను ఒకటే చెప్పాడు. నీ ఆట నువ్వు ఆడు.. ఫలితం అదే వస్తుంది. అప్పటినుంచి నేను రోహిత్‌ శర్మను గుడ్డిగా నమ్ముతూ వస్తున్నా.. అందుకే నా ఆటతీరు లో గణనీయంగా మార్పు చోటుచేసుకుంది అని తెలిపాడు.