కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్...

కేంద్రంపై సుప్రీం కోర్టు సీరియస్...

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌న్న ప్ర‌ధాన డిమాండ్‌తో దేశ రాజ‌ధాని ఢిల్లీ శివారులో సుదీర్ఘంగా రైతుల ఆందోళ‌న కొన‌సాగుతూనే ఉంది.. ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వం, రైతుల మ‌ధ్య ఎనిమిది ద‌శ‌లుగా జ‌రిగిన చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం కాలేదు.. అయితే, ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఆందోళనలు, వ్యవసాయ చట్టాల రద్దుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జ‌రిగింది. ఈ సందర్భంగా వ్యవసాయ చట్టాలు, రైతుల ఆందోళన విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. సాగు చట్టాలను సవాల్‌ చేస్తూ రైతులు దాఖలు  చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. కేంద్రం నిర్లక్ష్య వైఖరిని తప్పుబట్టింది. సమస్య పరిష్కారం అయ్యేవరకు చట్టాలను నిలుపుదల చేయాలని సూచించింది. లేదంటే తామే స్టే విధించాల్సి వస్తుందని హెచ్చరించింది.  ఆందోళనల్లో పాల్గొంటున్న రైతులు చనిపోతుంటే కనిపించడం లేదా అని కేంద్రాన్ని నిలదీసింది. వృద్ధులు, మహిళలుకూడా పోరాటం చేస్తున్నారని గుర్తు చేసింది. ఇప్పటికే పరిస్థితి విషమించిందని.. రక్తపాతం జరిగితే దానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నించింది. ఇన్ని రోజులు గడిచినా పరిష్కారం చూపకపోవడమేంటని కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది.